Featuredఅంతర్జాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ప్రగతి భవన్‌కు ప్రవేశం లేదు..

అనుమతి ఉన్నవారికే దారి..

మంత్రులైనా అనుమతి తప్పనిసరి..

గేటు నుంచే వెనుతిరుగుతున్న సీనియర్లు..

అధినేతపై నాయకుల్లో అసంతృప్తి..

అనుమతి ఉండాల్సిందే.. మీరు మంత్రులైనా, శాసనసభ సభ్యులైనా, సీనియర్‌ నాయకులైనా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అధినేతను కలవాలంటే ముందే అనుమతి కోసం దరఖాస్తు పెట్టాల్సిందే.. దరఖాస్తును పరిశీలించిన అధినేతకు నచ్చుతే సమాచారం వస్తుందీ, అదీ కూడా వారం కావచ్చు, నెల కావచ్చు, ఆరు నెలలు కావచ్చు.. ఇంకొంతమందికి అదీ కూడా దక్కడం లేదు. సమస్యలపై, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై చర్చిద్దామనే ఆలోచన వెళుతున్నవారికి అవకాశమే దక్కడమే లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. రాష్ట్రాన్ని పాలించే అధినేత సచివాలయానికి రారు.. వాస్తు బాగాలేదని ఉన్న సచివాలయాన్ని కూలగొడుతున్నారు.. ప్రగతి భవన్‌ నుంచే పరిపాలన కొనసాగిస్తూ, సమీక్షలు, సమావేశాలు అక్కడి నుంచే నడిపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. అధినేత అనుమతి ఇచ్చిన వారే ప్రగతి భవన్‌లోకి వెళ్లాలి లేదా ఎంతటి సీనియర్‌ నాయకుడైనా గేటు నుంచి వెనుదిరిగాల్సిందే.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఓటు వేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకుందామని ప్రగతి భవన్‌కు వెళుతే గేటు కూడా దాటలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రగతి భవన్‌లో జరిగే పలు కార్యక్రమాలు కూడా అనుమతి ఉన్నవారే లోపలికి వెళ్లాలి. ఎంత పెద్ద సీనియర్‌ నాయకులైనా, మంత్రులైనా, స్పీకరైనా, ఎమ్మెల్యెలైనా సరాసరి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండా పోదామంటే మాత్రం సెక్యూరిటి వారు ఆపి వెనక్కి పంపిస్తున్నా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. స్వంత పార్టీ శాసనసభ సభ్యులకే అవమానం జరిగితే మిగతా పార్టీ నాయకుల పరిస్థితి, సామాన్య జనాల పరిస్థితి ఏంటేనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.. ప్రజలను కలవడానికి ముఖ్యమంత్రికి తీరిక లేనందునే తాను ప్రజలను కలవడానికి సిద్దంగా ఉన్నామని ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గవర్నర్‌ ప్రకటించారు. ఈ ప్రకటన చూసైనా ముఖ్యమంత్రి ప్రజావాణి ఏర్పాటు చేస్తారో, లేదో చూడాల్సిందే..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

టిఆర్‌ఎస్‌ పార్టీ పునర్నిర్మాణం నుంచి ఉన్నా, ఉద్యమం సమయం నుంచి అధినేతకు దగ్గరి సంబంధం ఉన్నా సంబంధమే లేదు. అధినాయకుడు అనుమతి ఇస్తేనే అతనిని కలవాలి లేదంటే లేదు. బయట ఉన్నా సెక్యూరిటినే బయటికి పంపిస్తున్నారు. అధినేతను కలవడానికి ప్రగతి భవన్‌కు వచ్చి అవమానంతో వెనుదిరిగి వెళుతున్నా వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. టిఆర్‌ఎస్‌ మొదటి ప్రభుత్వంలో డిప్యూటి స్పీకర్‌గా వ్యవహరించినా పద్మా దేవేందర్‌ రెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. సిఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌లోకి వెళ్లడానికి ఆవిడకు అనుమతే లభించలేదు. ప్రగతి భవన్‌ గేటు వద్దే అడ్డుకున్న ప్రగతి భవన్‌ సెక్యూరిటీ అనుమతి లేనిదే లోపలికి పంపేది లేదని చెప్పడంతో చేసేదేమి లేక అక్కడే కొద్దిసేపు వేచి చూసినా పద్మాదేవేందర్‌ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. గవర్నర్‌ వీడ్కోలు పలికేందుకు వెళ్లాలని చెప్పినా సెక్యూరిటి మాత్రం మాట వినలేదు. మీకు ఏంట్రీ లేదని సెక్యూరిటి చెప్పిన మాటలకు ఆమెకు నోట మాట రాలేదని చెపుతున్నారు. సెక్యూరిటి ఇచ్చిన షాక్‌తో పద్మదేవేందర్‌ రెడ్డి గేటు బయటే నిలుచున్న సమయంలోనే అక్కడికి మంత్రి తలసాని కుమారుడు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సాయి కిరణ్‌కు మాత్రం సెక్యూరిటి లోపలికి ఆహ్వనం పలికారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి ఉంటూ, పార్టీలో కీలకనేతగా ఎదిగిన కూడా అనుమతి లేకపోవడం తీరని అవమానంగా భావించింది పద్మాదేవేందర్‌ రెడ్డి. గత వారంలో ప్రస్తుత డిప్యూటి స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ కూడా సిఎం కోసం ప్రగతి భవన్‌ గేటు వద్ద వేచి చూసి చూసి ఎంతసేపటికి అనుమతి రాకపోయేసరికి కోపంతో వెళ్లిపోయారని చెపుతున్నారు. స్వంత పార్టీలోని నాయకులకే అధినేతను కలవడానికి సమయం ఇవ్వకపోవడంలో తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అవకాశాన్ని బిజెపి ఆయుధంగా మలుచుకుంటూ ఒక్కొక్కరికి వల వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికి ఇతర పార్టీ నాయకులను భారీగా చేర్చుకుంటున్న బిజెపి తదుపరి లక్ష్యం టిఆర్‌ఎస్‌ నాయకులేనని అంటున్నారు. అధినేత ప్రవర్తన, అతను చేసే పనుల్లో ఎవ్వరిని చర్చించకుండా ఏకచ్చాధిపత్రంగా వ్యవహరిస్తారనే ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల గురించి ఆలోచించేదెప్పుడు..

అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉన్నారని, ఇటు ప్రజల్లో వ్యతిరేకత, అటు అధినేతను కలవాలంటే అనుమతి, ఆ అనుమతి కూడా ఎప్పుడోస్తుందో తెలియదు. ప్రజలకోసం పనిచేసే ముఖ్యమంత్రిని కలవడానికి ఇంత కష్టంగా ఉంటే గ్రామాల్లో, నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారమయ్యేదెప్పుడో అర్థం కాకుండా ఉన్నారు. స్వంత నియోజకవర్గాలకు వెళుతే ప్రజలు సమస్యలపై, పథకాలపై నిలదీస్తున్నారు. అధినాయకుడు మాత్రం అసలు నాయకులను కలవడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా ఒక నాయకుడు ముఖ్యమంత్రిని కలవడానికి సమయం అడుగుతే రెండు నెలల నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది. ఇంక చేసేదేమి లేక ఆ ప్రయత్నమే విరమించుకున్నట్లు సమాచారం. జిల్లాల నుంచి రాజధానికి రావడం ఎందుకనుగోని చాలా మంది సీనియర్‌ నాయకులు ఎవరి నియోజకవర్గాలకు వారే, ఎవరి గ్రామాలకు వారే పరిమితమైనట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినా, వాటి నిర్మాణాలు చేపట్టినా ఎవ్వరికి సమాచారం ఇచ్చిన దాఖలాలు లేవని అలాంటప్పుడు రాష్ట్రంలో జరిగే పెద్ద పెద్ద పనులపై, పడకేసినా పథకాలపై అడగడం మానేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అంటే ప్రతి నెలకోమారు ప్రభుత్వం చేసే పనులు, పార్టీ ఎదుగుదలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించి లోటుపాట్లపై చర్చించి వారి అభివృద్దికి, ఎదుగుదలకు పాటుపడాలి కాని ఇక్కడ తెలంగాణలో మాత్రం అలాంటి సాంప్రదాయం, ఆలోచన లేదంటున్నారు సీనియర్‌ నాయకులు.. ఒక పక్క బిజెపి పార్టీ అస్త్రశస్త్రాలతో యుద్దానికి సిద్దంగా వస్తుంటే అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ మాత్రం ఉన్న పార్టీ వాళ్లను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే కారు పార్టీకి మొదటికే మోసం వచ్చి కారు రిపేరుకు కూడా పనికి రాకుండా షెడ్డులోకి వెళ్లే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close