Featuredస్టేట్ న్యూస్

చరిత్రలోకి నిజామాబాద్‌

  • లోక్‌సభ ఫలితంపై ఉత్కంఠ..
  • గంట గంటకు పెరుగుతున్న టెన్షన్‌
  • మరో రికార్డు దిశగా నిజామాబాద్‌..
  • తొలిసారిగా కౌంటింగ్‌కు 36 టేబుళ్లు..

నిజామాబాద్‌ లోక్‌ సభ ఫలితాలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది హోరాహోరిగా సాగిన పోరులో గెలిచేదెవరు..? ఓడెదెవరు. ? అన్న చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. జాతీయ స్ధాయిలో చర్చానీయాంశంగా మారిన ఇందూరు ఎన్నికల ఫలితంపై జాతీయ స్ధాయిలో ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్ధులు పోటీ చేసినా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌-బీజేపీల మధ్యే సాగింది. గెలుపు రేసులో నువ్వా-నేనా అన్నట్లు ఇరు పార్టీలు తలపడ్డాయి. విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. నిజామాబాద్‌ లోక్‌ సభ ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీలతో పాటు జాతీయ స్ధాయిలో ఇందూరు ఫలితంపై వాడివేడి చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన లోక్‌ సభ నియోజకవర్గం నిజామాబాద్‌. కొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిదీ అన్నది చాలా ఉత్కంఠగా మారింది. ఇక్కడినుండి 185 మందికి పైగా పోటిలో ఉండడంతో ఇక్కడ ఫలితాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక బెట్టింగ్‌ బాబులు జోరుగా పందేలు కాస్తున్నారు కూడా.. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుండి సీఎం కుమార్తె సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ఇక బీజేపి అభ్యర్దిగా ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు ధర్మపురి అర్వింద్‌, కాంగ్రెస్‌ నుండి మధు యాష్కి పోటి చేసారు. వీళ్ళు మాత్రమే కాకుండా పసుపు, ఎర్రజొన్న రైతులు కూడా పోటిలో ఉన్నారు. ఇక్కడినుండి 185 మందికి పైగా పోటిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మాత్రం టీఆర్‌ఎస్‌, బీజేపి, కాంగ్రెస్‌ మధ్యే త్రిముఖ పోటి నడుస్తుందని ముందుగా రాజకీయ విశ్లేషకులు భావించారు. మొదటినుండి కవిత విజయం పక్కా అనుకున్నా అనూహ్యంగా ధర్మపురి అర్వింద్‌ పోలింగ్‌ నాటికీ పుంజుకున్నారని పోలింగ్‌ సరళిని బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పోటి టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపి అన్నట్టుగా సాగిందని ఇక కాంగ్రెస్‌ ఇక్కడ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు.. ఇక ఇక్కడ మహిళల ఓటింగ్‌ శాతం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది. మహిళల ఓట్లు మాత్రమే తమకే పడ్డాయని ఇరు పార్టీల నేతలు అనుకుంటున్నారు. మరి మహిళలు ఎవరిని కరునించారో తెలియాలంటే మే 23 వరకు ఆగక తప్పదు.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలున్నాయి. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వస్తాయి...? ప్రత్యర్ధి పార్టీకి వచ్చే ఓట్లెన్ని..? పోలింగ్‌ సరళి తదితర అంశాలపై నివేదికలు తెప్పించుకున్న ఆయా పార్టీల అభ్యర్ధులు గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో అధికారులు మునిగిపోగా.. అభ్యర్ధుల్లో టెన్షన్‌ గంట గంటకు పెరుగుతోంది. ఇటు నిజామాబాద్‌ బాద్‌ షా ఎవరన్నది ఎవరూ అంచనాకు రాలేకపోతున్నారు. మొన్నటి వరకు లక్షల్లో మెజార్టీ అనుకున్న పార్టీలు సైతం ఇప్పడు గెలిస్తే చాలు అనుకునేలా పోలింగ్‌ సరళి సాగడంతో. ఏ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్ధితి ప్రధాన పార్టీల్లో నెలకొంది. 2014 ఎన్నికల్లో తలపడిన నేతలే ఈ సారి మళ్లీ తలపడ్డారు. కాంగ్రెస్‌ నుంచి మధు యాష్కి పోటీ చేయగా. టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంటల కవిత పోటీ చేశారు. బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ స్థానంలో ధర్మపురి అరవింద్‌ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన పోటిని సైతం ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌ ఇవ్వలేకపోయారు పూర్తిగా సైలెంట్‌ అవ్వడంతో ప్రదాన పోటి టిఆర్‌ఎస్‌, బిజెపి మద్యనే సాగింది. రెండు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు గెలుపై దీమాతో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మైనార్టీ ఓట్లు, పెన్షన్‌ దారులు, మహిళల ఓట్లతో గట్టెక్కుతాననే ధీమాలో టీఆర్‌ఎస్‌ ఉండగా యువత, మున్నూరు కాపు, విద్యావంతులు, నిరుద్యోగుల ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌ ఓట్లు సైతం బీజేపీకి మళ్లాయని కమల నేతలు గెలుపు పై ధీమాగా ఉన్నారు. ¬రా¬రిగా ఎన్నికలు జరగడంతో ఎవరు విజేతగా నిలుస్తారన్నది రాజకీయ విశ్లేషకులకు సైతం ఓటరు నాడి అంతు చిక్కడం లేదట. ప్రభుత్వ పథకాలకు ప్రజలు జై కొట్టారా మోడీ చరిష్మా ఏమేరకు పని చేసింది అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

తొలిసారిగా కౌంటింగ్‌కు 36 టేబుళ్లు..

లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డులతో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ కౌంటింగ్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకోనుంది. దేశంలోనే తొలిసారిగా ఓట్ల లెక్కింపు కోసం 36 టేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఎన్నిక మరో రికార్డును సొంతం చేసుకోనుంది. 36 టేబుళ్ల పై ఓట్లు లెక్కించే నియోజవకర్గంగా నిజామాబాద్‌ చరిత్రలోకి ఎక్కనుంది. నిజామాబాద్‌ లోక్‌ సభ ఎన్నికలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అభ్యర్థుల పోటీ నుంచి ఇప్పుడు కౌంటింగ్‌ వరకు ప్రతీ విషయంలోనూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌ లోక్‌ సభ ఓట్ల లెక్కింపు కోసం దేశంలోనే తొలిసారిగా 36 టేబుళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలతో కలిపి 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. నోటాతో కలిపి 186 గుర్తులతో ఎన్నిక జరిగింది. ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారిగా 12 బ్యాలెట్‌ యూనిట్లతో ఎం-3 యంత్రాల ద్వారా పోలింగ్‌ నిర్వహించారు. ఇప్పటి వరకు 24 టేబుళ్ల పైనే ఓట్లు లెక్కించిన రికార్డు ఉండగా 36 టేబుళ్లపై లెక్కించేందుకు అనుమతి పొందడంతో.. దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం మరో రికార్డును నమోదు చేయనుంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 1788 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించారు. 18 టేబుళ్ల ద్వారా ఓట్లు లెక్కిస్తే 13 నుంచి 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఇందుకు 31 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. లెక్కింపు పక్రియ ఆలస్యం జరగకుండా ఉండేందుకు 36 టేబుళ్లకు అనుమతి ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రెండేసి కౌంటింగ్‌ హాళ్లలో ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. కోరుట్ల, జగిత్యాలలో 15 రౌండ్లలో, బాల్కొండ, బోధన్‌లో 14 రౌండ్లలో, ఆర్మూర్‌లో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు 36 టేబుళ్ల ఏర్పాటు చేయడం ద్వారా రౌండ్ల సంఖ్య సగానికి సగం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని స్థానాలతో పాటే నిజామాబాద్‌ ఎంపీ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నిజామాబాద్‌ ఎన్నిక ఈసీ చరిత్రలో ఓ మైలురాలిగా మిగలగా.. కౌంటింగ్‌ పక్రియ సైతం సరికొత్త రికార్డు సృష్టించి చరిత్రలో మిగలనుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close