కొలువుదీరిన కొత్త మంత్రులు

0
  • పదిమందితో ప్రమాణం చేయించిన గవర్నర్‌
  • పాతకొత్తల కలయికగా కేబినేట్‌
  • విధేయులకే పట్టం కట్టిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన 66 రోజుల తర్వాత తెలంగాణ మంత్రివర్గం కొలువుదీరింది. తొలి విడతలో తనతో పాటు మహమూద్‌అలీకి చోటు కల్పించిన సీఎం కేసీఆర్‌… రెండో విడతలో తాజాగా పదిమందికి చోటు కల్పించారు. తొలిసారిగా ఆరుగురు ఎమ్మెల్యేలకు అమాత్యయోగం పట్టింది. సామాజిక సవిూకరణలు పరిగణనలోకి తీసుకొని లెక్క తప్పకుండా పక్కా పకడ్బందీగా మంత్రివర్గాన్ని విస్తరించారు… తన మార్కు చూపించారు కేసీఆర్‌….

హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పది మంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దాదాపు రెండు నెలల విరామం తరవాత సిఎం కెసిఆర్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. మొదట నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చివరగా మేడ్చెల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రమాణం చేశారు. మంత్రులుగా ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన అనంతరం నేతలు కేసీఆర్‌ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రులంతా తెలుగులోనే ప్రమాణం చేయడం విశేషం. అందరూ ఊహించినట్లుగానే ఈ విస్తరణలో హరీష్‌ రావు, కెటిఆర్‌లకు చోటు దక్కలేదు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవానికి మొత్తం 1200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు. శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబరు 13న సీఎం కేసీఆర్‌, మంత్రి మహమూద్‌అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. తర్వాత 66 రోజులకు విస్తరణ జరిగింది. మంత్రివర్గ కూర్పుపై సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ప్రజాసంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యాలు, సామాజిక సవిూకరణాలు, అనుభవం, రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తుది జాబితాను రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి వచ్చే ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించిందీ వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ¬ంమంత్రి మహముద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్‌, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలకు సీఎం కేసీఆర్‌ రెండో దఫా అవకాశం కల్పించారు. నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి కొత్తవారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఇప్పటివరకు మంత్రిగా పనిచేయలేదు. ఆయన మొదటిసారి మంత్రి అవుతున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డి తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్‌ ¬దాలో పనిచేశారు. కొప్పుల ఈశ్వర్‌ తెలంగాణ మొదటి అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేయగా, వేముల ప్రశాంత్‌రెడ్డి మిషన్‌భగీరథ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. వీ శ్రీనివాస్‌గౌడ్‌ను గత ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా సీఎం కేసీఆర్‌ నియమించారు. అయితే కోర్టు కేసు కారణంగా పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దయ్యాయి. దీంతో ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగారు. మల్లారెడ్డి గతంలో ఎంపీగా ఉన్నారు. మొత్తంగా అనుభవజ్ఞులతోపాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరికి మంత్రులుగా అవకాశం కల్పించారు.అనంతరం గవర్నర్‌, సిఎం కెసిఆర్‌లతో కలసి మంత్రులు గ్రూఫు ఫోటో దిగారు.

ఇక- మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేల విషయానికొస్తే…

వనపర్తి నుంచి తొలిసారి ఎన్నికైన నిరంజన్‌రెడ్డి గత ప్రభుత్వంలో ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మొదటి నుంచి పార్టీలో ఉండటం, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో అమాత్య యోగం పట్టింది. ఇక బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి 2001 నుంచి టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా... 2014లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌గా పనిచేసి ఇప్పుడు మంత్రి అయ్యారు. 

మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లోనే ఉన్న ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌ వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పని చేసిన అనుభవం ఇప్పుడు మంత్రిని చేసింది. పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి మూడు టర్మ్‌లు వర్ధన్నపేట నుంచి, రెండోసారి మూడుసార్లు పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డబల్‌ హ్యాట్రిక్‌ సాధించారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి 2019లో మంత్రి పదవి సాధించారు. 

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి 2014లో మొదటిసారి గెలుపొందారు. గత ప్రభుత్వంలో విద్యుత్‌, షెడ్యూల్‌ క్యాస్ట్‌ అభివృద్ది శాఖల మంత్రిగా పని చేయడం, కేసీఆర్‌ సన్నిహితుడు కావడం కలిసి వచ్చింది. ఐదుసార్లు ఎమ్మెల్యే గెలిచిన అనుభవం, మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అచ్చొచ్చింది. నిర్మల్‌ నుంచి గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి గతంలో రెండుసార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో బీఎస్పీ నుంచి ఎన్నికై పార్టీని టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ప్రభుత్వంలో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి ఇప్పుడు రెండోసారి మంత్రి అయ్యారు.

మేడ్చల్‌ గెలిచిన చామకూర మల్లారెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇంతలోనే అనూహ్యంగా అమాత్యయోగం పట్టింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్‌ 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఉద్యోగ సంఘం నాయకునిగా పనిచేశారు. ప్రస్తుతం మొదటిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ ముందు నుంచే టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా పనిచేసిన అనుభవంతో పాటు.. 2014 ప్రభుత్వంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల నిర్వహించడం కలసివచ్చింది. 

మొత్తానికి రెండో విడత విస్తరణలో... రెడ్డి సామాజిక వర్గం నుంచి ఐదుగురికి, బీసీల నుంచి ముగ్గురికి, ఎస్సీ నుంచి ఒకరు, వెలమ నుంచి మరోకరికి చోటు దక్కింది. ఉమ్మడి పాలమూరు కరీంనగర్‌ల నుంచి ఇద్దరిద్దరికి, ఉమ్మడి నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, వరంగల్‌ నుంచి ఒక్కొకరికి ఛాన్స్‌ వచ్చింది. 

రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం అంటే 120 మందిలో సీఎంతో కలిపి 18 మందికి క్యాబినెట్లో చోటు కల్పించే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం 10 మందితో కలిపి మంత్రివర్గంలో మొత్తం 12 మంది అయ్యారు. ఇంకో 6 ఖాళీలు ఉన్నాయి. వీటిని లోక్‌సభ ఎన్నికల తరవాత భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీలకు, మహిళలకు క్యాబినెట్లో చోటు కల్పించడంలాంటి సామాజిక సవిూకరణాలపై ముఖ్యమంత్రి అప్పుడే దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి చోటు దక్కని మరికొంత మందికి అప్పుడు చాన్స్‌ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

బాక్స్‌

అప్పుడూ 12.. ఇప్పుడూ 12..

సీఎం కేసీఆర్‌కు వాస్తు, లక్కీ నంబర్‌, ముహూర్తం అంటే ఎంత సెంటిమెంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణలోనూ కేసీఆర్‌ గతంలో కొనసాగించిన సాంప్రదాయాన్నే ఫాలో అయ్యారు. గత ప్రభుత్వంలో మొదట కేబినెట్‌ మంత్రులు 12 మంది ఉండే వారు. ఇప్పడు, మంత్రి వర్గ విస్తరణతో తాజాగా మంత్రుల సంఖ్య సీఎంతో కలిపి 12కు చేరింది. కేబినెట్‌ విస్తరణలో సీఎం కేసీఆర్‌ గతంలో అనుసరించిన సెంటిమెంట్‌ నే కొనసాగించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత, 2014లో ఏర్పాడిన తొలి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ తో పాటు మొత్తం 12మందికి అప్పటి మంత్రివర్గంలో చోటు దక్కింది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్‌, మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా తొలి విడత విస్తరణలో 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ప్రసుత్తం కేబినెట్‌ లో మంత్రుల సంఖ్య సీఎంతో కలిపి మొత్తం 12కు చేరింది.

2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తెలంగాణ తొలి మంత్రివర్గంలో మొత్తం 12మంది మంత్రులు ఉన్నారు. అనంతరం జరిగిన కేబినెట్‌ విస్తరణలో మరో ఆరుగురికి చోటు దక్కడంతో మంత్రుల సంఖ్య సీఎంతో కలిపి 18కి చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్‌ గత ఏడాది డిసెంబరు 13న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో కేసీఆర్‌ తో పాటు మహ్మద్‌ అలీ మాత్రమే మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సుమారు రెండు నెలల తర్వాత, మళ్లీ ఇప్పుడు కేబినెట్‌ విస్తరణ జరిగింది. తొలి విడత విస్తరణలో మరో 10మందికి మంత్రులుగా బెర్త్‌లు దక్కాయి. దీంతో తెలంగాణ కేబినెట్‌ మంత్రుల సంఖ్య పన్నెండుకు చేరింది. దీంతో గులాబీ బాస్‌, గతంలో అనుసరించిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here