పోలీసుల వైఫల్యం వల్లే అంబర్‌పేట్‌ ఘటన ..

0

  • డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిన బీజేపీ నాయకులు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇంటర్‌మీడియట్‌ ఫలితాల విషయంలో ప్రభుత్వం చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అంబర్‌పేట్‌లో గొడవలు పెట్టారని పరోక్షంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్‌ మండిపడ్డారు. అంబర్‌పేట్‌లో ఆదివారం రాత్రి చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలో బీజేపీ నాయకులు దత్తాత్రేయ, కిషన్‌ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిశారు. అనంతరం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అంబర్‌పేట్‌లో రెండు కోట్ల 26 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు ప్రజలు స్థలాలకు నష్ట పరిహారం చెల్లించి తీసుకున్నారని తెలిపారు. అంబర్‌పేట్‌లో లేని సమస్యలను సృష్టించేందుకే ఎంఐఎం ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడితే స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, స్థానికులు అక్రమంగా వేసిన షెడ్‌ను తొలగించాలని ధర్నా చేస్తే లాఠీఛార్జ్‌ చేశారని ఆరోపించారు. స్థానికులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన రాజాసింగ్‌ను ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అమానుషంగా, క్రూరంగా పోలీసులు ప్రవర్తించారని, అరెస్ట్‌ చేసి అర్ధరాత్రి వరకు నిర్బంధించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన సంభవించిందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని లక్ష్మణ్‌ వెల్లడించారు. ప్రభుత్వ డబ్బుతో నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్‌ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్ధన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లైఓవర్‌ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్‌ చేస్తే స్థానిక అంబర్‌ పేట్‌ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ప్రశ్నించిన స్థానికుల మీద లాఠీచార్జి చేసి బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కమిషనర్‌ సమక్షంలో తూలనాడారని చెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద పోలీసులు వ్యవహారం చాలా దురుసుగా ఉందని, అనేక సందర్భాల్లో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్థలంలో షెడ్‌ వేసి ప్రార్ధన చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీని వదిలేసి, కాపాడటానికి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బేడీలు వేసి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యను దృష్టి మరల్చడం కోసమే మజ్లిస్‌ సహకారంతో ఇలా చేశారని ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపుతోందని అన్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న పరిషత్‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం విడ్డూరమని, ఓటు వేయనందుకు ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

శాంతియుత వాతావారణం చెడగొట్టే యత్నం: దత్తాత్రేయ…శాంతియుతంగా ఉన్నవాతావరణం చెడగొట్టే యత్నం జరుగుతోందని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. ఫ్లైఓవర్‌కు అడ్డం పడేవిధంగా అక్రమ నిర్మాణం చేయబోయిన మజ్లిస్‌ ఎమ్మెల్యేల మీద పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలం మీద వక్ఫ్‌బోర్డు పేరు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలకు బేడీలు వేస్తారా.. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. అరాచక శక్తులకు స్వేచ్ఛ ఇచ్చి పోలీసులు పక్షపాతధోరణి అవలంబిస్తోన్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here