Featuredరాజకీయ వార్తలు

తెరాస అభ్యర్థులకు భద్రత కావలెను

ప్రజల్లోకి వెళ్లాలి… ప్రచారం చెయ్యాలి… ఉన్నదీ లేనట్టు.. లేనిది ఉన్నట్లుగా చెప్పాలి.. ఓటర్లను ఆకట్టుకోనేలా మాయ మంత్రాలు సిద్దం చెయ్యాలి.. ప్రజలతో ఆడాలి.. పాడాలి.. రాజకీయం ప్రచారం అంటేనే కలగూర గంప.. ప్రజలతో ఉండి, ప్రజల మధ్యలో తిరిగే వారికి ప్రజలు కూడా సాదరంగా స్వాగతం పలుకుతారు.. నాయకులు చెప్పినమాటలను వింటూ, ఎన్నికల ముందే నచ్చుతే ఓటేస్తారు.. లేకుంటే తిరస్కరిస్తారు.. కాని బంగారు తెలంగాణను పాలించిన తెరాస అభ్యర్థులకు మాత్రం ప్రజల్లోకి వెళ్లాలంటేనే భయం పుడుతోంది… ఇది మావోయిస్టుల భయం కానేకాదు.. ప్రజల వ్యతిరేకత.. ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు తట్టుకోలేక తమకు భద్రత పెంచాలని అధినేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అధికారం కావాలి.. అధికారంతో శాసించాలి అందుకు ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలుపు సాధిస్తేనే మనం అనుకున్న అధికారం వస్తుంది.. ప్రజలకు ఆకర్షించే తాయిలాలు ప్రకటించాలి.. అవి నేరవేరుతాయా, లేదా అనేది వేరే విషయం, అధికారం వచ్చాక అవకాశం ఉంటే అమలుచేద్దాం లేదంటే లేదనుకునే రోజులు నేడు పోయాయి. ఇప్పటివరకు మా గ్రామానికి ఏమి చేశావు. ఇక ముందు ఏమి చేయబోతున్నావు అంటూ ఓటర్లు నిలదీయడంతో బరిలో ఉన్న అభ్యర్థులకు ఏం సమాధానం చెప్పాలో, ఏలా స్పందించాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెరాస సిట్టింగ్‌ అభ్యర్థులందరికి అధినాయకత్వం మళ్లీ అవకాశాలు కల్పించింది. సీట్లు వచ్చాయనే సంతోషంతో ఉన్న అభ్యర్థులకు ప్రచారంలో అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు మీరేమి చేయలేదు, మళ్లీ ఎందుకు వచ్చారంటూ నిలదీయడం ప్రారంభించారు. ప్రచారం తమ వల్ల కాదంటూ తమకు భద్రత మరింత పెంచాలంటూ అధినాయకుడి ముందు తెరాస అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏలాంటి ముందస్తు షెడ్యూల్‌ లేకుండానే బరిలోకి దిగిన గులాబీ అభ్యర్థులతో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ భేటీ అవ్వడంతో అభ్యర్థుల వారి ప్రాంతంలో ఉన్న పలు సమస్యలపై స్పందించారు. ప్రతిపక్షంతో బాధ లేదు కాని మనం అనుకున్న పనులు, వాగ్దానాలు అమలుకాక చాలా ప్రాంతాల్లో ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారని, దానికి తోడు ఆసమ్మతి నాయకుల వ్యతిరేక ప్రచారం మరింత ఎక్కువవడంతో ఏమి చెయ్యాలో అర్థమే కావడం లేదంటున్నారు. ఆసమ్మతి నాయకులనైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని, అప్పుడు ఇరువురూ కలిసి పార్టీ విజయానికి కృషిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. వారికి తోడు వీరు, వీరికి తోడు వారు కలిసిపోవడంతో ప్రచారానికి వెళ్లాలా వద్దా అనే సందిగ్దంలో పలువురు అభ్యర్థులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గండ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆవేదనలు మాత్రం తీర్చలేనంతగా ఉన్నాయి. గులాబీ అధినేత ఫామ్‌హౌజ్‌లో కూర్చోని ప్రణాళికల మీద ప్రణాళిలు వేస్తుంటే అభ్యర్థుల నుంచి వచ్చిన విన్నపాలు మరింత చిక్కుల్లో పడేసేలా ఉండడంతో కెసిఆర్‌ పెద్ద తలనొప్పిగా మారనుంది. ఇప్పుడు మళ్లీ ఏమి చెయ్యాలో, ఏలా ప్రణాళిక వెయ్యాలో అని ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తుంది. రోజురోజుకు ఎన్నిలు దగ్గర పడడంతో స్థానికంగా ఎదురవుతున్న సమస్యలపై ఏలా స్పందించాలనేది తెరాసకు ముందున్న అతి పెద్ద సవాలు..

ప్రచారానికి భద్రత కావాలంటున్న తెరాస అభ్యర్థులు..ఆసమ్మతి నాయకులు వ్యతిరేకతతో పాటు గ్రామాల్లోని ఓటర్ల అడుగడు గునా ప్రశ్నించడంతో పాటు తమపై దాడులు జరిగే అవకాశం ఉన్నాయని అందుకు తమకు తగినంత భద్రత కావాలంటున్నారు తెరాస అభ్యర్థులు. గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరింత పోలీస్‌ భద్రత తప్పనిసరంటున్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ పార్టీ అధికారంలో ఉన్న కూడా సగానికి పైగా అధికార పార్టీ నాయకులు గ్రామాలను పట్టించుకుందీ లేదు. పర్యటించిదీ లేదు. సమస్యలపై ప్రజలు వస్తే మాత్రం వారికి అందుబాటులో ఒక్కరంటే ఒక్కరూ కూడా లేరనే ఆరోపణలున్నాయి. ప్రజల అవసరాలను, సదుపాయాలను పెద్దగా పట్టించుకోకుండా తమ దారిన తాము ఉండటం,తమ వ్యక్తిగత ప్రయోజనాల మీద దృష్టి పెట్టారే కాని, ప్రజా సమస్యల పరిష్కారం మీద పెద్దగా దృష్టి పెట్టిందీ లేదు.అందులో ముఖ్యంగా నల్గండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటంతో వారికి తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది.

కెసిఆర్‌ సర్వేకు భిన్నంగా వ్యతిరేకత..తెలంగాణ అధినేత కెసిఆర్‌కు పలు నియోజకవర్గాల్లో సర్వేల మీద సర్వేలు చేపించారు. అభ్యర్థుల పనితీరు, ప్రవర్తనమిగతా అంశాలపై పలు మార్లు వివిధ వర్గాలతో సర్వే చేపించారని వినికిడి. అందరి రిపోర్టు, అన్ని సర్వేల రిపోర్టు తెచ్చుకున్నాకే గుండె ధైర్యంతో అడుగు ముందుకేసినట్లు తెలుస్తుంది. కాని ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు కెసిఆర్‌ సర్వేపైనే ఆయనకే అనుమానాలు వస్తున్నట్లు తెలుస్తుంది. తాను చేయించిన సర్వేల్లో భారీ మెజార్టీతో పార్టీ గెలుస్తుందన్న అంచనాలు చెబుతున్న కెసిఆర్‌ మాటలకు భిన్నంగా జరుగుతుండటంతో ఇప్పుడు పెద్ద చిక్కుగా మారిపోయింది. తెరాస పార్టీలో ఇప్పుడు ఇదీ పెద్ద సమస్యగా తయారయ్యింది. ప్రచారానికి రక్షణ కోరుతుండటంతో అభ్యర్థులకు ఎంతగా వ్యతిరేకత ఉందోనని అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నికల సమయం రోజురోజుకు దగ్గరపడుతుందీ, మహకూటమి అంచనాలకు మించి దూసుకువస్తుంది. వారిని ఎదుర్కోవడమే పనిగా పెట్టుకున్న గులాబీ బాస్‌, ప్రజల్లో ఉన్న ఉన్న వ్యతిరేకతను ఇప్పట్లో పరిష్కరించే అవకాశం ఉందా, లేదా అనేది నేడు ప్రధానాంశంగా మారిపోయంది. నేతలు పోలీసులు రక్షణ కోరటం అనేది మామూలే. ఎందుకంటే రౌడీలు, మావోయిస్టులు నుంచి రక్షణ కోసం కోరుతుంటారు కాని సామాన్య ప్రజల నుంచి వెల్లువెత్తే వ్యతిరేకత నుంచి తమను తామురక్షించుకోవడం కోసం సెక్యూరిటిని మరింత పెంచాలన్న అభ్యర్థులకు కెసిఆర్‌ షాక్‌కు గురవుతున్నారని తెలుస్తోంది. ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఏలాంటి ప్రజాదరణ ఉందో తెలిపోతుంది. కేటాయించిన 107 సిట్టింగ్‌లలో సగం మంది గెలిస్తారనే ఆశతో ఉన్న కెసిఆర్‌కు మొత్తం సీన్‌ అంతా రివర్స్‌లా కనిపించడంతో ఏమి చేద్దామనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాన్ని ఏలా ఎదుర్కోవాలి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఏలా తట్టుకోవాలనేది కెసిఆర్‌ ముందున్న రెండు అతి పెద్ద సవాళ్లు. భద్రత కేటాయించి ప్రచారం చేపట్టినా ప్రజల్లో ఆదరణ లేకపోతే, ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోతుందనే పార్టీ శ్రేణులు అంటున్నారు. సమయం తక్కువగా ఉండటంతో గెలిచే స్థానాలపై వ్యతిరేకతను దూరం చేసేలా కొత్త పంథాతో ముందుకు నడుస్తే సగం సీట్లన్న సాధించవచ్చని పార్టీ నాయకత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పదో, పరకో తక్కువైనా మద్దతు తెలపడానికి మిత్రపక్షాలు ఉన్నాయనే భరోసా ఉంది. అందుకు సాధ్యమైనంతగా గెలుస్తామనే ఆశ ఉన్నపై ప్రత్యేక దృష్టి పెడుతే చాలనే ఆలోచనలో కెసిఆర్‌ ఉన్నారని తెరాస సీనియర్‌ నాయకులు అంటున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close