నాథూరాం గాడ్సే దేశభక్తుడు!

0

  • సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

భోపాల్‌ : ఫైర్‌బ్రామడ్‌ నేత, భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడని, ఆయన దేశభక్తుడిగానే దేశప్రజల్లో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. గురువారం తమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాడ్సేను ఉగ్రవాదిగా పిలిచే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో దీటుగా బదులిస్తారని అన్నారు. గాడ్సేకు దేశంపై ఎంతో భక్తిభావాలున్నాయని అన్నారు. తాజాగా ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలు మరో వివాదానికి ఆజ్యం పోశాయి. కాగా, మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలపై పలుచోట్ల ఫిర్యాదులు అందగా ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి – జీవీఎల్‌

గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ నేత, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఖండించారు. వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో బీజేపీ అంగీకరించదని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యల విషయమై పార్టీ వివరణ కోరుతుందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని జీవీఎల్‌ కోరారు.

బీజేపీ వైఖరినే ఆమె వెల్లడించారు – ఒవైసీ

గాంధీని చంపిన గాడ్సే ఓ దేశభక్తుడు అంటూ బీజేపీ నేత, భోపాల్‌ లోక్‌ సభ స్థానం అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఘాటుగా స్పందించారు. 'ఇదేదో పిచ్చితనంతో చేసిన వ్యాఖ్య కాదు, ఆమె వ్యక్తిగత అభిప్రాయం అంతకన్నా కాదు. స్వతంత్ర భారతదేశపు మొదటి ఉగ్రవాదిపై బీజేపీ వైఖరినే సాధ్వీ ప్రజ్ఞా తన మాటల ద్వారా వెల్లడించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెనకేసుకురావడమే కాదు, ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా నరేంద్ర మోడీ బలపరుస్తున్నారు. మరికొన్నేళ్లలో వీళ్లు శ్రీ గాడ్సే గారి పేరు భారతరత్న అవార్డుకు కూడా సిఫారసు చేస్తారు... చూస్తూ ఉండండి' అంటూ ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here