సర్పంచ్‌ ఎన్నికలకు మోగిన నగారా

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణ రాష్ట్రం మరో ఎన్నికల పర్వానికి సిద్ధమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కొత్త సంవత్సరం తొలి రోజైన మంగళవారం (జనవరి 1) సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో సర్పంచ్‌ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. జనవరి 21, 25, 30 తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలవుతుందని ఈసీ వెల్లడించింది. నవంబర్‌ 19 వరకు ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరికీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వినియోగించే హక్కు ఉంటుందని ఈసీ తెలిపింది. జనవరి 7వ తేదీన మొదలయ్యే తొలి దశ 21తో ముగుస్తుంది. 11న మొదలయ్యే రెండో దశ 25న, 16న మొదలయ్యే మూడో దశ జనవరి 30తో ముగుస్తుంది. పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,13,190 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు. తొలి విడతలో 4480 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో 4137, మూడో విడతలో 4115 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలు.. 1,13,170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ పంచాయతీ ఎన్నికల ప్రత్యేకత.. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 12,571 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో కోలాహలం

నెలకొంది.కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తండాల్లో సందడి నెలకొంది.పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్ల పద్ధతిలో నిర్వహించనున్నారు.ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు కూడా ఉంటుంది. ఉప సర్పంచ్‌ను చేతులు ఎత్తడం ద్వారా పాత పద్ధతిలోనే ఎన్నుకుంటారు.

డిపాజిట్‌ మొత్తం ఇలా.. సర్పంచ్‌ పదవి కోసం పోటీ చేసే జనరల్‌ అభ్యర్థి రూ. 2,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులైతే.. జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here