ముహూర్తం కుదిరింది..!

0

తెలంగాణ కొత్త అసెంబ్లీకి త్వరలో శంకుస్థాపన

  • 27లోగా భూమిపూజకు సర్కార్‌ తొందర
  • శరవేగంగా ఎపికి కేటాయించిన భవనాల అప్పగింత
  • నాలుగురోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ
  • తెలంగాణ సిఎస్‌ ఎస్‌కె జోషితో ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు

హైదరాబాద్‌ :

కొత్త సెక్రటేరియేట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 27లోపు కొత్త భవనం నిర్మాణ శంకుస్థాపన చేసేందుకు సాదారణ పరిపాలనా శాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ సెక్రటేరియేట్‌లో ఉన్న నాలుగు బ్లాక్‌లను కూల్చివేసి కొత్త సెక్రటేరియేట్‌ నిర్మించనున్నారు. దీనిపై రెండు రోజుల్లో జరిగే కేబినెట్‌ లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త భవనం నిర్మించేవరకు ఏపీకి కేటాయించిన సచివాలయంనుంచి పరిపాలన జరగనుంది. ఇప్పటికే ఎపికి కేటాయించిన భవనాలను జిఎడికి అప్పగించేందుకు అందులో ఉన్న ఫర్నీచర్‌ను ఎపికి తరలిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎపీకి కేటాయించిన భవనాలు 4 రోజుల్లోగా అప్పగించనున్నారు. సీఎస్‌ జోషితో సమావేశమైన తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియేట్‌ భవనాలను జనరల్‌ అడ్మినిస్టేష్రన్‌ డిపార్ట్‌ మెంట్‌కి.. అసెంబ్లీ భవనాలను అసెంబ్లీ కార్యదర్శికి.. ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్‌ ఆఫీసర్లకు అప్పగించనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌కు అప్పగించిన బ్లాకుల్లో ఉన్న సామాగ్రిని అమరావతికి తరలిస్తున్నారు. ప్రభుత్వ సమ్మతితో సెక్రటేరియట్‌ భవనాలను తెలంగాణ రాష్టాన్రికి అప్పగించాలని గవర్నర్‌ నిర్ణయించడంతో సామాగ్రిని ఏపీకి తరలిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఏపీ తరఫున ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ తరఫున రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ భేటీలో ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్‌ ఆఫీసర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా భవనాల అప్పగింత కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 27లోగా కొత్త సచివాలయ భవనానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ భవనాలు తెలంగాణకు అప్పగించినట్లయితే.. సచివాలయాన్ని ఏపీలో భవనాల్లోకి మార్చే వీలుంటుంది. 27వ తేదీ దాటితే మరో మూడు నెలల వరకు మంచి రోజులు లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భవనాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here