నిధుల మూట విప్పని ఎంపీలు..

0

పల్లెలో తాగడానికి నీళ్లుండవు… నడవడానికి రోడ్లుండవు… చదువుకుందామంటే ప్రభు త్వ బడికి పైన కప్పే ఉండదు.. నిత్యం సమస్యలతో సతమతమయ్యే పల్లెలు మనదేశంలో ఒక్కటి కాదు, రెండు కాదు లక్షల్లో ఉన్నాయి.. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రతి సంవత్సరం కోట్లలో నిధులు వస్తున్న వాటిని ఓట్లేసిన ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి మాత్రం మనసు రావడం లేదు. అసలు ప్రతి సంవత్సరం ఎంపీలాడ్స్‌ నిధులు ఎన్ని మంజూరు అవుతాయో, వాటిని ఏలా ఖర్చు పెట్టాలో తెలియక ఆ నిధుల మూట విప్పని ఎంపీలు ఒక్కరూ కాదు, ఇద్దరూ కాదు వందల్లో ఉన్నారు. గెలవడానికి, అధికారం చెలాయిం చడానికి మాత్రమే పనికొస్తున్న మన నాయకులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, వారికి వచ్చే నిధులను ఖర్చు చేయడంలో అందరూ వెనబడిపోతు న్నారు. నిధుల మూట విప్పని ఎంపీలు మనకెందుని ప్రశ్న నేడు ఓటర్లలో తలెత్తుతుంది. కనీస అవసరాల కరువైన గ్రామాలు వారికి కనబడడం లేదని అలాంటి నాయకులను అనర్హులుగా ప్రకటిస్తేనే మంచిదంటున్నా రు రాజకీయ విశ్లేషకులు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశంలో నూతన చట్టాలు రావాలన్నా, పెనుమార్పులకు నాంది పలకాలన్నా పార్లమెంట్‌ సభ్యులు ఆమోదిస్తేనే అది శాసనంగా మారి ప్రజల్లోకి వస్తుంది. దేశమంతా అమలవుతూ ఆచరణలోకి వెళుతుంది. పార్లమెంట్‌లో పనిచేసే సభ్యులంతా ప్రజల ఓట్లతో గెలుపొందిన ఎంపీలే. జిల్లా గల్లీల నుంచి గెలిచినా ఢిల్లీ పార్లమెంట్‌లో వీరిది ప్రధాన పాత్రగా ఉంటుంది. కాని పేరు పక్కన ఎంపీ అని పెట్టుకోవడానికే పనికొస్తున్నారు కాని వారికొచ్చే నిధులను విడుదల చేసి ఖర్చుచేయడంలో ఒక్కరంటే ఒక్కరూ కూడా ఆసక్తి చూపడం లేదని మరోసారి రుజువయ్యింది. ఎంపీ నియోజకవర్గాలకు కేటాయిస్తున్న అభివృద్ది నిధుల్ని పూర్తిగా వినియోగించుకోవడంలో అత్యధిక మంది ఎంపీలు విఫలమవుతున్నారు. 2014నుంచి ప్రారంభమైన 16వ లోక్‌సభలో మొత్తం 543మంది పార్లమెంట్‌ సభ్యులుగా దేశంలోని అన్నిరాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రతి ఎంపీకి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఉంటాయి. వాటిని ఎన్నికైనా ఎంపీ ఆ జిల్లా అభివృద్దికి ఖర్చు చేసి ప్రజల నుంచి గుర్తింపు పొందవచ్చు. కాని ఇక్కడ మన నాయకుల పనితీరు చూస్తుంటే మాత్రం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. 543మంది లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైతే ఐదు సంవత్సరాలలో అందులో కేవలం 35మంది మాత్రమే తమకు కేటాయించిన 25కోట్ల నిధుల్ని పూర్తి స్ధాయిలో వినియోగించుకున్నారని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. ఈ 35మంది ఎంపీలో కూడా 10మంది పశ్చిమ బెంగాల్‌ వారే కావడం విశేషం, మిగిలిన 25మంది ఎంపీలు ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. కాగా దక్షిణాది నుంచి ఏ ఒక్క లోక్‌సభ నియోజకవర్గంలోనూ మొత్తం నిధులు వ్యయం కాకపోవడం గమనార్హం. ఎంపీ ల్యాడ్స్‌ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చుకాకపోవడంతో అవి క్రమంగా గుట్టలుగా పేరుకుపోతున్నాయి. గ్రామాల్లో ప్రజలు నిత్యం కనీస సదుపాయాలు లేక కొట్టుమిట్టాడుతుంటే మన నాయకులు మాత్రం కోట్ల రూపాయల నిధులు మంజూరైనా వాటిని పట్టించుకున్న పాపాన లేదు. సమావేశాలు ఉన్నప్పుడు పోవడం, మళ్లీ రావడం తప్ప వారు చేసిందీ మాత్రం ఏమి లేదని తేలిపోయింది. ప్రతి సంవత్సరం ప్రతి లోక్‌సభ సభ్యుడికి 5కోట్ల నిధులు మంజూరవుతాయి. ఐదు సంవత్సరాలలో ఒక్కొక్కరికి 25 కోట్లు నిధులు వస్తాయి. వాటితో ఎన్నో గ్రామాలకు మంచినీటి సదుపాయం. ఎన్నో పల్లెలకు వసతులు కల్పించవచ్చు. కాని మన ఎంపీలకు అలాంటి ఆలోచన రాకపోవడం చూస్తుంటే ఇలాంటి వారు మనకు అవసరమా అనిపిస్తోంది.

స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చుచేసేందుకు వీలుగా ఎంపీ లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్కీం (ఎంపీ ల్యాడ్స్‌) కింద ప్రతి పార్లమెంట్‌ సభ్యుడికి కేంద్రం నిధులు కేటాయిస్తుంది. 1993 నుంచి ప్రతి సంవత్సరం రెండు విడతలుగా ఈ నిధుల్ని కేంద్రప్రభుత్వం ఆయా నిధులను ఒక పార్లమెంట్‌ సభ్యుడు ఖర్చు చేసే అవకాశం కల్పిస్తుంది. వాటిని కూడా ప్రధానంగా స్ధానిక అవసరాలు, మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కాని ఆ నిధులు మాత్రం పూర్తిస్థాయిలో ఖర్చు కావడం లేదు. 2004 నాటి 14వ లోక్‌సభ నుంచి ఇప్పటివరకు దేశంలో అలా పేరుకుపోయిన ఎంపీ ల్యాడ్స్‌ నిధులు, 12వేల కోట్ల వరకు ఉన్నాయరని అంచనా వేశారు. నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు చూపిన ఎంపీలకు తదుపరి నిధులు విడుదల చేస్తారు. ఐతే చాలాచోట్ల యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను జిల్లా యంత్రాంగాలు సమర్పించడంలో జాప్యం జరుగుతున్నది అని కేంద్రమంత్రి ఒకరు ఈ నెల 19న లోక్‌సభకు వెల్లడించారు. ఏడాది లోపల ప్రాజెక్టును పూర్తిచేసి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ను సమర్పించడం సాధ్యం కాదని మాజీ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. కాని ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టే ప్రాజెక్టులకు భూసేకరణ పెద్ద సమస్యగా మారిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి రెండు విడతలుగా నిధులు మంజూరు చేస్తున్న ఐదు కోట్ల నిధుల్ని ఇకపై ఒకే విడతలో విడుదల చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రెండు విడతల వలన వాటిని ఖర్చు చేయడానికి ఎంపీలు ముందుకు రావడం లేదని, దానికితోడు నిధుల విడుదలలో అనవసర జాప్యాన్ని నివారించడంతోపాటు ప్రాజెక్టులను సంబంధిత జిల్లా యంత్రాంగం సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఏడాదికి ఐదు కోట్లను ఒకేసారి జమచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగైనా ఎంపీల ఆలోచనల్లో మార్పు వచ్చి నిధులపై ఆసక్తి చూపి గ్రామాల అభివృద్ది కోసం కేటాయిస్తారని భావిస్తున్నట్లు సమాచారం.

తెలుగు ఎంపీలెప్పుడూ వెనుకే.. ఎంపీల్యాడ్స్‌ నిధులు ఖర్చు చేయడంలో

మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఎప్పుడూ అందరికంటే చివరి వరుసలో ఉంటారు. ఆరునెల్లకోమారు జరిగే సమావేశంలో పాల్గనడం, మళ్లీ సొంత రాష్ట్రానికి అడుగుపెట్టడం తప్ప ఇప్పటి వరకు వీరు చేసిందీ మాత్రం ఏమి లేదు. సంవత్సరానికి ఒక్కో పార్లమెంట్‌ సభ్యుడికి ఐదు కోట్లు నిధులు మంజూరు అవుతున్నా వాటిని విడుదల చేసి ఖర్చు పెట్టాలనే ఆలోచన ఒక్కరికంటే ఒక్కరికి రాకపోవడం శోషనీయమే.. నిధులు లేక సమస్యలతో గ్రామాలు తికమకపడుతుంటే ఎంపీల కొచ్చే కోట్లాది నిధులు ఖర్చు చేయకుండా మూలన పడేస్తున్నారు. ఎంపీ నిధులతో ఎన్నో పనులు చేయవచ్చని తెలిసినా ఒక్కరంటే ఒక్కరూ ముందుకు రావడం లేదు. యువతకు గ్రంథాలయాలను నిర్మించవచ్చు. గ్రామాల్లో కూలిపోవడానికి సిద్దంగా ఉన్న పాఠశాల భవనాలను నిర్మించవచ్చు. ఎన్నో అభివృద్దిపనులు చేయాల్సి ఉన్న కాని వీరు ఒక్కరూ కూడా ముందుకు రావడమే లేదు. ప్రజల సమస్యలపై పట్టించుకొని ఇలాంటి నాయకులను మళ్లీ ఒకసారి గెలవనీయకుండా చేయడమే సరియైన శిక్ష అంటున్నారు రాజకీయ పండితులు.

నిధులు ఖర్చు చేయని ఎంపీలపై చర్యలు తీసుకోవాలి..

కొన్నె దేవేందర్‌. యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ కార్యదర్శి..

ప్రజల అభివృద్ది కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మన నాయకులను ఎన్నుకుంటున్నాం. కాని చాలామంది ఎంపీలు నిధులను ఖర్చు చేయడం లేదంటే వారు పని విధానం, ఆలోచన ఏలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారు మనకు నాయకులుగా అవసరమా అనిపిస్తుంది. ప్రతి పల్లెలో ఏదో ఒక సమస్య ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా, ఎంపీ నిధులతో కూడా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. నాయకులను ఎన్నుకునేది సమస్యలను పరిష్కరిస్తారని, అభివృద్ది చేస్తారని కాని మన పార్లమెంటు నాయకులు వారి స్వంత ఖర్చులపై పెట్టినంత ఆసక్తి ప్రజల అభివృద్ది కోసం ఖర్చుచేసే నిధులపై పెట్టకపోవడం చూస్తుంటే ఇలాంటి వారిని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలి. నిధులు వాడుకొని నాయకులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. వీరు మళ్లీ పోటి చేసినా, ఇలాంటి వారు ప్రజా సేవకు పనిచేయరని ఓటర్లు తిరస్కరించేలా వారిలో చైతన్యం వచ్చేలా కృషి చేస్తాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here