Featuredస్టేట్ న్యూస్

విద్యార్థుల గోస కన్నా… రాజకీయ ప్రవేశాలే మిన్న…

-నిస్తేజంగా పాలన యంత్రాంగం…
-ఆవేదనలో విద్యార్థిలోకం…

-రోజులు గడుస్తున్నా చర్యలేవి…

విద్యార్థుల సమస్యలా చూద్దాం లే… అదీ చాలా చిన్నసమస్య… పదిహేడు మంది విద్యార్థులు మరణించారా.. ఏమో మాకు అంతగా సమాచారమే లేదు… ఆందోళన జరుగుతున్నాయని తెలుసు… విద్యార్థుల తల్లిదండ్రులు అందోళన చేస్తున్నారని తెలుసు ఎవ్వరికి అన్యాయం జరగకుండా కమిటి వేశాం.. తుది నివేదిక వచ్చాక పూర్తి చర్యలు ఆలోచిస్తాం.. అంటూ ప్రతి పనిని, ప్రతి సమస్యను చాలా ఈజీగా తీసుకుంటున్నారు… ఒక్కరూ కాదు, ఇద్దరూ కాదు ప్రభుత్వ వైఫల్యం వల్ల పదిహేడు మంది బావిభారత విద్యార్థులు మరణించారని తెలిసినా దేశంలో మేమే గొప్ప, పాలనలో మాకు సాటెవ్వరూ లేరని పనికి మాలిన ఊకదంపుడు ఉపన్యాసాలతో రోజులు గడుపుతున్నా పాలకులకు విద్యార్థుల సమస్యలు కనబడడమే లేదు.. అదీ సమస్యే కాదంటూ చూస్తూ దానిపై స్పందించడం మానేసి ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే పనిలో బిజీబిజీగా మారిపోయారు నాయకులు… మండుటెండలో, నడిరోడ్డుమీద న్యాయం కావాలని గత మూడు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాయకుడు ఒక్కరంటే ఒక్కరూ కానరావడం లేదు… ఐదు సంవత్సరాలు మాకేమి కాదనుకుంటున్నారో, విద్యార్థులే కదా ఏమి చేయరనుకుంటున్నారో కాని ప్రభుత్వం వైఫల్యంపై రాష్ట్రమంతా మండిపడుతోంది… చలనం లేని యంత్రాంగం మాటలు రాని మూగవారిలా చూస్తూ ఉండిపోతుంది తప్ప చేసేందేమి లేదని తెలిసిపోతుంది…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇంటర్‌మీడియట్‌ విద్యార్థుల ఆందోళన ఆగడం లేదు.. న్యాయం చేస్తారా లేదా అంటూ రోజురోజుకు ఉద్యమం ఉదృతమవుతోంది.. విద్యార్థుల ఫలితాలనే సక్రమంగా విడుదల చేయని వారు ప్రజలను ఏలా పాలిస్తారని ఆరోపణలు చేస్తున్నారు.. ఒక్క శాఖలో సరియైన నాయకుడిని నియమించలేదని వారి ఇష్టానుసారంగా ఎవరిని పడితే వారిని నియమించడం వలన పారదర్శకంగా లోపిస్తున్నారు.. ప్రభుత్వ చేసిన తప్పుకు అనేక మంది చిన్నారులు బలవుతున్నారని మరణించిన విద్యార్థులకు ప్రభుత్వం ఏమని సమాధానం చెపుతుందో తెలపాలన్నారు.. రాష్ట్రంలో విద్యార్థుల సమస్య రోజురోజుకు పెద్దగా మారడంతో సంబంధించిన మంత్రి కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల సమస్యలకంటే మన ప్రభుత్వానికి ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్పించుకునే పనిలోనే బిజీగా ఉన్నారని అంటున్నారు. ఒక పక్క విద్యార్థిలోకం అన్యాయం జరిగిందని నెత్తి, నోరు కొట్టుకుంటుంటే ముఖ్యమంత్రితో పాటు ఇతర యంత్రాంగం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. నాయకుల, అధికారుల పిల్లలకు ఇలానే జరిగితే వారు ఊరుకునే వారా అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు, యువత అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే కెటిఆర్‌ ఈ విషయంపై స్పందించకపోవడంపై గల కారణాలు ఏంటో చెప్పాలన్నారు. ఎంతోమంది విద్యార్థుల అత్మహత్య చేసుకున్న కనీసం స్పందించలేని ప్రభుత్వంలో బతుకుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపిసున్నారు…

కనీస స్పందన లేని ప్రభుత్వం…

తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ ప్రజానీకంలో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని అంతకంతకూ పెంచేలా చేస్తోంది. ఏదైనా పెద్ద ఉదంతం, ప్రజల సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉంటూ తనకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించడం చూస్తుంటే అసలు ఈ పాలకులు ఎవరికోసం పనిచేస్తున్నారో అర్థమే కావడం లేదు. దాదాపు పదిలక్షల మందికి పైగా విద్యార్థులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.. జరిగిన అన్యాయానికి ఎవరూ సమాధానం చెపుతారని రోదిస్తున్నారు. ఇంటర్‌ పరీక్ష ఫలితాల విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పటివరకు ఒక్క ముక్క కూడా స్పందించిన దాఖలాలు లేవు. ముగ్గురు సభ్యుల బృందంతో కమిటీ వేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పిచేతులు దులుపుకున్నారే కానీ జరిగిన తప్పును ఏలా సరిదిద్దాలనే విషయం మీద ప్రభుత్వం నుంచి భరోసా కలిగించే మాట ఇప్పటివరకు ఒక్కటి కూడా రాలేదు. ఇంటర్‌ బోర్డు వైఫల్యంపై మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, వారిని కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు అతిగా ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇంటర్‌ బోర్డును ముట్టడించేందుకు పలు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మొహరించడంతో ముట్టడి సక్సెస్‌ కాకున్నా, తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. కడుపు మండిన తల్లిదండ్రులు, ఆవేదనతో విద్యార్థులు ప్రభుత్వాన్ని, అధికారుల్ని నానా రకాలుగా తిట్టిపోయడమే కనిపించింది. పిల్లల ఉసురు పోసుకోవడం మంచిది కాదంటూ పలువురు తల్లిదండ్రులు శాపనార్థాలుగా పెట్టడం గమనార్హం. ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇంత భారీగా నిరసనలు చోటు చేసుకుంటున్న వేళ, జరిగిన తప్పులను సరిదిద్దుకునే పనిలో ప్రభుత్వం ఉందన్న ఉపశమనపు ప్రకటన ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం సరికాదన్న మాట పలువురి నోటి నంచి వినిపిస్తోంది. లక్షలాది మందికి సంబంధించిన విషయంలోనూ ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న కెసిఆర్‌ తీరు ఏ మాత్రం సరికాదంటున్నారు. పిల్లల ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదన్న విషయం కెసిఆర్‌కు మాత్రం తెలీదా అంటూ ఆరోపణలు చేస్తున్నారు..

రాజకీయ ఆందోళనలు అంటున్న విద్యాశాఖ మంత్రి..

ఇంటర్‌మీడియట్‌ బోర్డుపై వస్తున్న అపోహలపై విచారణ ఆదేశించామని నివేదిక వచ్చిన తర్వాత అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రవిద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని వారి సమస్యలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా లబ్దిపొందాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కొన్ని రాజకీయపార్టీలు చిల్లర ప్రయత్నాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోకూడదని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. బోర్డులో జరిగిన తప్పొప్పులపై విచారణ జరిపిస్తున్నామని సాంకేతికంగా తప్పులు జరిగినా దానికి బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని చెపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక రాగానే దానిని పరిశీలించి ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

ఫెయిలైన విద్యార్థుల పేపర్లు రివాల్యూయేషన్‌ చేపించండి.. హైకోర్టు..

తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థులందరికి జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఉన్నత న్యాయస్థానం అభిప్రయాపడింది. దీనికి ఎంత సమయం పడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు రెండు నెలలు పడుతుందన్న వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిలైన మూడు లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానికి తెలిపారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కోంటూ జీవోను సమర్పించారు. న్యాయవిచారణతో విద్యార్ధులకు ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. దీనిపై సోమవారంలోపు అభిప్రాయాన్ని చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close