స్మారకచిహ్నాల కుంభకోణం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో పాత కుంభ కోణాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హయాం నాటి గనుల తవ్వకాల కుంభకోణంలో ఈడీ అధి కారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మాయావతి అధికారంలో ఉన్న సమ యంలో చోటుచేసుకున్న స్మారకాల కుంభకో ణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు జరిపారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన రూ.1400 కోట్ల దళిత స్మారక చిహ్నాల కుంభకోణానికి సంబంధించి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం సోదాలు నిర్వహించింది. ఇసుక తవ్వకాల కుంభకోణంలో యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, అతని మాజీ మంత్రివర్గ సహచరుల ప్రమేయంపై సిబిఐ దాడులు జరిగిన వారం రోజులకే మాయావతిపై ఇడి గురిపెట్టడం గమనార్హం. ఇడి సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మాయావతి హయాంలో పనిచేసిన పలువురు ఉన్నతాధికారులపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం. లక్నోలోని యుపి నిర్మాణ్‌ నిగమ్‌ మాజీ ఎండి సిసి సింగ్‌ నివాసంలో కూడా సోదాలు జరిగాయి. అలాగే ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఇడి దాడులు జరిపింది.

2007-12 మధ్య మాయావతి యూపీ సీఎంగా ఉన్న సమయంలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌, పార్టీ గుర్తు ఏనుగు లాంటి అనేక స్మారకాలను నిర్మించారు. అయితే స్మారకాల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందని, కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రయివేటు వ్యక్తులు లబ్ధి పొందినట్లు రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు గురువారం ఏకకాలంలో 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. లఖ్‌నవూలోని కొందరు అధికారులు, ప్రయివేటు వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల అఖిలేశ్‌ యాదవ్‌ హాయం నాటి మైనింగ్‌ కుంభకోణం కేసులో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐఏఎస్‌ అధికారిణి నివాసం సహా పలు అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. కాగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా యూపీలో సమాజ్‌ వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ తమ వైరాన్ని సైతం పక్కనబెట్టి చేతులు కలిపాయి. మహాకూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌, మాయావతి హయాం నాటి కుంభకోణాలపై ఈడీ సోదాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

6.5 కోట్ల మందికి ఉద్యోగాల్లేవ్‌..

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రధానమంత్రి పదవి నుంచి నరేంద్ర మోదీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అత్యధికంగా 2017-18 కాలంలో నమోదైందని జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక వివరాలను ప్రస్తావిస్తూ.. మోదీ ఇచ్చిన ఉద్యోగాల కల్పన హావిూ ఏమైందని ప్రశ్నించారు. ‘నమో జాబ్స్‌.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఓ నిరంకుశ నేత హావిూ ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ఉద్యోగాల విషయంలో బయటకు వచ్చిన ఈ నివేదిక ఓ జాతీయ విపత్తు వంటి పరిస్థితిని సూచిస్తోందని రాహుల్‌ దుయ్యబట్టారు. నిరుద్యోగ నిర్మూలన పేరుతో ఇంతకాలంచెప్పిన ప్రవచానాలు కార్యరూపం దాల్చలేదన డానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదన్నారు. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా నిరుద్యోగం ఉంది. 6.5 కోట్ల మంది యువత 2017-18 కాలంలో నిరుద్యోగులుగా మిగిలారు. నమో ఇక వెళ్లు అనాల్సిన సమయం వచ్చిందని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో విమర్శించారు. భారత యువత భవిష్యత్తును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ‘మోదీజీ.. ఇప్పుడు నిరుద్యోగ రేటు.. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా ఉన్నట్లు నమోదైంది.

అందుకే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికను బయటకు రాకుండా ఇన్ని రోజులు దాచారు. అందుకే, జాతీయ గణాంక సంఘం (ఎన్‌ఎస్‌సీ) సభ్యులు రాజీనామా చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హావిూ ఇప్పుడు ఓ క్రూరమైన జోక్‌గా మారిపోయింది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసే ప్రభుత్వం భారత్‌కు వద్దు' అని ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు.  ఓ వైపు దేశ యువత ఉద్యోగాలు కావాలని డిమాండ్‌ చేస్తోంటే, మరోవైపు మోదీ మాత్రం సినిమా డైలాగులు చెబుతున్నారు. హౌజ్‌దిజాబ్స్‌ మోదీజీ?' అంటూ కాంగ్రెస్‌ నాయకురాలు దివ్యా స్పందన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు హ్యాష్‌టాగ్‌తో మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా, ఎన్‌ఎస్‌సీ నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ తాత్కాలిక ఛైర్‌పర్సన్‌ పీసీ మోహనన్‌, జేవీ విూనాక్షి రాజీనామా చేశారు.

రెండో రోజూ కొనసాగిన అన్నా దీక్ష

రాలేగావ్‌ సిద్ధీ: లోక్‌పాల్‌ సహా పలు డిమాండ్ల సాధనకై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. ఆయన స్వగ్రామమైన మహారాష్ర ్టలోని అహ్మద్‌నగర్‌ జిల్లా రాలేగావ్‌ సిద్ధీలో చేపట్టిన ఆందోళనలో గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలు లోక్‌పాల్‌, లోకాయుక్తలు ఏర్పాటు చేయడం లో తాత్సారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన దీక్షబూనారు. ఈ డిమాండ్లతో పాటు రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని, కొన్ని ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విషయ మై గురువారం గ్రామస్థులంతా కలసి స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. దీక్షాస్థలిలో వైద్యులు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 80ఏళ్ల వయసులో దీక్షలు చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంరక్షకులకు సూచించారు. బుధవారం చర్చలకు సిద్ధపడిన మంత్రి గిరీశ్‌ మహాజన్‌, ఇతర అధికారులను కలిసేందుకు అన్నా నిరాకరించారు. దీనిపై మహాజన్‌ నాసిక్‌లో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని పరిష్కార మార్గాలు తమ వద్దనున్నాయని చెప్పారు. చర్చలకు అన్నాహజారే అంగీకరించడం లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు సన్నిహితుడైన మహాజన్‌ పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లోకాయుక్త పరిధిలోకి తీసుకొస్తూ మంత్రివర్గం మంగళవారం తీసుకొన్న నిర్ణయాన్ని అన్నాహజారే స్వాగతించారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఆందోళన విషయమై సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశానని, గతేడాది రామ్‌లీలా మైదానంలో దీక్ష చేపట్టినప్పుడు ఫడణవీస్‌ మధ్యవర్తిగా వ్యవహరించి కేంద్రం తరఫున డిమాండ్లను నెరవేరుస్తాననే హామీ ఇచ్చారని ఆ లేఖలో గుర్తు చేశారు. అందులో వేటినీ నెరవేర్చని కారణంగానే దీక్షకు సిద్ధపడినట్లు పేర్కొన్నారు.

అవినీతి రహిత దేశమే లక్ష్యం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నవ భారత నిర్మాణానికి మా ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ అన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గురువారం ఆయన ప్రారంభోపన్యాయం చేశారు. ప్రతీ ఇంటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నా మని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో అనేక కొత్త కార్యక్రమాలు ప్రారం భమయ్యాయని గుర్తుచేసిన ఆయన.. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిరుపేదలకు సైతం విద్యుత్‌ కనెక్షన్‌, గ్యాస్‌ కనెక్షన్లు అందుబాటులోకి తెచ్చామని.. మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల గౌరవాన్ని పెంచామని అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌తో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, హృద యాలకు ఉపయోగపడే స్టంట్‌ల ధరలను తగ్గించామని వెల్లడించారు. దేశంలోని 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ఔషధాల ఖర్చు తగ్గించేందుకు జనఔషధి దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కిడ్నీ బాధితులకు ప్రత్యేక బీమా యోజన తీసుకొచ్చిం దని తెలిపారు. వారికోసం ఉచితంగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, పలు రాష్ట్రాల్లో కొత్తగా ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇక గ్రావిూణ ఆవాస్‌ యోజన కింద కోటికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. ప్రతీ పౌరుడి జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం తమ ప్రభుత్వ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం రైల్వేస్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వారికి సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించేం దుకు కృషి చేస్తున్నామన్నారు. మరోవైపు బాలికలపై అత్యాచారాలు చేసేవాళ్లకు ఉరిశిక్ష విధించేలా చట్టం తెచ్చామని రాష్ట్రపతి అన్నారు. స్టార్టప్‌ ఇండియాతో పరిశ్రమలు స్థాపించే యువతను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నేడు అన్నిరంగాల్లో బాలికలు ముందజ వేస్తున్నారని, నేడు ముద్రా రుణాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలకే దక్కాయన్నారు.

స్వచ్ఛభారత్‌ నిర్మాణంలో భాగంగా తొమ్మిదికోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించామన్నారు. దీంతో 3లక్షల కుటుంబాలకు ఆరోగ్యం చేకూరిందని.. మహిళల గౌరవాన్ని పెంచామని రాష్ట్రపతి వివరించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.

నల్లధనం కట్టడికి చర్యలు ..

దేశంలో నల్లధనం కట్టడికి ఎన్నో చర్యలు చేపట్టాంమని రాష్ట్రపతి అన్నారు. మాప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జన్‌ధన్‌ యోజన కింద 34 కోట్ల మందికి బ్యాంకుఖాతాలు తెరిచామని, 2014కి ముందు దేశంలో 3.8 కోట్ల మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లించేవారని, ప్రస్తుతం 6.8కోట్ల మంది చెల్లిస్తున్నారన్నారు. జీఎస్టీ ద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పారదర్శకత తీసుకొచ్చామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భారత్‌ 77వ స్థానానికి చేరుకొందని తెలిపారు. ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపుదిద్దుకొందన్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఏపీలో మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేశామన్నారు. యువత స్వావలంబన కోసం స్టార్టప్‌ కేంద్రాలను ప్రారంభించామన్నారు. వీటి ద్వారా పరిశ్రమలు స్థాపించేందుకు యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు. 

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్షలాది మందికి ఇళ్లు లభించాయన్నారు. గృహనిర్మాణాల్లో సమస్యలు తొలగించేందుకు రేరా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని కోవింద్‌ చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్రపతి తెలిపారు. 18వేలకు పైగా గ్రామాల్లో విద్యుదీకరణ చేపట్టామన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ విద్యుత్తు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. దివ్యాంగుల కోసం సౌకర్యవంతమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, వారికి ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నీలివిప్లవం ద్వారా మత్స్యకారులకు సాంకేతిక సాయం అందిస్తున్నామన్నారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంతో గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం, ఈ-గవర్నెన్స్‌ తీసుకొచ్చాం. 40 వేలకు పైగా గ్రామాల్లో వ్గై/ హాట్‌స్పాట్‌ సౌకర్యం కల్పించామని రాష్ట్రపతి వివరించారు.

దేశ భద్రత కోసమే కొత్త రక్షణ ఒప్పందాలు..

రాష్ట్రపతి తన ప్రసంగంలో రక్షణ ఒప్పందాల గురించి ప్రస్తావించారు. దేశ భద్రత కోసమే కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. రాఫెల్‌ యుద్ధ విమానాలతో సరిహద్దులు సురక్షితమన్నారు. సర్జికల్‌ స్టైక్స్‌ అద్భుతమంటూ భారత ఆర్మీని ప్రశంసించారు. నవభారతం నిర్మాణం కోసం నాలుగేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. అవినీతిరహిత భారత్‌ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. 2019 భారతదేశానికి కీలక సంవత్సరమన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

నవభారత శకం ఆరంభమైంది – ఉపరాష్ట్రపతి వెంకయ్య

నవ భారతదేశ నిర్మాణం దిశగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులతో మా ప్రభుత్వం నవ భారత నిర్మాణం దిశగా ప్రయాణం మొదలుపెట్టిందన్నారు. ఈనూతన భారతదేశంలో.. ప్రతిఒక్క పౌరుడు ప్రాథమిక సౌకర్యాలు అందుకుంటాడని అన్నారు. ప్రతి పౌరుడికి తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. ప్రతి పిల్లాడికీ ఎలాంటి లోటు లేకుండా జీవన ప్రగతి సాధ్యమవుతుందని, ప్రతి ఆడబిడ్డా నిర్భయంగా జీవిస్తుందని, ప్రతి ఒక్కరికీ గౌరవంగా న్యాయం జరుగుతుందన్నారు. యావత్‌ ప్రపంచమే గౌరవించేలా నవ భారతదేశం సగర్వంగా నిలబడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here