తెలంగాణలో రాచరిక పాలన

0

సచివాలయ భవనాల కూల్చివేతపై పిల్‌

  • విచారణ శుక్రవారానికి వాయిదా
  • కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌ :

సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో మరోమారు పిటిషన్‌ దాఖలైంది. ప్రసుత్తం ఉన్న భవనాన్ని కూల్చేది లేదంటూ 2016లో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ వేసిందని.. ఇప్పుడు పాత భవనాన్ని కూల్చి వేసి మళ్ళీ నూతన సచివాలయం నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. గతంలో బిజెపి నేతగా కిషన్‌ రెడ్డి కూడా ఓ పిల్‌ దాఖలు చేశారు. సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి, భారీ భవనాలు నిర్మించేందుకు గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నించగా పలువురు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో సచివాలయంను తరలించమని కోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసింది. మరోసారి నూతన భవనం తెరపైకి రావడంతో.. ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా పిటిషన్‌పై స్పందించిన ధర్మాసనం శుక్రవారం పూర్తి వాదనలు వింటామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది. ప్రస్తుత సచివాలయం మొత్తం 25.5 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని చుట్టూ ఉన్న ఇతర భవనాలను సైతం స్వాధీనం చేసుకొని కూల్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం వెలుపల ఉన్న ఈ భవనాల స్థలాలను కలిపేసుకోవడం ద్వారా వాస్తుదోషాల్లేకుండా కొత్త సచివాలయ నిర్మిత స్థలాన్ని చతురస్రాకార రూపంలో అభివృద్ధిపరచాలని యోచిస్తోంది. మరోవైపు ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అసెంబ్లీ నిర్మిణంపై మరో పిల్‌ దాఖలయ్యింది.

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ జీవన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. టీర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2014 ఎన్నికల ప్రచారంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచిందని ఆరోపించారు. ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం 50వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందని స్పష్టం చేశారు. వాస్తవానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని అయితే వారు ఎక్కడ ఆందోళనబాట పడతారోనని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనం అంశాలను తెరపైకి తెచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, యువత దృష్టి మళ్లించేందుకే కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ ప్రతిపాదనలను తీసుకువచ్చారని వాటితో ఎక్కడా లేని హంగామా చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్ల గడువు ఉన్న భవనాలను ఎందుకు కూల్చుతానంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం చేసే ఆలోచన లేదని గతంలో కోర్టుకు చెప్పారని కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండగా ఎలా కూల్చుతారంటూ నిలదీశారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి నిర్మాణాలు చేపడతారా అంటూ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండిపడ్డారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here