మోడీ నిరంకుశ పాలన

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మోదీ నిరంకుశ పాలనతో దేశంలోని ప్రతి వ్యవస్థ ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుందని, తనను తాను భారతదేశ దేవుడిగా మోడీ భావిస్తున్నాడని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఓ జాతీయ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోదీ నిరంకుశ పాలనలో దేశంలోని ప్రతి వ్యవస్థా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. బ్రిటిషర్లు కూడా అప్పట్లో ఇలానే భావించేవారన్నారు. మేము గతంలో అధికారంలో ఉన్నాం.. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఉన్నామని, దేశంలోని వ్యవస్థల జోలికి పోవద్దని, సమాఖ్య విధానంపై దాడి చేయొద్దని మేము భావిస్తామన్నారు. మన వ్యవస్థలే భారత దేశ ఆత్మ వంటివని ఆయన వ్యాఖ్యానించారు. తన 15ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతవరకూ చూడని ప్రతిపక్షాల ఐక్యతను తాను ఇప్పుడు చూస్తున్నానని రాహుల్‌ గాంధీ అన్నారు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రకాలుగా పోరాడారని, ఇప్పుడు ఆయన కూడా

తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి, ప్రధాని మోదీకి పోలికేలేదని రాహుల్‌ అన్నారు. ‘మా నానమ్మ దేశంపై ప్రేమతో నిర్ణయాలు తీసుకొనేవారని, ఆమె పనులు దేశ ఐక్యతను పెంచేవిగా ఉండేవన్నారు. దేశంలోని పేద ప్రజల బాగోగుల గురించి ఆమె ఆలోచించేవారని, మోదీ నిర్ణయాలు ఆగ్రహం, ద్వేషాల నుంచి వస్తున్నాయని రాహుల్‌ పేర్కొన్నారు. దేశ విభజన జరిగేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోని పేదల ప్రజలపై ఆయనకు ఎటువంటి సానుభూతి లేదు’ అని ఆయన విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీ, ఎన్డీఏ ప్రభుత్వ తీరే కారణమని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశంలోని రైతులను కేంద్ర ప్రభుత్వం ఓ బరువైన బాధ్యతగా చూస్తోందని, కానీ తాము మాత్రం వారిని వ్యూహాత్మక సంపదగా భావిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ‘భారత్‌లో రెండో సారి హరిత విప్లవాన్ని తీసుకురావడం కచ్చితంగా సాధ్యమేనని, ఇందుకు తగ్గ మౌలిక సదుపాయాలను కల్పించడం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలను స్థాపించడం, రైతులకు మద్దతుగా నిలబడడం వంటి పనులు చేయాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పనులను చేయట్లేదని రాహుల్‌ విమర్శించారు. పంట బీమా పథకం అంటూ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమక్రమంగా దేశ సంపదను 20-30 మంది

ఆశ్రిత పెట్టుబడిదారుల అధీనంలో ఉండేలా చేస్తున్నారన్నారు. కేవలం రక్షణ రంగంలోనే కాకుండా వ్యవసాయం, మౌలిక రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ ఇది జరుగుతోందని వ్యాఖ్యానించారు.

‘ఏ రంగమైనా సంక్షోభంలో ఉంటే దానికి మనం మద్దతుగా నిలబడాలని, వారిని అందులోంచి బయటపడేసే వ్యూహాలు ఉండాలన్నారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను మేము లేవనెత్తేంతవరకూ నరేంద్ర మోదీ ఈ విషయం పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షం ప్రశ్నించేవరకు స్పందనలేకుండా ఉన్నారని మోదీప ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. భారత్‌ వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ఆర్థిక రంగంలో రైతులు భాగస్వాములని మేము భావిస్తామని, పారిశ్రామికవేత్తలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొడితే వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) కింద లెక్కగట్టి వదిలేస్తున్నారని రాహుల్‌ అన్నారు. మరి ఇదే సూత్రాన్ని రైతులకు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రైతులకు రుణ ఎగవేతదారులుగా పేర్కొంటున్నారని, రుణఎగవేతదారులైన పారిశ్రామికవేత్తల తీరుని ఎన్‌పీఏగా అభివర్ణిస్తున్నారఅని రాహుల్‌ గాంధీ అన్నారు. ఇదొక సమస్య అయితే.. మరో సమస్య నిరుద్యోగమని రాహుల్‌ పేర్కొన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్య గురించి రాహుల్‌ మాట్లాడుతూ… ‘దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఆ తరహా పరిశ్రమలు నడుపుతున్నవారు కేంద్ర ఆర్థిక మంత్రిని లేదా ప్రధానిని కలవగలరా అని ప్రశ్నించారు. మోదీతో కలిసి అనిల్‌ అంబానీ ఫ్రాన్స్‌కు వెళ్లగలరని, కానీ చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు ఈ అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యాపారాలు చేసేవారిని మోదీ.. ‘సోదరుడా’ అని పిలవగలరా అని రాహుల ప్రశ్నించారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉందని, ఎవరూ ఉత్పత్తి చేయలేని వస్తువులను వారు ఉత్పత్తి చేయగలరన్నారు. వీరిని ప్రోత్సహించాలని, అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని మోదీ అంటున్నారు. ఇప్పటివరకు ఎన్ని అంకుర పరిశ్రమలు నెలకొన్నాయి. దేశంలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను ప్రోత్సహించలేకపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ భరోసా కల్పిస్తామని తాను చేసిన ప్రకటనపై రాహుల్‌ స్పందించారు. ఇది ఓ విప్లవాత్మక ఆలోచన అని, కనీస ఆదాయాన్ని కల్పిస్తామని, మన దేశంలోని పేదలకు లబ్ధి చేకూరే దిశగా, నిబద్ధతతో దీన్ని అమలు పర్చొచ్చున్నారు. దీని గురించి ఆలోచించి, చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిపై మరింత విస్తృతంగా చర్చలు జరిపి, దీన్ని అమలు పర్చేలా ఈ విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here