‘స్నేహం కోసం’ మోడీ ప్రభుత్వం

0
  • బడా వ్యాపారవేత్తలకే మేలు
  • కాంగ్రెస్‌ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం
  • తమిళనాడుకు కాబోయే సీఎం స్టాలినే
  • తమిళనాడు ప్రచార సభలో రాహుల్‌ గాంధీ

చెన్నై : తన ఐదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం బడా వ్యాపారవేత్తలకే మేలు చేశాడని, పేదల సొమ్మును పెద్దలకు దారాదత్తం చేశాడని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరిలో పర్యటిస్తున్న రాహుల్‌.. మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ ఇలా తన 15 మంది స్నేహితుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. కృష్ణగిరిలో ఏర్పాటుచేసిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా మోడీ 15 మంది కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వారు అనిల్‌ అంబానీ, మెహుల్‌ ఛోక్సీ, నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా తదితరులు అన్నారు. వీరంతా మోడీకి స్నేహితులని, వీరంతా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దేశం విడిచి పారిపోయారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ధనవంతులు రుణాలు ఎగ్గొట్టినా జైల్లో వేయట్లేదని, కానీ రైతులను మాత్రం జైళ్లలో పెడుతున్నారని రాహుల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏ రైతుకు జైలు శిక్ష పడదని రాహుల్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌పై కూడా రాహుల్‌ విమర్శలు చేశారు. తమిళనాడు ప్రజలను నాగ్‌పూర్‌(ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ) పాలించేందుకు కాంగ్రెస్‌, మిత్రపక్షాలు ఎప్పటికీ అంగీకరించబోవని ఆయన అన్నారు. త్వరలోనే రాష్ట్రానికి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి అవుతారని రాహుల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే అది కేవలం కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పేదల అభ్యున్నతికి పాటు పడితే ఐదేళ్ల కాలంలో ప్రధాని మోడీ మాత్రం పేదల నడ్డి విరిచి.. వారి వద్ద ఉన్న సొమ్మును దోచుకున్నాడని రాహుల్‌ విమర్శించారు. ఇలాంటి వారి చేతుల్లో పాలన పెడితే దేశంలో పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదముందని, దీనిని ప్రజలు గమనించారని రాహుల్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, పేద వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here