Featuredజాతీయ వార్తలు

రాఫెల్‌ కేసులో.. మోడీ సర్కార్‌కు ఊరట

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

రాఫెల్‌ ఒప్పందంలో మోదీ సర్కార్‌ కు భారీ ఊరట లభించింది. ఫ్రాన్స్‌ నుంచి 36రాఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మోదీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు రాఫే ల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్నిపిటిషన్లను న్యాయస్థానం తోసిపు చ్చింది. రాఫేల్‌ ఒప్పంద ప్రక్రియలో అనుమానించదగ్గదేవిూ లేదని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. ఏదేశానికైనా యుద్ధ విమానాలు అవసరం అని, భారత వైమానిక దళంలోకి నాలుగు, ఐదో తరం యుద్ధవిమానాలను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు అభిప్రాయపడింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. రాఫేల్‌ ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదని కోర్టు తెలిపింది. ఈ ఒప్పందం 2016 సెప్టెంబర్‌లో జరిగినప్పుడు ఎలాంటి అనుమానాలు రేకెత్తలేదని కేవలం ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ¬లన్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాతే దీనిపై వివాదం మొదలైందని కోర్టు పేర్కొంది. ఆయన చేసిన వ్యాఖ్యలను న్యాయవిచారణకు స్వీకరించలేదని కోర్టు తెలిపింది. అంతేగాక .. ఈ ఒప్పందంలో ప్రయివేటు సంస్థకు వాణిజ్య లబ్ధి చేకూరుతుందని చెప్పేలా సాక్ష్యాలేవిూ లేవని న్యాయస్థానం పేర్కొంది. రాఫేల్‌ ఒప్పందంతో కేంద్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ గత కొంతకాలంగా కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలంటూ యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, న్యాయవాది ఎంఎల్‌ శర్మ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్‌ 14న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

రాహుల్‌ గాంధీ ఓ అబద్దాల పుట్ట – జీవీఎల్‌ నర్సింహారావు… సుప్రింకోర్టు తాజాతీర్పు నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు ట్విట్టర్‌ లో స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓ అబద్ధాల పుట్ట అని తాజాగా సుప్రీం తీర్పుతో రుజువయిందని తెలిపారు. బొఫోర్స్‌ శతఘ్నుల కుంభకోణంలో రాహుల్‌ తండ్రి(రాజీవ్‌ గాంధీ) మధ్యవర్తిగా వ్యవహరిస్తే, తల్లీకొడుకులు(సోనియా-రాహుల్‌ గాంధీ) అగస్టా హెలికాప్లర్ట ఒప్పందంలో భారీగా ముడుపులు అందుకున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని దోషిగా నిలబెట్టేందుకు రాహుల్‌ శతవిధాలా ప్రయత్నించారని మండిపడ్డారు. తాజాగా రాఫెల్‌ కేసులో కోర్టు తీర్పు రాహుల్‌ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని వ్యాఖ్యానించారు.

రాఫెల్‌పై రాజకీయ కుట్రలకు తెరపడింది – అనిల్‌ అంబానీ… ప్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో రాఫెల్‌ కంపెనీ భాగస్వామిగా ఉన్న రిలయన్స్‌ గ్రూప్‌ చీఫ్‌ అనిల్‌ అంబానీ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. రాఫెల్‌ పై దాఖలైన పిల్స్‌, పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. వ్యక్తిగతంగా తనతో పాటు రిలయన్స్‌ గ్రూప్‌ పై రాజకీయ దురుద్దేశాలతో, సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు. తాజాగా కోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని పేర్కొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close