ఎన్టీఆర్‌ను గుర్తు చేసిన మోడీ

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ధాపించిన టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు అర్రులు చాస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులుచెరిగారు. విపక్షాలు తమ వ్యక్తిగత, రాజకీయ మనుగడ కోసమే రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మహాకూటమిగా ఏర్పడుతున్నాయని ధ్వజమెత్తారు. మహాకూటమిని రాజవంశీకుల కూటమిగా ప్రధాని అభివర్ణించారు.ఈ పార్టీలు అధికారం కోసం అపవిత్ర కలయికకు పూనుకున్నాయని మండిపడ్డారు. ఆదివారం తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమిపై నిప్పులు చెరిగారు. కూటమి ఏర్పాటుపై స్పందించిన మోదీ ఎన్టీఆర్‌ను గుర్తు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారని.. వారి దాష్టీకాలకు ఎదురు నిలబడి.. తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాడారన్నారు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ వంటి మహనీయుల్ని ఎంత అవమానించారో ప్రజలు మర్చిపోలేరన్నారు. అలాంటిది టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటోందని ధ్వజమెత్తారు. రాజవంశీకులు, సంపన్నులు ఓ సంఘంగా ఏర్పడ్డారని.. ఈ కూటమి ఓ గందరగోళమంటూ సెటైర్లు పేల్చారు మదీ. వ్యక్తిగత మనుగడ కోసమే ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పడుతోందని.. అధికారం కోసమే ఈ కూటమని.. ప్రజల కోసం కాదన్నారు. మహాకూటమిలో కొన్ని పార్టీలు తమకు సోషలిస్ట్‌ నేత రామ్‌ మనోహర్‌ లోహియా ఆదర్శమని చెప్పుకుంటున్నాయని, అయితే తాను కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్వయంగా రామ్‌ మనోహర్‌ లోహియా వెల్లడించారన్నారు. మహాకూటమి ప్రతిపాదన కేవలం వ్యక్తుల మనుగడ కోసమేనని, సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటయ్యేది కాదని మోదీ ఆరోపించారు. ఈ కూటమి ప్రజల కోసం కాదని అధికారం కోసమని, ప్రజా ఆకాంక్షల కోసం కాకుండా వ్యక్తిగత ఆకాంక్షల కోసమే వీరంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు. మహాకూటమిలో పలు పార్టీల నేతలు గతంలో ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్ష పార్టీలు మహాకూటమితో ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పీఠం కోసమే కూటమి పేరుతో కొందరు డ్రామాలాడుతున్నారని మోడీ మండిపడ్డారు. వ్యక్తిగత మనుగడ కోసమే ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడుతున్నాయని.. ఈ మాయ కూటమిలను ప్రజలు నమ్మొదన్నారు. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.ఈ కూటమికి సొంత ప్రయోజనాలే తప్ప.. అభివృద్ధి పట్టదని మోడీ మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here