మొండిబాకీల వివరాలపై అంత మొండితనమెందుకు?

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆర్‌బీఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌కు కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) షోకాజ్‌ నోటీసు జారీచేసింది. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసినవారి జాబితాను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆర్బీఐ ఉల్లంఘించిందని, దీనికి కారణాలను తెలపాలని నోటిసుల్లో పేర్కొంది. 50 కోట్ల రూపాయలకు మించి బ్యాంకు రుణాలను తీసుకుని, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినవారి జాబితాను వెల్లడించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ వివరాలను వెల్లడించడానికి నిరాకరించినందుకు ఉర్జిత్‌పై గరిష్ఠ పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. ఈ నోటిసులపై నవంబరు 16 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మొండి బకాయిలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ రాసిన లేఖను సైతం బహిర్గతం చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ)లను సీఐసీ కోరింది. ఆర్‌బీఐ గవర్నర్‌, డిప్యూటీ గవర్నర్‌ చెప్పే అంశాలు సరిపోలడం లేదని కమిషన్‌ భావిస్తోంది. విజిలెన్స్‌ నివేదికలు, తనిఖీ పత్రాలను ఆర్‌బీఐ బహిర్గతం చేయడం లేదు. ఆర్‌బీఐ గోప్యత కొనసాగిస్తోందని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ పేర్కొన్నారు. ముందుగా రూ.1,000 కోట్లకు పైగా డిఫాల్ట్‌ అయిన రుణాలతో మొదలుపెట్టి ఆ తర్వాత రూ.500 కోట్ల దాకా రుణాలకు సంబంధించిన వివరాలను అయిదు రోజుల్లోగా ఆర్‌బీఐ వెల్లడించాల్సి ఉంటుందని శ్రీధర్‌ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు, సీఐసీ ఆదేశాలను పాటించకపోవడంలో గవర్నర్‌దే బాధ్యత అని కమిషన్‌ భావిస్తోందని.. అందుకే షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పీసీఆర్‌ వైపు వేగంగా అడుగులు ఒకవైపు వివాదాలతో సతమతమవుతున్న ఆర్‌బీఐ మరోవైపు.. దేశవ్యాప్తంగా డిజిటల్‌ పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ (పీసీఆర్‌) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, పెండింగ్‌లో ఉన్న న్యాయ వివాదాలు సహా రుణాలు తీసుకున్న వివరాలను నమోదు చేయనుంది. తద్వారా ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది.సెబీ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ, జీఎస్టీ నెట్‌వర్క్‌, దివాలా బోర్డు (ఐబీబీఐ)ల చేతిలో ఉన్న సమాచారాన్ని సైతం పీసీఆర్‌లో పొందుపరచనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here