ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయండి

0
  • సీఈసీకి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ లేఖ

హైదరాబాద్‌ : తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సీఈసీ సునీల్‌ అరోడాకు లేఖ రాశారు. ఈ విషయంపై బుధవారమే ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించిన ఉత్తమ్‌.. తాజాగా గురువారం మరో లేఖ రాశారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఓటర్ల జాబితా అందుబాటులో లేదని, అయినా రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రజత్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారని వివరించారు. ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఉత్తమ్‌ అన్నారు. తన లేఖను అత్యవసరంగా పరిగణించి ఇప్పుడిచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఈసీకి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని, కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఈ నెల 27వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తారని ఉత్తమ్‌ చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. ఓటర్ల జాబితా సిద్ధమైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసినలేఖలో ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here