ఏటా లక్షల మంది నిరుద్యోగులే…

0

ఏం చదువుతున్నాడయ్యా మీ అబ్బాయి, అమ్మాయి అంటే చాలు ఏదో డిగ్రీలు, పిజీలు అంటారు.. ఏం పని చేస్తున్నారయ్యో అంటే మాత్రం ముఖం చిన్నబుచ్చుకుంటారు… ఎందుకంటే చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి ఇసుమంత కూడా సంబంధం ఉండదు.. లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరాలకు సంవత్సరాలు చదువుతే చిన్న ఉద్యోగం కూడా దొరకడం లేదు.. రాక రాక అడెండరో, స్వీపరో నోటిఫికేషన్‌ వస్తే చాలు వేలు, లక్షలు మంది ఉన్నత చదువులు చదివిన యువతరమే క్యూడుతున్నారు. అంత పెద్ద చదువులు చదివావు కదా, ఈ చిన్న ఉద్యోగం ఎందుకు అంటే పొట్టపోసుకోవడానికి ఏదో ఒకటి కావాలంటూ సర్దుకుపోయేవారు నేడు ఎక్కువైపోయారు. చదివిన చదువెంటో అర్థం కాదు. చేతికొచ్చినా పట్టాలో ఏం చదివారో తెలియదు కాని ఉద్యోగం చేసే సరికి మాత్రం ఏమి చెయ్యాలో తోచక, కనీస నైపుణ్యాలు లేక చతికిలపడిపోతుంది నేటి యువతరం.. గొప్పగా చెప్పుకోవడానికి, పేరు పక్కన చేర్చుకోవడానికి మాత్రమే పీజీలు, బిటెక్‌లు చేస్తున్నారు కాని కనీస ఆంగ్ల పరిజ్ఞానం లేని వాళ్లు లక్షల్లో ఉన్నారు. మనం గొప్పగా చెప్పుకుంటున్న మన చదువులు నేడు కనీసం ఉపాధిని అందించకుండా నిరుద్యోగానికి ఆనవాళ్లుగా మారిపోతున్నాయి. పనిచేయడానికి మనదేశంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి కాని, నాణ్యత, నైపుణ్యత లేక ఆ అవకాశాలన్నీ అలాగే మిగిలిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులకు చిన్న ఉపాధిని కూడా అందించలేని విద్యావ్యవస్ధ నేడు మనదేశంలో ఉంది. ప్రతి సంవత్సరం పట్టాలు చేతపట్టుకొని రోడ్డుమీదికి వచ్చే యువత నేడు లక్షల్లో ఉన్న రేపు కోట్లలోకి పెరిగిపోయే అవకాశం లేకపోలేదు.. ఉపాధి కోసం తిరిగి తిరిగి వేసారి చివరకు ఏం చేయాలో దోచక నిరాశ, నిస్పృహాలకు లోనవుతూ ఒత్తిడికి గురయ్యి తప్పటడుగులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి…

(మొదటి పేజీ తరువాయి)

చూస్తే వీరి భవిష్యత్తు ఏంటో అర్థమే కావడం లేదు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో 2015లో పట్టభద్రులైనా లక్షలాది మంది యువకుల్లో సగానికి సగం పైగా ఎటువంటి ఉద్యోగానికి సరిపోయే నైపుణ్యాలు లేవని తేలిపోయింది. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాప్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ అంచనా ప్రకారం ఐటి రంగంలో పట్టభద్రులవుతున్న వారిలో కేవలం 25శాతం వద్ద మాత్రమే ఉద్యోగార్హతలు ఉంటున్నాయి. మిగతా వారి భవిష్యత్తు ఏంటనేది నేడు అర్థంకాకుండా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిని కల్పించే చదువులను కల్పించడంలో మాత్రం విఫలం చెందుతుందని చెప్పవచ్చు. నేడు రోజురోజుకు పెరుగుతున్న అవకాశాలకు తగ్గట్లు విద్యాప్రమాణాల్లో కూడా అందుకు సంబంధించిన నైపుణ్యాలను పెంచేదిశగా ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదంటున్నారు నిపుణులు. ప్రభుత్వాలు వారి అవసరాల కోసం మాత్రమే ఇష్టానుసారంగా అమలు కాని హామీలను ఇస్తూ నేటి తరం యువతకు ఉపాధిని కల్పించకుండా నిర్వీర్యం చేస్తుందనే ఆరోపణలున్నాయి. ఒక్క సంవత్సరంలోనే పదిలక్షల మంది వివిధ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకొని బయటికి వస్తుంటే, దేశంలోని వివిధ యూనివర్శిటిల నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, పిహెచ్‌డి పూర్తి చేసిన వారు కూడా లక్షల్లోనే ఉన్నారు. వీరందరికి ఉపాధి లేదు. ఉన్న ఉపాధి వనరుల సద్వినియోగం పరుచుకోవడానికి సరియైన నైపుణ్యాలు లేదు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని పది స్వీపర్‌, నాలుగు వాచ్‌మెన్‌ ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ ఉద్యోగాలకు కనీస అర్హత పది పాస్‌ లేదా పెయిల్‌గా సూచించినా అంతా డిగ్రీ, పిజీ, పిహెచ్‌డీ వాళ్లే దరఖాస్తు చేశారంటే మన దేశంలోని నిరుద్యోగం ఏ స్థాయికి చేరిందో అర్థం కాని పరిస్థితి. రోజురోజుకు పెరిగిపోతున్న పోటీ తత్వంలో అవకాశాలు స్వల్పంగా ఉన్న కాంపీటిషన్‌ అందనంత ఎత్తులో ఉంది. అందులో ఎవరికి ఉద్యోగం వస్తుందో, ఎవరికి నైపుణ్యాలు ఉన్నాయో తెలియక సతమతమైపోతున్నారు. ప్రభుత్వాలు నైపుణ్యం లేని చదువులను పక్కన పెట్టి ఒక విద్యార్థిని అన్ని రంగాలకు పనికొచ్చేలా తయారుచెయ్యడంపై దృష్టి సారించాలని పలు సర్వేలు సూచించాయి. కాని వాటిని మాత్రం పట్టించుకున్న వారే లేరు..

లక్షల్లో పెరుగుతున్న యువత….రోజురోజుకు లక్షల్లో పెరిగిపోతున్న యువత కోసం 2030నాటికి 25కోట్ట ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగావకాశాల కల్పన, వారిలో ఉద్యోగ నైపుణ్యాలను పెంచడం భారత్‌ ముందున్న అతిపెద్ద సవాలుగా మారిపోతుంది. ఇప్పటికే తయారీ నుంచి సేవల రంగం వరకూ అన్ని రంగాలను నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతగా వేధిస్తుంది. రంగం ఏదైనా నైపుణ్యాలను అభివృద్ది చేస్తేనే ఉత్పాదకత, ఆర్థిక వృద్దిరేటు పెరుగుతోంది. అందువల్ల విద్యా, ఉద్యోగ నైపుణ్యాలను పెంచే చర్యలను ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేపడుతేనే భవిష్యత్తు తరానికి మేలు చేసిన వారవుతారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌ నిధుల కేటాయింపుల్లో పెద్దపీట వేయాలి. అన్నిరంగాల్లో శిక్షణ సదుపాయాలు పెంచాలి. ప్రత్యేక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థుల నైపుణ్యాలను పెంచడమేకాక స్వయం ఉపాధికోసం మాధ్యమిక విద్యాస్థాయిలో వృత్తిపర కోర్సులను ప్రోత్సాహించేలా చర్యలు చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. రోజురోజుకు తగ్గిపోతున్న వృత్తిపరమైన ఉపాధిని కల్పించే కళాశాలను అభివృద్ది పరుస్తూ వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటికే ఐటిఐ కళాశాలను నవీనకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపట్టినప్పటికి, ఇటువంటి అనేక చర్యల అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించే కీలక పరిశ్రమల్లో పెట్టుబడులు పెరగడానికి చర్యలు తీసుకోవాలి. జౌళి, పాదరక్షలు, నగలతయారీ వంటి శ్రమాధార పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి. చైనా, జపాన్‌, ఇతర దేశాలు ఎదుర్కొంటున్న వయోవృద్దుల సంఖ్య పెరిగే దశకు భారత్‌ చేరడానికి ముందే పూర్తిస్ధాయిలో యువశక్తిని వినియోగించుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైననే ఉంది. వ్యవసాయరంగానికి ప్రాధాన్యం కొనసాగిస్తూనే, యువతకు ఉద్యోగవకాశాల కల్పనకు వచ్చే పదేళ్లకాలంలో స్థూల దేశీయోత్పత్తిలో తయారీరంగ వాటాను ప్రస్తుతమున్న పదహారుశాతం నుంచి ఇరవై శాతానికి పెంచాలి.సేవల రంగాన్ని అభివృద్ది చేయాలి. అదే సమయంలో విచ్చలవిడి వినియోగ ప్రవృత్తికి యువత బానిసలు కాకుండా చూడాలి అప్పుడే ఉప్పోంగే యువరక్తం మనదేశ ఆస్తిగా మారిపోతుంది. ప్రంచంలోనే యువదేశంగా, నైపుణ్యాలు గల యువతరంగా గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు యువతను అవకాశానికి వాడుకునే వస్తువులుగా కాకుండా దేశ నిర్మాణానికి పనికొచ్చే శక్తులుగా మార్చాల్సిన అవసరం నేడు ఉంది. ఎవరికి వారే యమునా తీరుగా ఎన్నికల ముందే మాటలు చెపుతూ, తర్వాత తోక జోడిస్తే యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. దేశ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here