పిచ్చి తల్లి ప్రాణం తీసింది

0
  • గోదావరిఖనిలో దారుణం..
  • కుమారులను కడతేర్చిన వైనం
  • మానసిక స్థితి సరిగా లేకపోవడమే కారణం కైలాసంలో పార్వతి వినాయకుడి కోసం తపించింది. పరితపించింది. సాక్ష్యాత్తు పరమశివుని వేధించి కుమారుడిని బతికించుకుంది. అమ్మ.. అమృతం… అధ్భుతం.. అనిర్వచనీయం… మరి భూవ్మిూద.. తండ్రి శివరాత్రి పూజా సామాగ్రి తీసుకురావడానికి పిల్లలిద్దరికీ చెప్పి బజారుకెళ్ళాడు. ఇంతలోనే అమృతం పంచే అమ్మే చంపుతుందని ఆ పసి ప్రాణాలకు తెలియదు. అంత ఆలోచన ఆ చిన్నారులకు లేదు. కన్న తల్లే వారికి మృత్యుదేవత అయింది. పండగపూట ఆ ఇంట శ్మశాన వైరాగ్యం రాజ్యమేలింది. ఇదంతా తెలియని ఆ పిచ్చి తల్లి పిల్లల మృతదేహాల పక్కనే కూర్చొని కూర అనుకొని కారం మెతుకులు కలుపుకుంటూ ముద్దలు తింటూ అయోమయంగా ఆకలి తీర్చుకుంటున్న విషాదకరమైన దయనీయ సంఘటన చూసి ఖాకీలు సైతం కన్నీరు పెట్టారు.

హైదరాబాద్‌ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం జరిగింది. కన్నబిడ్డలపాలిట తల్లి కసాయిగా మారింది. ఇటుక రాయితో ఇద్దరు కొడుకులపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. నిందితురాలు కొద్దిరోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన శ్రీకాంత్‌, రమాదేవి దంపతులకు అజయ్‌, ఆర్యలు సంతానం. శ్రీకాంత్‌ ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులు ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన రమాదేవికి కొద్దిరోజులుగా మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు తెలిపారు. తరచూ భర్త, ఇద్దరు పిల్లతో గొడవపడుతుండేదని, స్కూల్‌లో కూడా పిల్లలతో దురుసుగా ప్రవర్తించడంతో ఉద్యోగం నుంచి తొలగించారని తెలిసింది. తర్వాత భర్త ఆమెను మానసిక వైద్యులకు చూపించారని, సోమవారం ఉదయం భర్త శివరాత్రి పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లాడని, కొద్దిసేపటికి రమాదేవి ఇద్దరు పిల్లలపై ఇటుకరాయితో దాడి చేసిందని స్థానికులు తెలిపారు. ఈ దాడిలో పెద్ద కుమారుడు అజయ్‌ అక్కడికక్కడే చనిపోగా.. చిన్నకుమారుడు అజయ్‌ రక్తపు మడుగులో పడి పెద్దగా కేకలు వేశాడని, వెంటనే చుట్టుపక్కలవారు రాగా.. శ్రీకాంత్‌ కూడా బయట నుంచి తిరిగొచ్చాడని తెలిపారు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న రెండవ కుమారుడు ఆర్యను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రమాదేవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ఒక కుమారుడి మృతిచెందగా, మరొక కుమారుడు ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో తండ్రి, కుటుంబ సభ్యుల రోధనలతో విషాధం అలముకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here