Featuredఅంతర్జాతీయ వార్తలురాజకీయ వార్తలు

స్పీకర్‌ను కలసి రాజీనామాలు ఇవ్వండి

తక్షణమే చర్య తీసుకోవాలంటూ స్పీకర్‌కు సుప్రీం ఆదేశాలు

  • కావాలంటే మళ్లీ రాజీనామాలు సమర్పించండి
  • అసమ్మతి ఎమ్మెల్యేలకు సుప్రీం ఆదేశం
  • ఎమ్మెల్యేలందరికి భద్రత కల్పించండి
  • కర్ణాటక డీజీపీని ఆదేశించిన న్యాయస్థానం
  • విచారణ నేటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,జులై11(ఆర్‌ఎన్‌ఎ): సుప్రీంకోర్టు జోక్యంతో కర్నాటక రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌ దిశగా మలుపు తిరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలపై కప్పదాటు వ్యవహారంతో ఉన్న స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌కు సుప్రీం గట్టి ఆదేవాలు ఇచ్చింది. గురువారం సాయంత్రమే తుదినిర్ణయం తీసుకోవాలంటూ కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీం ఆదేశించింది. సాయంత్రం 6 గంటలకల్లా స్పీకర్‌ను కలుసుకోవాలంటూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన 10 మంది రెబల్‌ ఎమ్మెల్యేలను సుప్రీం ఆదేశించింది. కావాలనుకుంటే మళ్లీ రాజీనామాలు సమర్పించవచ్చునని సూచించింది. అసమ్మతి ఎమ్మెల్యేలకు తగిన భద్రత కల్పించాలని కూడా కర్ణాటక డీజీపీని ధర్మాసనం ఆదేశించింది. కర్నాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌కు కూడా సుప్రీం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోగా ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా తాము స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశామనీ… తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించక పోవడం, తాత్సారం చేయడం వెనుక సాంకేతికంగా తమకు ఎలాంటి కారణం కనిపించడం లేదని ఆయన ధర్మాసనానికి నివేదించారు. ఇదిలాఉంటే రాజరాజేశ్వరి నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మునిరత్నం ముంబయి నుంచి బెంగళూరుకు తిరిగొచ్చారు. అయితే ఆయన ఎందుకొచ్చిన విషయం తెలియరాలేదు.

ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని నమ్ముతున్నాం – శివకుమార్‌

అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై ఏదోఒకటి తేల్చేయాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. ఆ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని నమ్ముతున్నామని ఆయన అన్నారు. వారంతా వెనక్కి వచ్చి తమ రాజీనామాలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు బుధవారం డీకే శివకుమార్‌ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలు నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో… అక్కడి పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తీవ్ర నాటకీయ పరిణమాల మధ్య ఆయనను విమానాశ్రయానికి తరలించి.. అక్కడి నుంచి బెంగళూరుకు పంపించేశారు. మరోవైపు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ఇవాళ సాయంత్రానికి బెంగళూరుకు రానుండడంతో.. కర్నాటక హైడ్రామా ఏ మలుపు తిరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

గాంధీ విగ్రహం ఎదుట సోనియా, రాహుల్‌ ధర్నా..

పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం ఎదుట గురువారం సోనియా, రాహుల్‌ గాంధీలు ధర్నా చేశారు. 

కర్నాటక, గోవా అంశాలపై బీజేపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్‌ చెప్పారు. కర్నాటక, గోవా రాష్టాల్ల్రో బీజేపీ అక్రమపద్ధతిలో ప్రభుత్వాలను కూల్చి వేస్తున్నదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కాంగ్రెసేతర పార్టీలు కూడా పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టాయి. టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఎం పార్టీ ఎంపీలు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. గోవా అసెంబ్లీ పరిస్థితిపై గురువారం చర్చించాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కొడికున్నిల్‌ సురేశ్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. దీంతో గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ సంఖ్య అయిదుకు పడిపోయింది.

దేవెగౌడతో సమావేశమైన కుమారస్వామి..

కేబినెట్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కుమారస్వామి రాజీనామా చేస్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చిందన్నదీ తెలియరాలేదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close