మసూద్‌ అజార్‌ ఇక అంతర్జాతీయ ఉగ్రవాది

0
  • ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు భారీ విజయం లభించింది. పఠాన్‌కోట్‌, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైష్‌ ఎ మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. మసూద్‌ అజర్‌కు చెందిన ఆస్తులను స్తంభింపజేయనున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో మసూద్‌ పేరు చేర్చింది. మసూద్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చకుండా గతంలో నాలుగుసార్లు చైనా అడ్డుకుంది. అయితే, ఈసారి మాత్రం మసూద్‌ అజర్‌ విషయంలో అభ్యంతరాలను చైనా వెనక్కి తీసుకుంది. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఒత్తిడితో చైనా తన వైఖరి మార్చుకుంది. అతడిని ఐరాస బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకుండా చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి అయింది. అజార్‌ విషయంలో చైనా పెట్టిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చడానికి మార్గం సుగమం అయింది. డ్రాగన్‌పై అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ పతాక స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు చైనా దిగొచ్చింది. మరోవైపు ఐరాస ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే పాక్‌ కూడా స్పందించింది. ఇతడికి గ్లోబల్‌ ఉగ్రవాది ట్యాగ్‌ ఇవ్వడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అతడిని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చినట్లు భారత అంబాసిడర్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ప్రకటించారు. ‘మసూద్‌ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది’ అని అక్బరుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో అతని ఆస్తులు ఇతరత్రా విదేశాల్లో ఉంటే జప్తు చేసేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు. ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్ల వాహన శ్రేణిపై జరిగిన దాడిలో 41 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు తామే కారణమంటూ చెప్పడంతో ఈ జైషే మహమ్మద్‌ తెర విూదకు వచ్చింది. దీంతోపాటు ఆ సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాసను భారత్‌ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో భారత్‌కు అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు అండగా ఉన్నప్పటికీ చైనా మాత్రం మోకాలడ్డింది. సాంకేతిక పరమైన విషయాలున్నాయంటూ ఇటీవల కూడా మాట దాటవేసింది. అయితే తాజాగా చైనాపై మరింత ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు దిగొచ్చింది. దీంతో ఐరాస అజాద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here