తీర్పుకు ముందు అవునన్న వారే.. ఇప్పుడు కాదంటున్నారు

0

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప సన్నిధానం కేంద్రంగా వివాదం రాజుకున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందు వరకు (సెప్టెంబరు 28కి ముందు) ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలూ ప్రవేశించవచ్చని చాలా మంది అన్నారని ఆయన తెలిపారు. కానీ, అందుకు సానుకూలంగానే తీర్పు వచ్చిన తరువాత మాత్రం.. అలా అన్నవారు కూడా ఆ ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు ప్రవేశించకూడదని ఆందోళనలు నిర్వహిస్తున్నారని అన్నారు. ‘మొదట వారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా సమర్థించారు. ఇదో చారిత్రక తీర్పని కాంగ్రెస్‌ అంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా దీనికి మద్దతు తెలిపింది’ అని తెలిపారు. కానీ, ఇప్పుడేమో వారే ఆందోళనలు జరిగేలా భక్తులను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.’చాలా సంస్కరణల తరువాత కేరళ మళ్లీ లౌకిక వాదాన్ని అందిపుచ్చుకుంది. కానీ, సంఘ్‌ పరివార్‌ చాలా కాలం నుంచి ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని ప్రయత్నాలు జరుపుతోంది. శబరిమల వివాదం వారికి దొరికిన మరో అవకాశంగా భావిస్తున్నారు. భక్తులలో కొన్ని అపార్థాలు ఉన్నాయి. ఇవి తాత్కాలికం మాత్రమే. లౌకిక వాద కేరళ దీన్ని అధిగమిస్తుందని భావిస్తున్నాను. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వాదనలు జరుగుతున్న సమయంలో మేము సుప్రీంకోర్టుకి ఓ విషయాన్ని తెలిపాం. ఈ అంశంలో చట్టం రూపొందించడానికి మా వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని, న్యాయస్థానం ఇచ్చే తీర్పు మేరకే మేము నడుచుకుంటామని చెప్పాం. ప్రస్తుతం న్యాయస్థాన తీర్పుని పాటించడం తప్ప మా వద్ద ఇతర ఏ మార్గం లేదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను వినియోగించుకంటూ మహిళలు ఆలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంటే.. దేవస్థాన బోర్డుతో కలిసి వారికి సహకరించడమే మా పని. దేవస్థానంలోకి రండి అని మేమేం మహిళలను కోరట్లేదు. వచ్చే వారికి మాత్రం రక్షణ కల్పించాల్సి ఉంది’ అని పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here