మందకృష్ణ మాదిగ హౌస్‌ అరెస్ట్‌

0
  • కేసీఆర్‌ తీరుపై మండిపడ్డ ఎమ్మార్పీఎస్‌ నేతలు
  • ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళన

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కూల్చిన అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ, సీఎం కేసీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గోకపోవటాన్ని తప్పు పడుతూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో 22వరకు ఆందోళనలు చేపట్టేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు ఉదృతం కాకుండా ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణమాదిగను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అంబర్‌పేటలోని డీడీ కాలనీలో ఆయన నివాసం ఉండగా బుధవారం తెల్లవారుజామునే ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు మందకృష్ణను ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్భందించారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కృష్ణమాదిగ హౌస్‌ అరెస్టును తప్పుబట్టిన ఎమ్మార్పీఎస్‌ నేతలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నియంతాల వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నేతలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దళితుల పట్ల వివక్షతను ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. దళితుడైనందునే అంబేడ్కర్‌ను సీఎం అవమానించారన్నారు. కేసీఆర్‌ అనారోగ్య సమస్యలతోనూ బాధపడటం లేదని, జయంతి రోజునే ప్రగతి భవన్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అగ్రకులస్థుడైన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి ¬దాలో హైదరాబాద్‌ వస్తే పాదాభివందనం చేసిన కేసీఆర్‌, దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌తో మాత్రం కరచాలనం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌ నిరంకుశ విధానాన్ని వ్యతిరేఖిస్తూ, దొర పెత్తనాన్ని ఖండిస్తూ ఈ నెల 22వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. హౌస్‌ అరెస్టు చేసిన మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here