దీదీ.. రోజులు దగ్గరపడ్డాయి

0

  • హింసాత్మక ఘటనలకు మమతాదే బాధ్యత
  • ప్రచారం చేయకుండా నిషేధం విధించాలి
  • ఓట్‌ బ్యాంక్‌ కోసం హింస రాజకీయాలు
  • బెంగాల్‌లో కమలవికాసం ఖాయం
  • ఏడోదశతో 300 ఫిగర్‌ చేరుకుంటాం
  • భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనలకు సీఎం మమతా బెనర్జీనే బాధ్యత వహించాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనర్యాలీ నేపథ్యంలో మంగళవారం బంగాల్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందేనని, దీనికి కారణం మమతా బెనర్జీనే అన్నారు. ఆమెకు కుట్ర రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయని ఘాటుగా హెచ్చరించారు. బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే బాధ్యత అని, రాష్ట్రంలో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని అమిత్‌షా ఆరోపించారు. అక్రమంగా పోలింగ్‌ బూత్‌ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారని, తృణమూల్‌ కాంగ్రెస్‌ కేవలం పశ్చిమబెంగాల్‌లోని 42 సీట్లలోనే పోటీ చేస్తుందని, కానీ మేం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీచేస్తున్నామని అమిత్‌షా అన్నారు. గత ఆరుదశల ఎన్నికల్లో బెంగాల్‌లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదని, దీనికి తృణమూల్‌ కాంగ్రెసే బాధ్యత వహించాలని అమిత్‌ షా అన్నారు. తన రోడ్‌షోపై టీఎంసీ కార్యకర్తలు మూడు సార్లు దాడులు చేశారని, తనపై రాళ్ల దాడి జరిగిందని.. తృణమూల్‌ కార్యకర్తలు పెట్రోల్‌ బాంబులతో అలజడి సృష్టించారని అమిత్‌షా ఆరోపించారు. సీఆర్‌పీఎఫ్‌ దళాలు లేకపోయుంటే తాను క్షేమంగా బయటపడుండే వాడిని కాదని అన్నారు. ఈశ్వరచంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేసింది కూడా తృణమూల్‌ కార్యకర్తలేనని అన్నారు. మమత తన ప్రసంగాల్లో బీజేపీపై పగ తీర్చుకుంటామని అన్నారని.. ఈ వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా మమతా బెనర్జీపై నిషేధం విధించాలని షా డిమాండ్‌ చేశారు. ఓట్‌ బ్యాంక్‌ పాలటిక్స్‌ కోసం మమత హింస చెలరేగేలా చేస్తున్నారని ఆరోపించారు. మమత ఎవర్ని ఎంత రెచ్చగొట్టినా సరే.. బెంగాల్‌లో కమల వికాసం ఖాయమని షా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్నా..

అమిత్‌ షా రోడ్‌ షో హింసాత్మకంగా మారిన ఘటనను నిరసిస్తూ బుధవారం కేంద్ర మంత్రులు ఢిల్లీలో ధర్నా చేప్టటారు. కోల్‌కత్తాలో బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. కేంద్ర మంత్రులు హర్షవర్దన్‌, జితేంద్ర సింగ్‌, విజయ్‌ గోయల్‌తో పాటు ఇతర పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. బెంగాల్‌లో జరిగిన హింసను కాంగ్రెస్‌ పార్టీ కూడా ఖండించింది. అయితే బీజేపీ ఆ హింసకు కారణమంటూ గులాం నబీ ఆజాద్‌ ఆరోపించారు. బెంగాల్‌లో బీజేపీ గెలవాలని తపనతో ఉన్నదని, దానికోసం సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి ప్రభుత్వ శక్తులను వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను సీపీఎం తీవ్రంగా ఖండించింది. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలతో దాడిలో ఈశ్వర్‌ చంద్ర విగ్రహం ధ్వంసమైంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో ఆ పార్టీ నేతలు ర్యాలీ  నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆరుదశల్లోనే మెజార్టీ మార్క్‌ దాటేశాం : అమిత్‌ షా

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆరు దశల్లో పోలింగ్‌ ముగిసిందని.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్‌ను భాజపా దాటేసిందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరుదశల్లో ప్రభుత్వ ఏర్పాటుకుకావాల్సిన మెజార్టీని సాధించామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తారని మీడియా పదేపదే అడుగుతున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను దేశమంతా పర్యటించాను కనుక ఈ విషయం స్పష్టత వచ్చిందన్నారు. ప్రచార సమయంలో ప్రజల స్పందనను ప్రత్యక్షంగా చూశాను. వారి స్పందనను చూసి ఐదు, ఆరు దశల పోలింగ్‌ పూర్తయిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ మార్క్‌ని దాటేశామనే ధీమా మాలో కలిగిందన్నారు. ఏడో దశ పోలింగ్‌ పూర్తి అయన తర్వాత మొత్తంగా 300పైగా స్థానాల్లో గెలుస్తాం. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఓ మీడియా సమావేశంలో అమిత్‌ షా వివరించారు. మే 19న చివరి దశ పోలింగ్‌ జరగనుంది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ లేదా కూటమి కనీసం 272 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 282 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ 2014లో కేవలం 44 స్థానాల్లో మాత్రమే గెలిచింది. లోక్‌సభలో ప్రతిపక్ష ¬దాకు కావాల్సిన కనీస స్థానాలను సైతం కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు యూపి కూటమి పార్టీలు తామే అధికారంలోకి వస్తామన్న ధీమాలో ఉన్నారు. తానే ప్రధాని అన్న భావనలో రాహుల్‌ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here