బీజేపీపై మమతా విమర్శలు

0

కోల్‌కతా: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పోలీస్‌ సహా కీలక వ్యవస్థలను అధికార దుర్వినియోగం ద్వారా కాషాయ పార్టీ తన గుప్పిట్లోకి తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజ్‌ వ్యాలీ, శారదా పోంజీ కుంభకోణాల కేసుల్లో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మమతా.. ట్విటర్‌ ద్వారా దీనిపై స్పందించారు. ‘భాజపా అధిష్ఠానం చాలా నీచంగా రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ధోరణితో వ్యవహరిస్తోంది. వారి లక్ష్యం కేవలం రాజకీయ పార్టీలే కాదు. తమ అధికారాలను దుర్వినియోగపరుస్తూ పోలీసు వ్యవస్థను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తున్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. వారి చర్యలను మేము ఖండిస్తున్నాము’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే ఉత్తమ అధికారుల్లో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ ఒకరు.. ఆయనలోని ధైర్యం, నిజాయతీలను ప్రశ్నించలేము. ఆయన 24 గంటలూ పని చేస్తూనే ఉంటారు. ఆయన ఇటీవల ఒకే ఒక్క రోజు సెలవు పెట్టారు. కొందరు అసత్యాలు ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.. కానీ, అసత్యాలు ఎప్పుడూ అసత్యాలుగానే ఉంటాయి’ అని మమతా బెనర్జీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం రాజకీయ ప్రత్యర్ధులపై కక్షసాధించడంతో పాటు పోలీస్‌ వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్ధలనూ ధ్వంసం చేసేందుకు వాటిని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు మమతా సర్కార్‌ బెంగాల్‌లో బీజేపీ నేతల ప్రచార ర్యాలీలను అనుమతి నిరాకరించడం ద్వారా అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమిత్‌ షా ర్యాలీకి అనుమతి నిరాకరించిన బెంగాల్‌ అధికారులు తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి నిరాకరించారు. కాగా, రోజ్‌ వ్యాలీ, శారదా పోంజీ కుంభకోణాల కేసుల్లో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విచారణకు సంబంధించిన కొన్ని పత్రాలు మాయంకావడతో రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించాలని భావించింది. ఇదే సమయంలో ఆయన కనపడకుండా పోయారు. ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here