Featuredస్టేట్ న్యూస్

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదు…

  • భూయాజమానులకోసం ఆపలేం
  • చెల్లింపులో అన్యాయం జరిగితే తమవద్దకు రావొచ్చు
  • నిర్వాసితుల పరిహారాన్ని వారిలాయర్లకు అందజేయండి
  • నిర్వాసితుల పిటీషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

హైదరాబాద్‌ :

మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ పనులపై స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం.. మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ పనులపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు హైకోర్టు సూచించింది. అయితే పరిహారంలో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని న్యాయస్థానం సూచించింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చునని హైకోర్టు సూచించింది. పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన 60మంది నిర్వాసితుల పరిహారాన్ని వారి లాయర్లకు అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా నిర్వాసితులకు పరిహారాన్ని అందజేశారు. దీంతో సహాయ పునరావాస ప్యాకేజీ వందశాతం పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 కేసులను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించింది. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.

హైకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంప పెట్టు – మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ పై హైకోర్టు తీర్పుపట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు హైకోర్టు తీర్పు చెంప పెట్టు వంటిదన్నారు. ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకోవాలని, రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణాన్ని కూడా అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా..ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో టీఆర్‌ఎస్‌ సర్కారు పరిహారం ఇస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని తెలిపారు.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close