ఓటుతో కూటమికి బుద్ధి చెప్పండి

0

పెద్దపల్లి (ఆదాబ్‌ హైదరాబాద్‌): కేసీఆర్‌ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఒక్కటిగా వస్తున్నాయని, వాటికి ఓటు ద్వారా బుద్ది చెప్పి మళ్లీ అభివృద్ధి పాలన సాగాలంటే కేసీఆర్‌ను గెలిపించుకుం దామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. తెలుగు దేశం, కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌, టీడీపీ కలవడమా? కలికాలంలో చిత్రవిచిత్రమైన పనులవుతాయని బ్రహ్మంగారు చెప్పారని, ఇదిగో.. ఇవే చిత్రవిచిత్రమైన పనులంటే అని అన్నారు. కాంగ్రెస్‌ – టీడీపీ కలవడమంటే.. పాము, ముంగిస కలిసినట్లే అని కేటీఆర్‌ ఎద్దెవా చేశారు. చొప్పదండి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తామనిహావిూ ఇచ్చారు. రవిశంకర్‌ ను గెలిపిస్తే ప్రతి చెరువును, కుంటను నింపుతామన్నారు. కేసీఆర్‌ ను ఎదుర్కొలేక నాలుగైదు పార్టీలు ఒక్కటైయ్యాయని, కేసీఆర్‌ ను దించుదామని డైలాగులు కొడుతున్నారన్నారు. కేసీఆర్‌ ను ఎందుకు దించాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌, పెన్షన్లు ఇస్తున్నందుకు, రైతుబీమా, రైతుబంధు అమలు చేస్తున్నందుకు కేసీఆర్‌ ను దించలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ను బొంద పెడుతా అని టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపిస్తే అదే పార్టీ ఇవాళ కాంగ్రెస్‌ తో జతకట్టింది. పాము, ముంగిస కలిసినట్లుందన్నారు. రాహుల్‌ గాంధీ సీట్లు, చంద్రబాబు నోట్లు ఇస్తున్నాడని, ఎవరి ప్రలోభాలకు ఆగం కావొద్దని, ఇది చైతన్యం ఉన్న తెలంగాణ అని, పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. టీడీపీ, కాంగ్రెస్‌ పాలనలో ఏవిధమైన సంక్షేమం ఉన్నది? ఈ రోజు ఎలా ఉన్నది? ఆనాడు ఇచ్చిన పెన్షన్‌ ఎంత.. ఈరోజు ఎంత? ఆనాడు ఇచ్చిన బియ్యం ఎన్ని, ఈరోజు ఎన్నో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దివ్యాంగులకు ఆనాడు రూ.500 ఇస్తే నేడు రూ.1500 ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి కింద పేదింటి అమ్మాయి పెండ్లికి లక్షానూటపదహార్లు ఇస్తున్నామని తెలిపారు. ఇండియాలో ఏ రాష్ట్రంలోనన్న ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మహిళలు ప్రసవానికి వస్తే పైసలు ఖర్చు అయ్యేది బంద్‌ అయిపోయిందని, గవర్నమెంటే ఉల్టా అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలతోపాటు కేసీఆర్‌కిట్‌ కూడ ఇచ్చి, అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దించుతుందన్నారు. నేను చెప్పేవన్నీ విూ గ్రామంలో అమలవుతున్నాయని, వాస్తవాలు గమనించమని కేటీఆర్‌ కోరారు. ఈసారి విూరు దీవించి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఆసరా పెన్షన్లన్నీ రూ.1000 నుంచి రూ.2016కు చేస్తం. దివ్యాంగులకు ఇచ్చే రూ.1500ను రూ.3016కు పెంచుతం. అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3016 భృతి అందజేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here