Featuredప్రాంతీయ వార్తలు

మహా’పీఠం’ శివసేనకే!

  • ఐదేళ్లు పాటు శివసేన అభ్యర్థే సీఎం
  • మూడు పార్టీల అధినేతలు అంగీకారం
  • పదవుల పంపకాలపై వీడిన చిక్కుముడి
  • ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం పదవులు
  • శివసేనకు 14, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌ 12 మంత్రి పదవులు
  • నేడు గవర్నర్‌ను కలవనున్న మూడు పార్టీల నేతలు
  • ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి
  • గవర్నర్‌ స్పందనపైనే సర్వత్రా ఉత్కంఠ

ముంబయి

పదిహేనురోజులు సాగుతున్న మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కనీస ఉమ్మడి కార్యక్రమానికి మూడు పార్టీల అధినేతలు అంగీకారం తెలిపారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పదవుల పంపకాలపై కూడా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్ర రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైన సీఎం పిఠాన్ని ఐదేళ్లపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ అంగీకరించాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్‌, ఎన్సీపీకి మండలి చైర్మన్‌ దక్కేలా నేతలు అంగీకారానికి వచ్చారు. శివసేనకు సీఎంతో పాటు 14 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనికి మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, సోనియా గాంధీ అంగీకారం తెలిపారు. సీఎం పిఠాన్ని ఎన్సీపీ, శివసేనే చెరి రెండున్నరేళ్లు పంచుకుంటాయని తొలినుంచి ప్రచారం జరిగినా.. చివరికి శివసేనకు ఇచ్చేందుకు ఇరు పార్టీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే శుక్రవారమే గవర్నర్‌ భగత్‌ఇసంగ్‌ కోశ్వారీని కలిసేందుకు అపాయింట్‌ కోరగా గవర్నర్‌ శనివారం మధ్యాహ్నం 3గంటలకు అపాయింట్‌ ఇచ్చినట్లు తెలిసింది. శనివారం మూడు పార్టీల ముఖ్యనేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఇదివరకే రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న నేపథ్యంలో గవర్నర్‌ ఏ విధంగా స్పందిస్తారానేది ఆసక్తికరంగా మారింది. వీరికి అవకాశం ఇస్తారా? లేక రాష్ట్రపతి పాలనను కొనసాగిస్తారా అనేది శనివారం స్పష్టత కానుంది. మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనల మహాశివ్‌ కూటమి ప్రభుత్వం ఈ 17వ తేదీన ఏర్పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు – శరద్‌ పవార్‌

శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని, పూర్తిగా ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటాయని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చెప్పారు. మధ్యంతర ఎన్నికలు మహారాష్ట్రలో రావని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ఏఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలన కింద ఉందని, మూడు పార్టీలు కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌కు ఓకే చెప్పాయని శరద్‌ పవార్‌ చెప్పారు. శనివారం గవర్నర్‌ను మూడు పార్టీల ప్రతినిధులు కలుస్తారని చెప్పారు. గత వారం సీఎం పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ శివసేన ఎన్సీపీ ప్రభుత్వం ఆరునెలలకంటే ఎక్కువగా ఉండదని చెప్పారు. ఫడ్నవీస్‌ వ్యాఖ్యలపై స్పందించిన

పవార్‌… తనకు దేవేంద్ర ఫడ్నవీస్‌ చాలా కాలంగా తెలుసునని అయితే జోతిష్యం కూడా చెబుతారని తెలియదని శరద్‌ పవార్‌ సైటైర్‌ వేశారు. ఇక మళ్లీతానే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతానన్న ఫడ్నవీస్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని శరద్‌ పవార్‌ తెలిపారు. మళ్లీ వస్తాను మళ్లీ వస్తాను అని చెబుతుంటే తాను ఏదో అనుకున్నట్లు చెప్పిన శరద్‌ పవార్‌… ఫడ్నవీస్‌ మాటల ద్వారా మీడియా మరో సమాచారం ఇస్తోందన్నారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా శివసేన అభ్యర్థే ఉండాలని ఆ పార్టీ ఏమైనా కండీషన్స్‌ పెట్టిందా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రొటేషన్‌ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి పంచుకోవాలని చెబుతూ శివసేన పార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు తానే ముందుగా వచ్చినట్లు గుర్తుచేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవిపైనే ఉన్న శివసేన… బీజేపీతో సంబంధాలు తెంపుకుందని ఆ పదవినే ఎన్సీపీ ఆఫర్‌ చేసిందని మరో ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంకు సంబంధించిన అన్ని పార్టీలకు డ్రాప్ట్‌ను పంపామని చెప్పిన నవాబ్‌ మాలిక్‌, ఇక రైతు సమస్యలు, నిరుద్యోగం అంశాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close