ఫలితాల రోజే మహాకూటమి సమావేశం : సోనియాగాంధీ

0

కాంగ్రెస్‌ సారథ్యంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఏకమై మహాగత్‌బంధన్‌ కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 19న చివరిదశ పోలింగ్‌ జరగనుంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తిస్థాయి మెజారిటీ రానిపక్షంలో తదుపరి కార్యచరణపై సవిూక్షించేందుకుగాను మే 23న ఎన్నికల ఫలితాల విడుదల రోజే గత్‌బంధన్‌ కూటమి సమావేశం అయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పర్యవేక్షిస్తున్నారు. దీనిలో భాగంగానే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లతో సోనియా మాట్లాడినట్లు తెలుస్తోంది. 2017లో రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని చేసిన అనంతరం యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గత్‌బంధన్‌ కూటమి ఏర్పాటులో చురుగ్గా వ్యవహరిస్తూ ముందుకు కదులుతున్నారు. గత్‌బంధన్‌ కూటమి తెరపైకి వచ్చినప్పటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ కూటమికి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేని గద్దెదించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఈ ప్రయత్నంలో కూటమిలో అర్హతగలవారు ప్రధాని ఎవరైనా ఎలాంటి అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌నబీ ఆజాద్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకుగాను 17 స్థానాల్లో విజయం సాధించి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 13 సీట్లు గెలుచుకున్న భాజపా ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ సారి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సోనియా ముందుకు కదులుతున్నారు. ఏ మాత్రం సమయం వృథా చేయకుండా ప్రతిపక్షాలన్నింటినీ సిద్ధం చేసేలా ముందుస్తు ప్రణాళికతో కాంగ్రెస్‌ పావులుకదుపుతున్నట్లు తెలుస్తోంది. తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ, మాయావతి (బీఎస్పీ), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ) ఈ సమావేశానికి హాజరవుతారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మాయావతి, మమత బెనర్జీ ప్రధాని రేసులో ఉన్న నేపథ్యంలో గత్‌బంధన్‌ కూటమిలో వీరి పాత్ర కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here