రెచ్చిపోయిన మావోలు

0
  • పోలింగ్‌ కేంద్రం సమీపంలో పేలిన బాంబు

నారాయణ్‌పూర్‌ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లాలో తెల్లవారుజాము 4 గంటల సమయంలో బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం సమీపంలో బాంబు పేల్చారు. ఆ సమయానికి ఓటర్లు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలింగ్‌ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఈ దాడి జరిగింది. నారాయణ్‌పూర్‌-దంద్వాన్‌ రోడ్డులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు భద్రతా సిబ్బంది బయల్దేరారు. ఈ విషయం తెలిసి మావోయిస్టులు ఆ మార్గంలో ఐఈడీ బాంబు పెట్టారు. అయితే, మావోయిస్టుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి వేరే మార్గం నుంచి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. దీంతో మావోయిస్టులు ఆ బాంబును పేల్చి అక్కడి నుంచి పరారయ్యారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది. బస్తర్‌ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బాంబు పేలుడు వల్ల పోలింగ్‌కు ఎలాంటి ఆటంకం వాటిల్లలేదు. ఉదయం 7 గంటలకు ఇక్కడ పోలింగ్‌ మొదలైంది. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ ముగుస్తుంది. మంగళవారం దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఎమ్మెల్యే మండవి సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన దంతెవాడలోని సకులనార్‌లో చోటు చేసుకుంది. దీంతో చత్తీస్‌గడ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతోంది.

పోలింగ్‌బూత్‌కు 150మీటర్ల దూరంలో బాంబు పేలుడు

మహారాష్ట్రలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రానికి అత్యంత సమీపంలో ఐఈడీ పేల్చాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. గచ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో వాఘేజరీ ప్రాంతంలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి 150మీటర్ల దూరంలో బాంబు పేలుడు సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో పోలింగ్‌ కేంద్రం ముందు ఓటర్లు క్యూలైన్‌లో నిల్చుని ఉన్నారు. పేలుడు శబ్దాలతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here