తెలంగాణపై కమలం కన్ను …

0

యువతను ఆకట్టుకునే పనిలో బిజీ

గ్రామస్థాయి బలోపేతంపై అడుగులు

అంచనాలకు మించి కమలం మెజారిటీ స్థానాలను సాధించి అధికారంలోకి వచ్చింది. ఎవరితో సంబంధం లేకుండా అనుకున్నవాటికన్నా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొంది. దేశమంతా కమలం గాలి వీస్తూనే ఉన్నా అధినాయకుల్లో మాత్రం ఇంకా ఎదో తెలియని అసంత ప్తి ఉన్నట్లు కనిపిస్తోంది.. ఎంపీలను గెలవడమే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా కాషాయం జెండా ఎగరాలని వ్యూహాలు పన్నుతున్నారు బిజెపిలోని రాజకీయ అపర చాణక్యులు.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను వారు టార్గెట్‌ చేయబోతున్నారా అంటే కాదు కాదు అల్రెడీ చాపకింద నీరులా విస్తరించారని అర్థమైపోతుంది. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని జాతీయ అధినాయకులు ప్రణాళికలు రచించి అమలు చేయడంలో బిజీగా మారిపోయారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో చావు దెబ్బతిన్న బిజెపి పార్టీని ఎవరూ లెక్కలోకి తీసుకోలేదు. అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం తెలంగాణలో బిజెపి దుకాణం మూసుకోవాల్సిందేనని మరీ మరీ చెప్పారు. కాని లోక్‌సభ స్ధానాల్లో ఎవరూ ఊహించని ఫలితాలు తెలంగాణలో రావడంతో అన్ని పార్టీలు నాయకులు ఖంగుతిన్నారు. ఉనికే లేదనుకున్న బిజెపి నాలుగు లోక్‌సభ స్థానాలను ఏలా కైవసం చేసుకుందనేదే ఎవరికి అర్థం కాక తలలు పట్టుకున్నారు.. ఒక్కసారి బిజెపి అడుగు బలంగా వేస్తే దాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదని వివిధ రాష్ట్రాలలోని రాజకీయనాయకులందరికీ తెలిసిన విషయమే.. అందుకే కాంగ్రెస్‌ కంటే కమలం పార్టీనే అత్యంత అపాయమని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి తెలంగాణలో విస్తరించకుండా తన ప్రయత్నాలు తాను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

కేంద్రంలో కాషాయం జెండా ఎగురుతూనే ఉంటుంది. ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా మనం ఎగరగలుగుతున్నాం. అదే మన విజయం కాదు.. రాష్ట్రాలలో కూడా మనమే అధికారమే చేపట్టాలి. బిజెపి జెండా రెపరెపలాడాలి. ప్రాంతీయ పార్టీలే వారి స్వంత జామీనులా ఉంటూ జాతీయ పార్టీలకు అవకాశాన్ని రాకుండా చేస్తున్నారు. మన నినాదం, మన నాదం అంతా హిందుత్వమే.. అన్ని మతాలు, వర్గాలను కలుపుకోనిపోయేలా ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోవాలన్నదీ బిజెపీ వ్యూహాం. ముఖ్యంగా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం అనేదీ పార్టీ ఏదీ లేకుండా తమకు నచ్చినట్టు పరిపాలన సాగిస్తూ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహిస్తుంది. తెలంగాణలో పాలన పడకేసినట్లుగానే ఉంది. అందుకే తెలంగాణలో బిజెపి పార్టీ బలమైన పునర్నిర్మాణం చేయాలి. అన్ని వర్గాల ప్రజలను, యువతను కలుపుకొని పోయేలా పకడ్బందీ ప్రణాళిక రచించాలనేది బిజెపి వ్యూహం. తెలంగాణలో బిజెపి పార్టీ ఆనవాళ్లేలేవని చెపుతున్న ఇతర పార్టీలు లోక్‌సభలో వచ్చిన సీట్లను చూసి పార్టీ ఎంత బలంగా ఉందో ఒక్కసారి వారికి వారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పార్టీలోని అంతర్గత లోపాలో, మరెంటో తెలియదు కాని తెలంగాణలో ఒక్కసీటు కూడా సాధించలేదు. కేంద్రంలో ఎంత అధికారంలో ఉన్నా, ఢిల్లీ నుంచి ఎన్ని వ్యూహాలు పన్నినా క్షేత్రస్థాయిలో క్యాడర్‌ లేకపోతే ఏమి చేయలేరని అనుకుంటున్న పార్టీలకు లోక్‌సభ ఫలితాలు చెంపపెట్టులా తగిలాయని తెలుస్తోంది. బిజెపి పార్టీ పట్టణాలలోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా బలంగా కూరుకుపోతుందని, ఇలాంటి సంధర్బాల్లోనే కేంద్ర, రాష్ట్ర కమిటీల నుంచి మరింత ఊతం అందిస్తే 2024లో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదని అందుకు ఇప్పటినుంచి అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ను రోజురోజుకు దెబ్బతీస్తూ బిజెపిని బలంగా స్థాపించాలని ఆలోచనతోనే బిజెపి వ్యూహకర్త అమిత్‌షా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.

క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్న బిజెపి..

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ గ్రామ స్థాయి నుంచి పుంజుకుంటుందని అర్థమైపోతుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బిజెపి ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందో తెలుస్తోంది. పట్టణాలకే బిజెపి పార్టీ పరిమితమయిందనీ చెపుతున్న వారికి మొన్నటి ఎన్నికల ఫలితాలను చూసి నోటి నుంచి మాట కూడా రావడం లేదు. సికింద్రాబాద్‌ పట్టణ ప్రాంతం కనుక అంతా చదువుకున్న వాళ్లు, తెలిసిన వారే ఉంటారు కాబట్టి బిజెపి గెలిచిందని అనుకుందాం. కాని అదిలాబాద్‌లో బిజెపి గెలవడానికి కారణాలెంటో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. తెలంగాణలోని వెనుకబడిని జిల్లాగా అదిలాబాద్‌కు పేరుంది. అక్కడ అంతా గిరిజనులు, వేలాది తండాల వాసులే అధికంగా ఉంటారు. అక్కడ ఏలా గెలిచిందో ఎవ్వరికి ఇప్పటికి అర్థం కావడం లేదు. కెసిఆర్‌కు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయి బిజెపి పార్టీ అక్కడ కూడా పాగా వేసింది. అక్కడ బిజెపి పాగా వేయడంతో కెసిఆర్‌కు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తన కూతురు కవిత కూడా బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. ప్రధాన స్థానాల్లో బిజెపి గెలుపు జెండా ఎగరేస్తూ గులాబీ కారును వెనక్కిలాగి పారేసింది. ప్రజలు అనుకొని తీర్పులు ఇవ్వడంతో టిఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. గత ఐదారు నెలల ముందే ఆఖండమైన మెజారిటీతో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న టిఆర్‌ఎస్‌ లోక్‌సభలో అనుకొని రీతిలో ఓటమి పాలవడంపై కెసిఆర్‌ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ కన్నా బిజెపి వ్యూహాలు వేరు..

కాంగ్రెస్‌ పార్టీని అట్లనో, ఇట్లనో తట్టుకోవచ్చు కాని బిజెపిని తట్టుకోవడం మన వల్లకాదని అందుకే ఎదుగుతున్న ఆ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయడమే తమ ముఖ్య ఉద్దేశ్యంగా అధినేత తెగ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి కిందిస్ధాయిలో సరియైన క్యాడర్‌ లేకుండానే ఇన్ని ఫలితాలు సాధిస్తే అమిత్‌షా ను పూర్తి స్థాయి ద ష్టిపెడుతే మాత్రం గులాబీ కారు కనుమరగవ్వడమే ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగైన పట్టుసాధించి అసెంబ్లీలో సైతం అధికారాన్ని దక్కించుకోవాలని బిజెపి శ్రేణులు జోరు మీద దూసుకెళ్తుతున్నారు. కాని వారి వేగానికి కళ్లెం వేసి బిజెపికి క్యాడర్‌ లేకుండా చేయడమే తన తక్షణ కర్తవ్యమంటూ టిఆర్‌ఎస్‌ బాస్‌ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. జాతీయ స్థాయిలో అతివేగంగా దూసుకుపోతున్న బిజెపి పార్టీని కెసిఆర్‌ అందుకోగలడా, లేదా చతికిలపడుతాడా అనేదే అర్థం కావడం లేదు. తెలంగాణలో బిజెపిని మరింత బలపరచాలనే ఉద్దేశ్యంతోనే సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డికి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు సైతం అప్పజెప్పారు. బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాంలో ఇదీ ఒక భాగమేనని, వారి వ్యూహాలకు టిఆర్‌ఎస్‌ తట్టుకోవడం కష్టంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పకడ్బందీగా బిజెపి ప్రణాళికలు రచిస్తే మాత్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం పెద్దకష్టం కాదనే తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here