ముంచుకొస్తున్న పెథాయ్‌

0

విశాఖపట్టణం (ఆదాబ్‌ హైదరాబాద్‌):

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న మూడునాలుగు రోజుల్లో రాష్ట్రం వైపుగానే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 960 కిలోవిూటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్రేయంగా 1130 కిలో విూటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్రంగా మారి నేడు, రేపు తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నం, అమలాపురం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని, ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది భారత వాతావరణ శాఖ స్పష్టం చేయలేదు. ఈ తీవ్రవాయుగుండం, తుపాను ప్రభావాలతో రాష్ట్రంలో శనివారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, 16వ తేదీ ఈ నాలుగు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో, 17వ తేదీ కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పలుచోట్ల నమోదవుతాయని అంటున్నారు. మరోవైపు తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను సిద్ధం చేసింది. ఈ నెల 13 నుంచి 16 దాకా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోని మత్స్యకారులు వెళ్లకూడదని, వేటకు వెళ్లిన మత్స్యకా రులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచనలు చేశారు.

అప్రమత్తమైన ప్రభుత్వం.. తిత్లీ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని పథకాల ట్యాంకులను నీటితో పూర్తిగా నింపాలని, ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, నీళ్ల ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని, చేతి పంపులన్నీ పనిచేసేలా చూడాలని వివరించారు. విద్యుత్తు వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధనశాఖ మంత్రి కళా వెంకట్రావు ఆదేశించారు. సరఫరాలో అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సవిూక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావ పరిస్థితిని సవిూక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేట తుపాన్‌ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉండాలని మంత్రి ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు ఆర్టీజీఎస్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీంతో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేసింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులో ఆకాశం మోఘావృతమై ఉంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని.. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల 20 సెం.విూలకుపైగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here