Featuredజాతీయ వార్తలు

బతుకులు బుగ్గి పాలు

  • అనాజ్‌ మండీలో ఘోర అగ్ని ప్రమాదం..
  • ప్రాణాలు తీసిన విషవాయువు
  • 43 మంది మృతి.. పలువురికి గాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి లక్ష ఎక్స్‌గ్రేషియా

రాజధాని దిల్లీ ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 43 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చాలా మంది పొగతో ఊపిరాడక చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో 50 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో 30 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 20 మంది భవనంలో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5.22గంటల సమయంలో ఈ మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. భవనంలో స్కూల్‌ బ్యాగులు, బాటిళ్లు సహా మరికొన్ని ఇతర చిన్న సామగ్రి తయారు చేసే కుటీర పరిశ్రమ ఉన్నట్లు డిప్యూటీ ఫైర్‌ చీఫ్‌ ఆఫీసర్‌ సునీల్‌ చౌదరి తెలిపారు. కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు ఆయన వెల్లడించారు. మృతులంతా స్థానిక కర్మాగారంలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదం జరిగిన ఈ భవనానికి ఫైర్‌ క్లియరెన్స్‌ లేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పరారైన భవన యజమాని రేహాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత శిక్షా స్మృతి 304 కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆ ఫైర్మ్యాన్‌ రియల్‌ హీరో

దిల్లీ అగ్నిమాపక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్‌ శుక్లా ఎంతో సాహసం ప్రదర్శించి అందరికన్నా ముందు అనాజ్‌ మండీ భవనంలోకి ప్రవేశించారు. అనంతరం మంటల్లో చిక్కుకున్న 11 మందిని ప్రమాదం నుంచి బయట పడేసి, ప్రాణాలు కాపాడగలిగారు. ఈ క్రమంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఎల్‌ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. దిల్లీ ¬ంమంత్రి సత్యేంద్ర జైన్‌ ఆస్పత్రికి వెళ్లి శుక్లాను పరామర్శించారు.

యజమానిపై కేసు

అగ్నిప్రమాదానికి గురైన భవన యజమాని రెహాన్పై 304, 285 సెక్షన్ల కింద దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానితో పాటు అతడి మేనేజర్‌ ఫరఖాన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భవనంలో నడుస్తున్న కర్మాగారానికి ఎలాంటి అగ్నిమాపక అనుమతులూ లేవని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం కేజ్రీవాల్‌

అనాజ్‌ మందీ ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. గాయపడ్డవారికి రూ.1 లక్ష అందజేస్తామని తెలిపారు. ప్రమాద ఘటనకు గల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అనాజ్‌ మందీ ప్రమాద ఘటనపై మెజిస్టేరియల్‌ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు. మరోవైపు బిల్డింగ్‌ యాజమాని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవనంలో ఫైర్‌ సేప్టీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రమాదం జరిగాక పొగచూరడంతో చాలా మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఎల్‌జేఎన్‌పీ వైద్యుడు ఒకరు ధ్రువీకరించారు. మరోవైపు ఘటనాస్థలం వద్దకు అనురాగ్‌ ఠాకూర్‌, మనోజ్‌ తివారీ చేరుకున్నారు. అనాజ్‌ మందీ ప్రమాదంతో తన హృదయం కలచివేస్తోందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోరుకోవాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా సంతాపం తెలిపారు. ప్రమాదంపై గల కారణాలు దర్యాప్తులో తేలుతాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొన్నది. ప్రమాదం ఎవరు చేసినా ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తప్పవని ఢిల్లీ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ స్పష్టంచేశారు. ప్రమాద ఘటన స్థలానికి మంత్రులు చేరుకున్నారు.

రాష్ట్రపతి దిగ్బ్రాంతి..

ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మ?తుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందజేయాలన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదంతో రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 30 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేయడంతో ఊపిరిపీల్చుకున్నారు.

ఢిల్లీ ప్రమాదం కలిచివేసింది: సీఎం కేసీఆర్‌

ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కలిచివేసిందని సీఎం తెలిపారు. ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికులు నిద్రిస్తుండగా.. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 43 మంది కార్మికులు మరణించగా.. మరి కొంత మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. భయానక ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఆనాడు.. మళ్లీ ఇప్పుడు

1997లో ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అప్పుడు ఉపహార్‌ థియేటర్‌లో ప్రమాదం జరిగింది. అప్పుడు తొక్కసలాట కూడా జరిగి.. 59 మంది చనిపోయారు. ఆ తర్వాత అనాజ్‌ మందీ ఘటనేనని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన చాలా మంది ఇప్పటికీ గుర్తొస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ నాటి విషాద ఘటన ఛాయలు మరవకముందే.. మరో ఘటన జరిగింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close