Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

శ్రీవారి సన్నిధిలో సాహితీ తీరం.. పుస్తక సంబరం!

★ ఆలోజింప చేసిన స్రవంతి

(పరమాత్మ, ఆదాబ్ హైదరాబాద్)

తిరుపతిలో వరుసగా రెండో సంవత్సరం నిర్వహించిన పుస్తక ప్రదర్శన సాహితీ పరులతో పాటు, ప్రజానీకాన్ని కూడా ఆకట్టుకుంది. మొత్తం 20 ప్రత్యేక స్టాళ్లతో… వివిధ రకాల ప్రత్యేకమైన పుస్తకాలతో ఉత్సవం కనులపండువను తలపించింది. నవ్యాంధ్ర పుస్తక సంబరాల పేరుతో ఎస్వీ హైస్కూలు మైదానంలో నిర్వహించిన పుస్తక ఉత్సవం ఈనెల 21న ప్రారంభమైంది. గతంలో కంటే ఈ సారి భిన్నంగా… అందంగా పుస్తక ఉత్సవాన్ని నిర్వహించారు.

మొత్తం 20 స్టాళ్లలో 500 ప్రచురణ సంస్థల పుస్తకాలు… సుమారు 30 వేల పుస్తకాలతో పుస్తకోత్సవం అహో అనిపించింది. కేవలం సాహిత్య పుస్తకాలే కాదు… బాల సాహిత్యం… పోటీ పరీక్షల పుస్తకాలు, పాఠ్యాంశాలకు అవసరం అయ్యే పుస్తకాలు ఈ సారి ప్రత్యేకం. అంతేకాదు.. ఈ ఏడాది విరసం, చిత్తూరు రచయితల పుస్తకాల స్టాళ్లు ఆకర్షణీయం. పుస్తకాలను కొనుగోలు చేసేవారికి 10 శాతం డిస్కౌంట్‌ను అందించారు.

కుటుంబ సమేతంగా….:
పుస్తక ప్రదర్శనలో అన్నీ రకాల పుస్తకాలు కనిపించాయి. మహిళా రచయితలు… పిల్లలకు కావల్సిన బొమ్మల పుస్తకాలు… సాహిత్యం… స్ఫూర్తివంతం…. నవలలు ఇలా అన్నీరకాల పుస్తకాలకు నిలయంగా ప్రదర్శన మారింది. విశాలాంధ్ర, ఎమ్మెస్కో వంటి కీలక పబ్లిషర్స్‌ వెలువరించిన పుస్తకాలను కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపించారు. ఇటీవల వెలువడిన పుస్తకాలతో పాటు తెలుగు, ఆంగ్ల వ్యాకరణ, నిఘంటువులు కనిపించాయి.

చిత్తూరు రచయితల ప్రత్యేక స్టాళ్లు…:
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ రచయితల స్టాళు ఈ సారి ఆసక్తికరం. మధురాంతకం రాజారాం, మధురాంతకం నరేంద్రలు రచించిన పుస్తకాలతో పాటు సాకం నాగరాజు ప్రపంచ కథా సాహిత్యం, శాంత భాస్కర్‌ బాల సాహిత్యం, రాచపూటి రమేష్‌ కథలు, రైతు కథలు, గోపినీ కరుణాకర్‌ రచించిన మా తిరుపతి కథలు, శ్రీనివాసరెడ్డి మౌనికథలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జిల్లా సాహితీ వేత్తలంతా దీన్ని నిర్వహించారు. జిల్లాలో పబ్లిష్‌ అయ్యే కొన్ని పుస్తకాలను తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు.

ఆకట్టుకుంటున్న చర్చ…:
పుస్తక సంబరంలో నాయినీ కృష్ణమూర్తి వేదికపై రోజువారీ ఓ అంశంపై సాగుతున్న చర్చ ఆకట్టుకుంది. ఆదివారం ‘‘నాయిని కృష్ణమూర్తి జీవితం… కృషిపై చర్చ జరిగింది. అలాగే సోమవారం కవి సమ్మేళనం, మంగళవారం ‘‘నన్ను ప్రభావితం చేసిన పుస్తకం’’ అనే అంశంపై వక్తలు ప్రసంగించారు. వారి జీవితాన్ని మార్చిన పుస్తకం… దానిలోని విశేషాలను అందరితో పంచుకున్నారు. బుధవారం స్త్రీవాద కవిత్వంపై… గురువారం మాతృభాషా మాధ్యమాలపైనా విస్తృతమైన చర్చలు జరిగాయి. శుక్రవారం ప్రముఖ సాహిత్యకారుడు త్రిపురనేని మధుసూదనరావుతో జ్ఞాపకాలు అంశంపై చర్చ నడిచింది.

శ్రావ్యంగా..స్రవంతి:
డా. స్రవంతి ఐతరాజు మనోవిశ్లేషణ సంబంధిత రచనలు మనసు తలుపు తెరిచాయి. ఆమె మంచి నృత్యకళాకారిణి. ప్రకృతి ప్రేమికురాలు కావడంతో ఆమె పలుకులలో మనస్సుకు హత్తుకునే భావాలు వెలువరింగలిగారు. సౌగంధిక జాజరలు, ది డిజైనర్ బేబీ, మనోరంజితాలు తదితర రచనలు పలువురు కొనుగోలు చేయడం కనిపించింది.

నిన్న జరిగిన కవిసమ్మేళనంలో పలు అంశాలకు సంబంధించిన కవితలను స్థాయి ఉన్న వివిధ రంగాలకు చెందిన కవులు చాలా అందంగా కవితా గానం చేశారు. సిటీ కబుల్ మేనేజర్ శ్రీ రామచంద్రా రెడ్డి ప్రసంగం ఆసాంతం ఆకట్టుకుంది

అవధానం అద్భుతం :
తెలుగు భాషలో అవధానం అద్భుతమైన ప్రక్రియ అని ప్రముఖ వైద్యనిపుణులు సుధారాణి అన్నారు. నవ్యాంధ్ర పుస్తక మహోత్సవంలో భాగంగా శనివారం ‘నాయుని కృష్ణమూర్తి సాహిత్య వేదిక’పై అవధాన పద్యరత్నాలు అన్న అంశంపై ఆముదాల మురళి అధ్యక్షతన ప్రత్యేక సాహితీ కార్యక్రమం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ సమాజ హితైషిగా పుస్తకం ఖ్యాతికెక్కిందన్నారు. అవధాని నరాల రామారెడ్డి మాట్లాడుతూ అవధాన విద్యలో విరుపులు, మెరుపులు పుట్టించాలని, ఎంత స్పీడ్‌గా చెప్పామనేది కాదని, ఎంత స్వీటుగా చెప్పామనేదే ముఖ్యమని పేర్కొన్నారు. మరో అతిథి కోట పురుషోత్తం మాట్లాడుతూ పలు పద్యాలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ‘సొంత పుస్తకమూ-తెలుగు పద్యమూనూ’, ‘సహృదయ రవిచంద్రిక’ పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమన్వయకర్త సాకం నాగరాజ, రమేష్‌, కంపెల్ల రవిచంద్ర, భూమన్‌, జయరాం ప్రసాద్‌, మల్లేశ్వర రావు, కలువగుంట రామమూర్తి, నెమిలేటి కిట్టన్న, యువశ్రీ మురళి, వాకా ప్రసాద్‌ పేర్కొన్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడీ సుందరాచారి వ్యక్తిత్వం, సాహిత్యంపైనా, తెలుగు పద్యవైభవంపైనా విడివిడిగా చర్చలు జరిగాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close