Featuredరాజకీయ వార్తలు

మంత్రులైనా మాట వినాల్సిందే….

మంత్రులంటేనే ఒక రకమైన దర్పం.. తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వశాఖను అభివృద్ది పథంలో నడిపించవచ్చు.. ప్రజలందరికి తన ప్రభుత్వం మీద, తాము అందించే పథకాల మీద మంచి అభిప్రాయం కలిగించేలా పనిచేయవచ్చు. శాసనసభ్యులుగా ఎంతమంది, ఎన్నిమార్లు గెలిచినా మంత్రులుగా అవకాశం వచ్చేది మాత్రం కొందరికే. అధికారంలోకి వచ్చిన పార్టీలో ఎంతమంది ఉన్నాకూడా పార్టీ అధినేత నిర్ణయం మేరకే మంత్రిమండలి ఏర్పాటవుతోంది. అది కొత్తగా ఎన్నికయ్యారా, అనుభవం ఉన్నవారా అనే సంబంధం లేకుండా అధినేత ఇష్టప్రకారమే మంత్రిమండలి ఏర్పాటుచేస్తారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రెండు నెలలు దాటిపోయింది. ముఖ్యమంత్రి, హోంమంత్రి మినహా ఏ ఒక్క శాఖకు కూడా మంత్రిని నియమించలేదు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే విద్య, వైద్యశాఖలో కూడా పైళ్లన్నీ గుట్టలుగా పేరుకుపోయాయి. బడ్జెట్‌ సమావేశాలు ముంచుకొస్తున్న తరుణంలో తెరాస అధినేత మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం పదిమంది మంత్రులతో కొలువుతీరింది. మంత్రిగా నియమితులైనా వారు ఆనందంతో ఉంటే, అవకాశం రాని వారు బాధతో ఉంటారనేది అది జగమెరిగిన సత్యమే.. ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడమంటే ఆ హోదాయే వేరు. మంత్రి తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎన్నో మార్పులకు సంకేతాలుగా నిలిచిపోతా యి. కాని ఈ సారి నూతనంగా నియమితులైన మంత్రులందరూ అధినాయకత్వం చెప్పినట్టే చేయాలి. వారి ఆదేశాలే పాటించాలి.. చివరకు పిఆర్వోలు కూడా అధినాయకత్వం సూచించినా వారినే నియమించుకోవాలంటూ అధిష్టానం చెప్పకనే చెప్పడంతో కొత్తగా నియమితులైన మంత్రులు ఆందోళన పడి, ఆశ్చర్యపరిచినా సరేనంటూ తలలూపడం తప్ప చేసేదేమి లేదన్నట్లు తెలుస్తోంది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాక రాక తెలంగాణకు మంత్రులచ్చారు.. ఎన్నికల్లో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత మంత్రి మండలిని ఎంపిక చేశారు.. అప్పటివరకు ప్రభుత్వ శాఖల్లోని పైళ్లన్నీ గుట్టలు, గుట్టలుగా పేరుకుపోయాయి. అత్యవసర సేవలన్నీ ఆగిపోయాయి.. ఏది ఏమైందో తెలియదు కాని చివరకు ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ బడ్జెట్‌ సమావేశాల ముందు మంత్రులను నియమించారు. కొన్ని కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకున్న సామాన్యుడికి నిత్యం అవసరమయ్యే విద్య, వైద్యంపై మాత్రం చెరొకరిని నియమించారు. అంతా బాగానే ఉంది తెలంగాణలో ప్రభుత్వం మంత్రుల నియామకంతో పాలన ఊరకలెత్తుతుందీ అనుకుంటున్న సమయంలో తెలిసి తెలియనట్టే, చెప్పి చెప్పనట్టే అందరికి అధినేత నుంచి సంకేతాలు సైతం వెళ్లాయి… మంత్రులు ఏ పని చేయాలన్నా, ఎక్కడ సంతకం పెట్టాలన్నా అన్ని అధినేతకు తెలిసి జరగాలి… చివరకి మంత్రులు నియమించుకునే పిఆర్వోలు కూడా అధినాయకత్వం సూచించిన వారినే నియమించుకోవాలని చెప్పడంతో కొత్తగా నియామకమైన మంత్రులకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని వారి సన్నిహితులు అంటున్నారు… మంత్రుల పాలనా వ్యవహారాలు చూసే పిఆర్వోలను తెలంగాణ ప్రభుత్వం ఇంకా కేటాయించనేలేదు. గత ప్రభుత్వంలో కూడా మంత్రుల విషయంలో సిఎం కెసిఆర్‌ పేషీ ఇలానే వ్యవహరించింది. ఇప్పుడు కూడా మంత్రులకు పిఆర్వోల నియామకాన్ని సైతం ముఖ్యమంత్రి పేషీ తన ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఎప్పుడు ఏం కావాలన్నా, మంత్రులు ఏం నిర్ణయం తీసుకోవాలన్నా వారికి మొత్తం తెలిసిపోతుంది. దీన్ని బట్టి మంత్రులందరూ నియామకమైనా డమ్మీలుగానే మిగిలిపోనున్నారు. తమ తమ శాఖల పరిధిలో ఏలాంటి నిర్ణయాధికారులు మంత్రులు తీసుకోవడానికి లేకుండా పోతోంది. అంతా సిఎం కెసిఆర్‌ కనుసన్నల్లోనే జరగబోతుందని అర్థమవుతోంది. కనీసం సొంతంగా పిఆర్వోలను కూడా నియమించుకోలేని దయనీయ స్థితిో తెలంగాణ మంత్రులున్నారంటే వారి పదువులు నామ్‌కే వాస్తే అన్నట్లుగా అర్దమవుతోంది. ఇప్పటికే గత మంత్రుల హయాంలో పిఎస్‌ల నియామకాన్ని సిఎంవో ఆఫీసు తమ చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు పిఆర్వోల నియామకాన్ని కూడా ప్రభుత్వం లాగేసుకొని ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. వాళ్లే ఇప్పుడు మంత్రులకు పిఆర్వోలను సరఫరా చేస్తారని సమాచారం.

ప్రభుత్వం ఆభాసుకు పీఆర్వోలే కారణం..

మంత్రులు బాగా పనిచేయాలనే ఇంచుమించుగా పీఆర్వోలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మంత్రులు చేసే ప్రతి పని వారు చెప్పాల్సిందే. గత తెరాస ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసినా చాలా మంది పీఆర్వోలు భారీ ఎత్తున సెటిల్‌మెంట్లకు దిగారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మనదేనని, మంత్రులంతా మన వారేననంటూ వారి ఇష్టానుసారంగా వ్యవహరించారనే అందుకు మంత్రులతో పాటు ప్రభుత్వం కూడా అభాసుపాలయిందనే సమాచారం అధినేతకు తెలియడంతో ఈ సారి అన్నీ తనకు తెలిసే జరగాలని చెప్పుతున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో పీఆర్వోల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే సిఎం కెసిఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పీఆర్వోల నియామకాలను అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో కార్పోరేట్‌ పాలనకు తెరతీసినట్టేనని కొంతమంది భావిస్తున్నారని తెలుస్తోంది. సిఎంవో నియమిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ పీఆర్వోలు సంబంథింత మంత్రుల మాట వింటారా లేదా అన్నది కొత్తగా నియమితులైన మంత్రులను కంగారుపెడుతోంది. మంత్రులకు తెలియకుండా కొత్తగా నియమితమవుతున్న పీఆర్వోలు కూడా అవినీతికి పాల్పడితే నియంత్రించడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీన్ని బట్టి మంత్రులకు ఏ స్వేచ్చ లేకుండా చేయడానికి కెసిఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మంత్రలు పేషీల్లో అంతా కార్పోరేట్‌ పాలననే కొనసాగేలా కెసిఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం బాగానే ఉన్నా నూతన మంత్రులకు మాత్రం నచ్చట్లేదని అర్దమైపోతుంది. తన దగ్గర పనిచేసే పీఆర్వోలనే నియంత్రించలేని స్థితిలో ఉన్న మంత్రులు సంబంధిత అధికారులను ఎలా కట్టడి చేస్తారన్న ప్రశ్న తెలంగాణ ప్రభుత్వంలో చర్చకు వస్తోంది. గతంలో పీఆర్వోలు చేసిన అవినీతి దాని వల్ల వచ్చిన చెడు పేరును చూపి మంత్రులపై నిఘా పెట్టేందుకే కెసిఆర్‌ కొత్తగా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. అధినేత కొత్తగా ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయం ఎవ్వరికి నచ్చకున్నా ఆయన ఆలోచనలకు, ఆయన మాటలకు ఎదురు చెప్పే వారు లేకపోవడంతో ఆయన మాట కొనసాగుతోంది. ఒక పక్క మంత్రుల కార్యదర్శులను అధినేతే నియమిస్తానని చెప్పడంతోనే సగం ఆశలు ఆవిరైపోయిన మంత్రులకు కనీసం పీఆర్వోలు కూడా తమ ఆధీనంలోని వారు కాకపోవడంతో ఏం చేయాలో తోచక తికమకపడుతోన్నట్లు తెలిసిపోతుంది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు, అవినీతి జరుగకుండా ఉండేందుకే కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా, అది మంత్రులకు రుచించడం లేదు. పీఆర్వోల విషయంలోనైనా కాస్త వెనుకాముందు ఆలోచించాలని అధినేతకు చెప్పే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. అధినేత ఏలా చెపుతే అలా వింటూ మంత్రులుగా కొనసాగడమే తప్ప వారు చేయాల్సిన పని ఇంకేమి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close