Featuredస్టేట్ న్యూస్

పల్లెపల్లెకు మద్యం సరఫరా..

జోరుగా బెల్ట్ షాపుల అక్రమ దందా

ఎక్సైజ్ అధికారులు నిద్రపోతున్నారు..

తనిఖీలు మరిచిన పోలీసులు

ఇంటింటికి మంచినీళ్లు అందిస్తామన్నారు. మంచినీళ్ల మాట మరిచిపోయారు. ఇప్పడు ప్రతి తండా, గూడెం, గుడిసెకు మద్యం షాపు యజమానులే ఇంటింటికి మద్యాన్ని సరఫరా చేస్తారు. మండల కేంద్రాల నుంచి గ్రామాలు ఎంత దూరంలో ఉన్నా కాని ఏలాంటి భయం, జంకు లేకుండా, బహిరంగంగా యధేచ్చగా తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులున్నా, పోలీసులు తనిఖీలు చేస్తున్న బెల్ట్ షాపులకు మద్యం సరఫరా మాత్రం అగడమే లేదు . మామూళ్ల మత్తుకు అలవాటుపడ్డ ఎక్సైజ్ శాఖ తూతూ మంత్రంగా మాత్రమే తనిఖీలు నిర్వహిస్తూ మామూళ్ల మాయలో మునిగితేలుతున్నారు. మంచినీళ్లు సైతం దొరకని గ్రామాల్లో మద్యం మాత్రం ఎక్కడపడితే అక్కడ యధేచ్చగా దొరికిపోతుంది. ఋఇష్టానుసారంగా తాగండి, తాగి ఊగండి, మద్యం మత్తులో ఊగి ఊగి ఏమైనా చెయ్యండనే ఆలోచనతోనే ఇప్పటి అధికారులు ఉన్నట్లు తెలిసిపోతుంది.. ప్రజలకు ఏమైనా ఫర్వాలేదు, ఎన్ని ఆఘాయిత్యాలు జరిగినా పర్వాలేదు కాని ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఆలోచన తప్ప మరేమి ఆలోచన లేదని తెలిసిపోతుంది.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ఆదాయం కోసం తపించే వ్యవస్థ ఇప్పుడు మన తెలంగాణలో ఉంది..

వరంగల్ ఆదాబ్ హైదరాబాద్:

తెలంగాణలోనే ములుగు జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పర్యాటక ప్రదేశాలతో పాటు, పచ్చని అడవులు ఇక్కడ సొంతమనే పేరు ఉంది. కాని అంతకన్నా ఎక్కువగా ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. మా గ్రామానికి మద్యం వద్దని ప్రజలంతా మొత్తుకుంటున్న కాని ఇబ్బందులేమి లేకుండా ప్రతి పల్లెకు, ప్రతి తండాకు మద్యం షాపుల స్వంత వాహనాలతో, స్వంత మనుషులతో గ్రామగ్రామానికి, వాడవాడకు పంపిణీ చేస్తున్నారు. ఇంత బహిరంగంగా మద్యం పంపిణీ చేస్తున్న పర్యవేక్షిస్తున్న అధికారులు మాత్రం తమకేమి సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. బంగారు తెలంగాణలో ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రతి కుటుంబం మద్యానికి బానిసై తన జీవితం, తన కుటుంబం నాశనం అవుతున్నదని తెలిసినా అధికారయంత్రాంగం తమకేమి పట్టనట్లుగానే వ్యవహరిస్తోంది..

బెల్టు షాపు లేని గ్రామం లేదు..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో బెల్టుషాపు లేని గ్రామమే లేదు. తాగునీటిని, కనీస వసతులను కల్పించలేని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తుంది. తమకు నచ్చినట్టుగా పంపిణీ చేస్తూ సంబంధింత ఎక్సైజ్ అధికారులకు, పోలీస్ అధికారులకు నెలల వారీగా మామూళ్లు ఇస్తున్నారనే ఆరోఫణలు ఉన్నాయి. అందుకే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎంత మద్యం పట్టపగలు తరలించినా ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఒకవేళ ఎవ్వరన్నా సంబందింత అధికారులకో, పోలీసు అధికారులకో ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలివేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి..

ఎక్సైజ్, పోలీస్ శాఖ నిద్ర పోతుందా..

ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రం నుంచి చుట్టుప్రక్కల ఉన్న 23 గ్రామపంచాయితీలలో ఇంచుమించుగా రెండు వందలకు పైగా బెల్ట్ షాపులలో ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో దొరుకుతోంది. ప్రతి తండా, గూడెం మద్యం మత్తులో జోగుతున్నాయి. ఎంతో మంది ఆనారోగ్యం పాలవుతున్నా అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఒక్క మండలంలో ని ఇన్ని గ్రామాల్లో ఇంతగా మద్యం జోరుగా సాగుతుంటే రాష్ట్రం మొత్తం ఇంకెంత మద్యం ఏరులై పారుతుందో అర్థమైపోతుంది. ప్రభుత్వం మద్యం నియంత్రణపై స్పందించినా దాఖలాలే లేవు. ఆనధికారికంగా సంబంధింత ఎక్సైజ్ అధికారులు ఎంత తాగిస్తే అంత ఇంక్రిమెంట్ల్, ప్రమోషన్స్ ఇస్తున్నారనే తెలుస్తోంది. అధికారులను ప్రభుత్వ యంత్రాంగమే ప్రోత్సాహిస్తుంటే గ్రామాల్లో మద్యం నిర్మూలనా ఇంకెలా సాధ్యమవుతోంది. అధికారులే అమ్మకాలు పెంచాలి, ఆదాయాన్ని పెంచాలనే రీతిలో వ్యవహరిస్తున్నారు కాని అందులో అసలెంతో, నకిలీ ఎంతో మాత్రం పసిగట్టినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

బెల్టు షాపులలో అధిక ధరకే మద్యం.

ప్రతి బెల్టు షాపులో మద్యం అధిక ధరలకే విక్రయిస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ప్రతి రోజు తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్, పోలీస్ శాఖ నిద్ర మత్తులో ఉంటున్నారు. మద్యం షాపులో వంద రూపాయలకు అమ్మాల్సిన బీరు, బెల్ట్ షాపులలో నూట ఇరవై, నూట ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు. బహిరంగంగా ప్రతి సీసాపై అధిక ధర వసూలు చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు తెలిసినా కూడీ ఇప్పటివరకు కేసులు నమోదు చేసినా దాఖలాలు లేవు. మద్యం ప్రియులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా తనిఖీలు చేసి కేసు నమోదు చేయాల్సిన అధికారులు సంబంధింత మద్యం షాపుల దృష్టికి తీసుకెళ్లి జాగ్రత్త పడమని ముందే చెపుతున్నట్లు సమాచారం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close