అంకెలకు ఓట్లకు లింకేది…

0

అరగంటలోనే పదిశాతం పోలింగ్‌..

అనుమానం వ్యక్తం చేస్తున్న పార్టీలు…

వివరాల సేకరణలో అభ్యర్థులు…

పోలింగ్‌ సమయం ముగుస్తుంది. పొద్దు వంగుతోంది.. ఐనా పోలింగ్‌ మాత్రం ఆగడమే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముప్పై, నలభై శాతం ఓట్లు నమోదైతే చివరి అరగంటలోనే ఓటర్లు లేకున్నా లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయని అధికారులు చెపుతున్నారు.. ఓటు మన బాధ్యత, అందరూ ఓటేయ్యాలని ప్రచారం చేసిన ప్రభుత్వ శాఖ లేదు. ఓటు వినియోగించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పినా అధికారి లేడు. గెలవాలి, అధికారంలోకి రావాలి అని ఎవరికి వారు పార్టీలపరంగా ప్రచారం చేసుకున్నవారే కాని ప్రజలను ఓట్లపై అవగాహాన కల్పించేవారు ఒక్కరంటే ఒక్కరూ కూడా లేదు. కాని చివరి సమయంలో ఓట్లు ఏలా పోలవుతున్నాయో మాత్రం ఎవ్వరికి అర్థమే కావడం లేదు. తెలంగాణ పార్లమెంట్‌ స్ధానాల్లో చాలా ప్రాంతాల్లో కనీస పోలింగ్‌శాతం నమోదు కాలేదు. చాలా జిల్లాలో, గ్రామాల్లో అసలు ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అనే అనుమానం వచ్చింది. పొద్దస్తమానం తిప్పి తిప్పి కొడుతే ముప్పై, నలభైశాతం పోలింగ్‌ నమోదు కానిది చివరి గంటలోనే పోలింగ్‌ శాతం పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయం నుంచి రాని ఓటర్లు, ఊర్లో లేని ఓటర్లు సాయంత్రం ఏలా ఓటేశారనేదే ఇప్పుడు అందరిని తొలుస్తున్న అది పెద్ద అనుమానం…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ఒకప్పుడు అంతా బ్యాలెట్‌ పేపరే.. వార్డు సభ్యుడు నుంచి పార్లమెంట్‌ వరకు అన్ని ఎన్నికలు బ్యాలెట్‌ పేపర్‌ మీదనే జరిగాయి. ఎక్కడో ఒకచోట రిగ్గింగ్‌ జరిగినా అంతగా ప్రభావం చూపకపోయేది. ప్రతి ఓటర్‌ను నిశీతంగా పరిశీలించి ఓటుకు అనుమతినిచ్చేవారు. కాని ఇప్పుడంతా డిజిటల్‌ యుగంగా మారిపోయింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్లను గంటల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించటం, అన్ని పోలింగ్‌ను కలిపి ఎప్పుటికప్పుడు సమాచారాన్ని అందించడం వంటివి స్పీడుగా సాగిపోతున్నాయి. ఈ పని ఎప్పటినుంచో వస్తున్నదే కాని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్‌ కాగానే వెంటనే చెప్పే పోలింగ్‌ లెక్కలకు, రోజు తర్వాత సవరించిన లెక్కల్ని విడుదల చేసే అంకెలకు ఏ మాత్రం సంబంధం లేకపోవడం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. అసలు ఉదయం నుంచి ఎంతమంది ఓటు వేస్తున్నారనేది గంట గంటకు తెలుస్తూనే ఉంటుంది. మూడు శాతం, నాలుగుశాతం, ఐదు శాతమో గంటగంటకు పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందీ కాని పోలింగ్‌ ముగిసే సమయంలో ఒకేసారి వేలకు వేలు ఓట్లు పడడమే అందరికి అనుమానాలను కలిగిస్తోంది. సాయంత్రం చూస్తే పోలింగ్‌ బూత్‌లన్నీ ఖాళీగానే కనబడుతున్నాయి. మొత్తం పోలింగే యాభైశాతం దాటడం లేదు. అలాంటిది చివరిదశలో అంత పోలింగ్‌ ఏలా నమోదవుతోందంటే అందుకు సమాధానాలే ఉండడం లేదు. పోలింగ్‌ రోజు జరిగే లెక్కలకు తెల్లారి ఎన్నికల అధికారలు చెప్పే విషయాలను పొంతనే ఉండడం లేదు. తెలంగాణలో నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పక్కనపెడుతే మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తోందని బరిలో ఉన్న అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోని కొన్ని నియోజకవర్గాల లెక్కలు చూస్తే మాత్రం పోటీ చేసే అభ్యర్థులకేమో కాని ఓటర్లకు కూడా దిమ్మతిరిగిపోతుందీ. హైదరాబాద్‌ నగర పరిధిలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో పోలింగ్‌ ఐనా ఓట్లను లెక్కల్లోకి తీసుకుంటే మతిపోతుంది.. గురువారం ఎన్నికలు ముగిసిన వెంటనే ముప్పై శాతం ఓట్లు పోలైనట్లుగా ఎన్నికల కమిషన్‌ లెక్కలు చెబుతూ ఒక నివేదికను విడుదల చేసింది. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు నలభైఆరు శాతం నమోదైందని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యేలా కనిపిస్తోంది. గురువారం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకే ముప్పైఐదుశాతం నమోదైందని ఐదు గంటలకే పోలింగ్‌ స్టేషన్ల గేట్లు మూసేసినట్లుగా అధికారులు చెప్పాలి. ఈ కాస్త సమయంలోనే ఏడు శాతం పోలింగ్‌ జరగడం సాధ్యమా అన్నది ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రధాన ప్రశ్న.. అదే సమయంలో హైదరాబాద్‌లోని మూడు ఎంపీ స్థానాలకు జరిగిన పోలింగ్‌స్టేషన్లు ఒక్క ఓటరు కూడా లేకుండా ఖాళీగాదర్శనం ఇచ్చాయి. జనాలు లేని సమయంలోనే ఆరుశాతం ఓట్లు నమోదు కావడం ఏమిటన్న సందేహాలు ఇప్పుడు అందరిలో ఉన్నాయి.

అరగంట వ్యవధిలోనే పదకొండు శాతమా..

రోజంతా చూస్తే జరిగిన పోలింగ్‌ ముప్పై, ముప్పైఐదు శాతం ఐతే చివరి అరగంటలోనే పది, పదిహేను శాతం ఏలా జరగుతుంది. అదీ కూడా ఓటర్లు లేకుండా ఓట్లు ఎవరెసి ఉంటారో మాత్రం తెలియడం లేదు. దీనిపై బరిలో ఉన్న పలు రాజకీయపార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ బిజెపి అభ్యర్థి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పోలింగ్‌ పెరుగుదలపై తమకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. దాని లెక్క తెల్చేందుకు బూత్‌ల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ అనుమానాలు ఒక్క సికింద్రాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితే ఉందని తెలుస్తోంది. నల్గండ ఎంపీ స్థానం పరిధిలో 15.85 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గురువారం సాయంత్రం వరకు ఎన్నికల అధికారులు 66.11శాతం అని చెప్పి చివరికి 74.11శాతం ఓట్లు పోలైనట్లు చెప్పడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంటే గురువారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏకంగా ఎనిమిదిశాతం ఓట్లు ఏలా పెరిగాయన్నదీ ఇప్పుడు అందరిని ఆలోచింపచేస్తుంది. చివరిలో 1.26లక్షల ఓట్లు పడటం సాధ్యమేనా అంటే ఎవరి దగ్గర సమాధానం దొరకడం లేదు. మహబూబ్‌నగర్‌ ఎంపీస్థానంలో 14.23 లక్షల ఓట్లు ఉన్నాయి. గురువారం సాయంత్రం వరకూ 59.90 శాతం పోలింగ్‌ జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. కాని ఫైనల్‌గా మాత్రం 68.79శాతం పోలింగ్‌ నమోదైనట్లుగా ప్రకటించారు. చివర్లో 8.89శాతం పోలింగ్‌ పెరగడం, చివర్లో 1.26లక్షల ఓట్లు పడడం ఏంటో బరిలో ఉన్న అభ్యర్థులకు ఎవ్వరికి అర్థం కావడం లేదు. చివరిలో ఇంత భారీగా పోలింగ్‌ నమోదవడం ఏలా సాధ్యమో తెలియాలని అభ్యర్థులు అంటున్నారు. అంత ఎక్కువగా ఓటర్లు వస్తే పోలింగ్‌ కేంద్రాలన్నీ ఓటర్లతో కిటకిటలాడాలి కాని అలాంటిదేమీ జరగకుండా ఫైనల్‌ లెక్కలు ఇంతలా మారిపోవటం వెనుక మర్మం తెలియాలంటున్నారు బరిలో నిలిచిన అభ్యర్థులు..

అనుకోకుండా పెరుగుతున్న పోలింగ్‌..

ఏ ఎన్నికల్లో పోలింగ్‌ రద్దీ ఎక్కువగా ఉండేది ఉదయం పూటనే. పనికి వెళ్లేవారు, వృద్దులు, మధ్యతరగతి వారందరూ వేకువజామునే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూకడుతారు. ఓటేసి వస్తే తమ పని తాము చూసుకోవచ్చని అందరూ పోలింగ్‌ దారి పట్టడంతో పోలింగ్‌ కేంద్రాలన్నీ కిటకిటలాడుతాయి. ఉన్నవారు, లేనివారు అంతా మధ్యాహ్నం లేదా నాలుగు గంటల వరకు ఓటు వేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారో, ప్రచారం చేసిన నాయకులే చివరకు వేస్తారు కాని పోలింగ్‌ ముగిసే సమయంలోనే ఓటర్లంతా బారులు తీరి ఓట్లు వేస్తున్నారంటే ఇది నమ్మశక్యంగా కనిపించడం లేదని పలువురు పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. చివరి అరగంటలో ఎంత పెరిగినా వెయ్యి లేదా పదివేల లోపు పెరుగుతాయి కాని లక్షల ఓట్లు పడడంపై అక్కడ ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఓటు వేసిందీ ఎంతమంది, అక్కడ ఎన్ని పేర్లు నమోదయ్యాయి, అసలు ఏలా అంత శాతం పెరిగిందని బూత్‌లవారీగా వివరాలను సేకరించే పనిలో బరిలో ఉన్న ప్రతిపక్షనాయకులంతా బిజీబిజీగా మారిపోయారు. చివరగా జరిగినా పోలింగే గెలుపోటములను నిర్ణయిస్తుందని అంత శాతం పోలింగ్‌పై పలు అనుమానాలు ఉన్నాయని దానిపై తాడోపేడో తెల్చుకునేందుకు అందరూ ఎవరికి తోచిన విధంగా వారు కసరత్తులు ప్రారంభించారు. చివరికి ఓటింగ్‌ శాతంపై ఏలాంటి నిజాలు బయటపడుతాయో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here