Featuredజాతీయ వార్తలు

ఎక్కువ సీట్లు సాధించేలా నాయకుల కసరత్తు

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): లోక్‌సభ ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ ప్రస్తుత ప్రధాని మోడీకి గడ్డుకాలం తప్పదని సర్వేలు చెబుతున్న వేళ, కేంద్రంలో కీలక భూమిక పోషించాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ పట్టుదలగా ఉన్నారు. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంలో కేంద్రంలో అధికారం ఉండాలని భావిస్తున్నారు. రాష్ట్రాలపై వివక్ష పోయి సరికొత్త రాజకీయాలు సాధించాలన్న ప్రబల లక్ష్యంతో సాగు తున్నారు. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో 16 గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. అంతేగాకుండా ఎపిలో కూడా జగన్‌ లేదా పవన్‌ కళ్యాణ్‌ ద్వారా అక్కడా రాజకీయాలు నెరపడం ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక ఎంపి స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. అలాగే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపిఎ కూటమి ద్వారా పట్టు సాధించాలని చూస్తున్నారు. మోడీపై వ్యతిరేకతతో ఉన్న చంద్రబాబు నాయుడు అందుకు తగ్గట్లుగా రాజకీయాలు నెరపుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నేతలను కలుస్తూ కూటమి బలోపేతం చేస్తున్నారు. రాష్ట్రంలో తన ప్రత్యర్థులు నలువైపుల నుంచి చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉన్నందున.. సంక్షేమ అస్త్రాలకు చంద్రబాబు పదును పెడుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలలో కూడా ఇవ్వాళ సంక్షేమమే ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. రైతులకు రుణమాఫీ వంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రధాని మోదీ కూడా ఇప్పుడు రైతులకు ఏదో ఒక పథకం ప్రవేశపెట్టడానికి యోచన చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖండ విజయం సాధించడానికి ఆయన అమలుచేసిన సంక్షేమ పథకాలను ఇప్పుడు అంతా కాపీ కొట్టడానికి సిద్దంగా ఉన్నారు. భారీ ఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించినప్పటికీ.. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు కృతజ్ఞతగా కేసీఆర్‌ను మళ్లీ అందలం ఎక్కించారు. ఇవన్నీ గమనించిన చంద్రబాబు సైతం ఇప్పుడు పింఛన్‌ మొత్తాన్ని రెండు వేల రూపాయలకు పెంచారు. డ్వాక్రా మహిళలకు నగదు సహాయంతో పాటు సెల్‌ఫోన్లు కూడా ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ తరహాలో రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్‌ రాజకీయాంగా బాగా అధ్యయనం చేయడంలో దిట్ట. ప్రజల మనోగతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందుకు సాగుతారు. తెలంగాణ సమాజాన్నే కాదు ఏపీ ప్రజల మనోగతాన్ని కూడా ఆయన అధ్యయనం చేశారు. బలాలు, బలహీనతల గురించి ఆయనకు బాగా తెలుసు. ఈ కారణంగానే ఏపీ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి కూడా ఆయన సిద్ధపడుతున్నారు. జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా ఏపీ రాజకీయాలలో కేసీఆర్‌ కలుగజేసుకోవడం ద్వారా అత్యధిక ఎంపి సీట్లు సాధిస్తే పట్టు బిగించవచ్చన్నది కెసిఆర్‌ తాజారాజకీయ వ్యూహంగా ఉంది. ఏపీలో కులాల ప్రభావం ఎక్కువ కనుక కేసీఆర్‌ అందుకు అనుగుణంగా కార్యాచరణ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ అండగా ఉంటూ వస్తున్న బీసీలను వశం చేసుకోవడానికి చూస్తున్నారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రానున్న ఎన్నికలలో బిసిలను నమ్ముకున్నారు. ప్రస్తుతానికి పవన్‌ కల్యాణ్‌ ఒంటరి పోరుకే సిద్దడుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి రాష్ట్రంలో పొత్తుల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చునని వివరించినట్టు, దానికి అనుగుణంగానే పిసిసి కూడా ఎపిలో ఒంటరి పోరుకు కాంగ్రెస్‌ సిద్దంగా ఉందని ప్రకటించింది. రాహుల్‌గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు సొంతంగానే ఎన్నికలకు వెళ్లవలసిందిగా ఆదేశించారని పిసిసి చీఫ్‌ రఘువీరా కూడా ప్రకటించారు. కేంద్రంలో తాను అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తానని రాహుల్‌గాంధీ ప్రకటించిన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ కొంచెం పుంజుకున్నట్టు కనిపించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీని బలపరచడానికి మాత్రం సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొత్తగా పుట్టుకుని వచ్చిన జనసేన కమ్యూనిస్టులతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ ఎన్నికలలో ఏ మేరకు ప్రభావం చూపుతారో తెలియదు. చతుర్ముఖ పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన అన్ని పార్టీల నాయకులలో నెలకొన్నది. ఇకపోతే జగన్మోహన్‌రెడ్డికి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా చెప్పాలి. అందుకే వివిధ వర్గాలను కూడగట్టుకునే ప్రయత్నంలో కెసిఆర్‌ అండదొరకడంతో కొంత ధీమాగా ఉన్నారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి విజయం కేసీఆర్‌కు కూడా అంతే ముఖ్యం. రాజకీయ వ్యూహరచనలో దిట్టగా పేరున్న కేసీఆర్‌.. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు వ్యూహాలకు విరుగుడుగా చేపట్టవలసిన ప్రతివ్యూహాల గురించి ఆలోచనచేస్తున్నారు. తన వ్యూహాలు తెలిసిని కేసీఆర్‌, ప్రత్యర్థి జగన్‌కు అండగా నిలవడంతో వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం చంద్రబాబునాయుడు తంటాలు పడకతప్పదు. అందుకే వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున ఆకట్టుకునే ప్రయత్నం చేపట్టారు. అలాగే బిసిలు దూరం కాకుండా వ్యూహాలు రచిస్తున్నారు. తన వ్యూహాలను, ప్రణాళికలను అమలుచేయడానికి లోకేశ్‌తో పాటు మంత్రులను ఇప్పటి నుంచే రంగంలోకి దింపారు. ఎన్నికలు సవిూపించేసరికి ఇప్పుడు చంద్రబాబునాయుడు పార్టీ వ్యవహారాలపై కొంత కాలంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి ఇప్పుడు ఎపిపై పెట్టడంతో అందుకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోకుంటే బాబు నిలదొక్కుకోవడం కష్టం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close