గ్లోబరీనాతో లాలూచీ

0

  • ప్రభుత్వం దిగొచ్చేవరకు ఉద్యమం రౌండ్‌టేబుల్‌
  • సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌
  • ఆత్మహత్యలకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి
  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. అస్తవ్యస్తం అవుతున్నవ్యవస్థలు అనే అంశంపై నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం, అలసత్వంపై మలి దశ ఉద్యమాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకెళతామని అన్నారు. భాజపా నేతలు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆత్మహత్యలకు పాల్పడిన 26 మంది ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలను మంగళ, బుధవారాల్లో కలువనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెల్లడించారు. ఈ నెల 9, 10తేదీల్లో ఈ విషయమై కేంద్ర ¬ంశాఖ, రాష్ట్రపతి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 11, 12 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. ఇంటర్‌ విద్యార్థుల తల్లిదండ్రులతో 15, 16 తేదీల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు లక్ష్మణ్‌ వివరించారు. ఇంటర్‌ బోర్డు వ్యవహారంలో భాజపా శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నిర్బంధాలతో నీరుగార్చే కుట్రలు చేసిందని విమర్శించారు. బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకుండా లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరు బాధాకరమని, గందరగోళానికి కారణమైన అధికారులతోనే సమాధానం చెప్పించడం దారుణమని దుయ్యబట్టారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శిపై, గ్లోబరీనాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఉద్యమం ఉధృతం చేస్తామని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కలుస్తామన్నారు. రాష్ట్రపతి, ¬ంమంత్రి, ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యాశాఖ నిర్లక్ష్యంతో 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా మంత్రి జగదీశ్వర్‌ ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే ఉద్యమాలు అణిచివేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో 19రోజుల నుంచి మారణకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 26మంది విద్యార్థులు చనిపోయారని చెప్పుకొచ్చారు. గ్లోబరీనా సంస్థ విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసిందని దత్తన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై మేం రాష్ట్రపతిని కలుస్తామన్నారు. ఇంటర్మీడియట్‌ అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి తను నిర్వహిస్తున్న రైల్వే శాఖలో ఒక యాక్సిడెంట్‌ అయిందని స్వతహాగా రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరి.. 26 మంది విద్యార్థులు చనిపోయినా జగదీశ్వర్‌ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు..? అని దత్తన ప్రశ్నించారు. తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. సీఎంను చౌకిదార్‌ కాదు జిమ్మేదర్‌ అన్నాడని.. అయితే ఇంటర్మీడియట్‌ అవకతవకలకు ఎవరు జిమ్మేదారో చెప్పాలని దత్తాత్రేయ ప్రశ్నించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమాలను అణచివేయడం అప్రజాస్వామికమన్నారు. గ్లోబరీనా సంస్థ విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేసిందని, ఇంటర్‌ అవకతవకలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here