లబ్‌ డబ్‌.. లబ్‌ డబ్‌…

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన లోక్‌ సభ ఎన్నికల ఫలితాలకోసం బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు, ఓటేసిన ప్రజానీకం సైతం ఎదురుచూస్తూ ఉన్నారు.. మరో కొన్ని గంటల్లో కొందరి భవిష్యత్తు వెలిగిపోనుందీ, మరికొందరి భవిష్యత్తు మళ్లీ ఐదు సంవత్సరాలు అంధకారంగా మారనుందీ.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బంధీ ఏర్పాట్లు రాష్ట్రాల వారీగా చేసింది. తెలంగాణాలోని 17లోకసభ స్ధానాల ఫలితాలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ కూడా పూర్తిచేశారు. మూడంచెల భద్రతతో పాటు ఈవీఎంల సమస్య ఎదురైతే ఎదుర్కోవడానికి ముందుస్తు చర్యలు కూడా సిద్దం చేసిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల లెక్కింపు సందర్బంగా అనుసరించాల్సిన విధి, విధానాలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాలవారీగా కింది స్థాయి అధికారులకు స్పష్టంగా తెలియచేశారు. కౌంటింగ్‌ సందర్భంగా పలు సూచనలను అధికారులకు ఇవ్వడంతో పాటు కౌంటింగ్‌ కేంద్రాల్లో మాక్‌ కౌంటింగ్‌ చేపట్టారు. ఈనెల 23వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చట్టపరమైన అంశాలను, కౌంటింగ్‌కు ముందు, తర్వాత దశల వారిగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించినట్లు సమాచారం. మే 23వ తేదీన ఉదయం 5గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలను తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు ఖచ్చితంగా ఉండేలా చూడాలని, కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గ దర్శకాలను తప్పనిసరిగా పాటించి, ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా చూడాలని ఎన్నికల సంఘం కింది స్ధాయి అధికారులను ఆదేశించింది. పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీసు ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభించి 30 నిమిషాల్లో పూర్తి చేస్తారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి తొలి రెండు రౌండ్లు దశల వారిగా ఎలా లెక్కించాలన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు.

తెలంగాణలోనూ ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలోనూ లోక్‌సభ ఫలితాల లెక్కింపుపై అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అధికారులకు సలహాలు, సూచనలతో పాటు అనుసరించినా విధానాలపై కూడా పూర్తిగా సిద్దమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్ధానాల ఓట్ల లెక్కింపు కోసం 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్‌ సెంటర్లో నియోజకవర్గం వారిగా 14 టేబుళ్లను ఓట్ల లెక్కించేందుకు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేసిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో 18 చొప్పున రెండు చోట్ల ఏర్పాటు చేయడంతో ఆ స్థానంలో 36 టేబుళ్లు ఏర్పాటు కానున్నాయి. అదే విధంగా పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉన్న మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఎల్‌.బి.నగర్‌, మేడ్చల్‌ నియోజకవర్గాలకు 24 టేబుళ్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా సువిధ యాప్‌ను వినియోగించే విధానాన్ని సాంకేతిక నిపుణులు అధికారులకు వివరించారు. సువిధ పోర్టల్‌లో లెక్కింపు వివరాలను నమోదు చేసిన తర్వాతే ఆ రౌండ్‌ ఫలితాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ప్రతి రౌండ్‌లో టెన్షన్‌.. టెన్షనే…

దేశంలో పదిహేడవ లోక్‌సభ ఆదివారంతో ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అందరి దృష్టి అంతా కౌంటింగ్‌పైనే ఉంది. ఇక అభ్యర్థుల్లోనే కాదు పార్టీలో కూడా టెన్షన్‌ మొదలయింది.. ఎవరూ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తారో, మరెవరు వెనుకబడి పోతారో తెలియనుంది. అగ్నిగోళంలా మండుతున్న ఎండలకు రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుతో దేశ వాతావరణం మరింత వేడేక్కనుందీ.. అన్ని పార్టీలు గెలుపోటములపై ప్రత్యేక దృష్టి సారించి విరామం లేకుండా ప్రతి రాష్ట్రంలో విస్తృత పర్యటనలు జరిపారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి దేశానికి చేసిందీ మాత్రం ఏమీ లేదనీ, ప్రజలు బిజెపీని సాగనంపేదుకే సిద్దంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రారంభం నుంచి ఆరోపించాయి. ప్రతిపక్షాలకు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మళ్లీ ఢిల్లీ గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమంటుందీ బిజెపీ. విజయంపై రెండూ పార్టీలు ధీమా ప్రదర్శిస్తున్నా గెలుపు మాత్రం ఎవరిని వరిస్తుందో తెలియడానికి సమయం దగ్గరపడుతోంది. మే 23 తేదీ ప్రతి నాయకుడికి, పార్టీలకే కాకుండా దేశ ప్రజానీకానికి సైతం మరిచిపోలేని రోజుగా మారిపోనుందీ. బరిలో ఉన్న కొంతమంది అభ్యర్థులను విజేతలుగానే, మరికొంతమంది అభ్యర్థులను పరాజీతులుగానే మార్చేయపోతుందీ.. విజేత, పరాజీత ఎవరో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు ప్రాణాలు బిగపట్టుకొని ఎదురుచూడక తప్పదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here