Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

రామన్న కనుసన్నల్లో.. రజాకార్ల రాజ్యం

సిరిసిల్లలో 800 మంది నేతన్నల చావుకు కారణం ఎవరు …?

– ఆత్మహత్యలే శరణమంటున్న తెరాస పాలన

– బెదిరింపులు, గూండాయిజం లేకుంటే కేసులు

– ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే ఆత్మహత్యలు

పెరుగుతాయంటున్న అధికారులు

– సిరిసిల్లలో అరాచకాలకు మంత్రి కేటీఆరే

కారణమంటున్న చేనేత సంఘాలు

– సిరిసిల్ల నేతన్నల ఆలోచన ఎటువైపు ?

అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అయినప్పుడు….

మానాన్ని కాపాడే నేతన్న దేవుడితో సమానమే కదా…

అలాంటి దేవుళ్ళ పట్ల కాస్తయినా దయ చూపించండి..

సిరిసిల్లలో అరాచకం రాజ్యమేలుతోంది. ప్రశ్నించేవారి గొంతు నొక్కడం సర్వసాధారణంగా మారింది. నేతన్నల పేరుతో కోట్లాది రూపాయలు దిగమింగుతున్న తెరాస నాయకులకు మంత్రి, స్థానిక శాసన సభ్యుడు కె.టి రామారావుతో పాటు కలెక్టర్‌,పోలీసు,రెవెన్యూ యంత్రాంగం అండదండలు నిండుగా ఉన్నాయి. బతుకమ్మ చీరలు నేయాల్సిందే అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో సంవత్సరం పొడవునా సాగే నైలాన్‌,కాటన్‌,పాలిస్టర్‌ బట్టల ఆర్డర్‌లు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. బతుకమ్మ చీరలతో మూడు నెలల పని పోగా మిగిలిన తొమ్మిది నెలలు ఖాళీ కడుపులతో, అప్పుల బాధతో సతమతమవుతుంటే ఆత్మహత్యల వైపు దారి చూపడం మంత్రి కేటీఆర్‌ అపరిపక్వతకు నిదర్శనంగా సిరిసిల్ల ప్రజలు భావిస్తున్నారు.సిరిసిల్లలో 80 శాతం నేతన్నల కుటుంబాలలో వెలుగులు నింపేందుకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన టెక్స్‌టైల్‌ పార్కుకు కనీస అవసరాలు కల్పించడంలో మంత్రి కేటీఆర్‌ విఫలమయ్యారు.నేతన్నల ఆత్మహత్యలకు కారణమైన బతుకమ్మ చీరలతో కోట్లకు పడగెత్తిన టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసుల అండతో అక్రమ కేసులు బనాయించి మ్యాక్‌ సంఘాలన్నింటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోడం దారుణం. ఐనప్పటకీ ఎన్నికల వేళ గీసుకొండ రాంప్రసాద్‌ ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ బూటకమేనని అమలుకు నోచుకోవడం లేదన్న నిజం రాంప్రసాద్‌ బలవన్మరణంతో తేటతెల్లమైందని సిరిసిల్ల నేతన్నలు పెదవి విరుస్తుండటం విశేషం. నేరెళ్ల సంఘటన ఒక గ్రామాన్ని చిదిమేస్తే సిరిసిల్లలో జరుగుతున్న అవినీతి ఉగ్రవాదం నేతన్న ప్రాణాలని హరించివేయడం బాధాకర పరిణామం. ఈ పరిస్థితుల్లో కేటీఆర్‌ ఇలాకాలో 80శాతం ఓటర్లుగా ఉన్న నేతన్నలు సంఘటితంగా నిలిచి మనలో ఒకడిగా ఉంటూ మన సమస్యలన్నీ అర్థం చేసుకునే నాయకుడిని గెలిపించుకోవడంతోనే నేతన్నల జీవితాల్లో వెలుగు నిండే అవకాశం ఉంటుందని మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులు విడుదల చేయగా అందులో కేవలం 165కోట్లతోనే సరిపెట్టడం నిజంకాదా ? ఇందులో 135కోట్లు ఎవరి జేబుల్లోకి చేరాయో బహిరంగ రహస్యమే కదా…! ఆత్మ హత్యలు చేసుకున్న నేతన్నలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చేది లేదంటున్న అధికారులు. ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే మరిన్ని ఆత్మహత్యలు పెరుగుతాయని వితండవాదం చేస్తున్న వారు ప్రభుత్వ విధానాలన్నీ తుంగలో తొక్కుతున్నా మంత్రి కేటీఆర్‌ నోరు మెదపడం లేదు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం… ఆత్మహత్యలు లేని తెలంగాణని సృష్టిద్దాం. అంటూ ఊక దంపుడు ప్రచారం చేసిన తెరాస ప్రభుత్వం రజాకార్లను మరిపించే విధంగా సిరిసిల్లలో పాలన కొనసాగుతుందని నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో నిరసిస్తున్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నల కడుపు నింపుతాం, ఏడాదంతా ఉపాధి కల్పిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హమీలన్నీ ముఖ్యమంత్రి తనయుడు జౌళి శాఖా మంత్రి అయిన స్థానిక శాసన సభ్యుడు కేటీఆర్‌ తుంగలో తొక్కి నేతన్నల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాడని నియోజకవర్గంలో నిండుగా ఆందోళన వ్యక్తమవ్వడం విశేషం. వలసలను నిరోదించే విధంగా తమ పాలన కొనసాగుతుందని వలస వెళ్లిన వారు తిరిగి స్వంత గ్రామాలకు చేరుకునే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఈప్రాంతంలో గాలి మాటలుగానే మిగలడం దురదృష్టకరంగా ప్రజలు భావిస్తున్నారు. బతుకమ్మ చీరలని నేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దల హెచ్చరికలతో తమకు యేడాదంతా దొరకుతున్న పనిని కాదనుకుని నైలాన్‌,కాటన్‌, పాలిస్టర్‌ బట్టల ఆర్డర్‌లన్నీ వదులుకున్నామని సిరిసిల్లకు చెందిన నేతన్నలు ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘ ప్రతినిధికి తెలిపారు. యేడాదంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తమకు అనేక ఆర్డర్‌లు వచ్చేవని కానీ బతుకమ్మ చీరల కారణంగా ఆ ఆర్డర్‌లన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో 9నెలలు తాము కాలేకడుపులతో కాలం వెల్లబుచ్చుతున్నామని ఆందోళన వ్యక్తపరిచారు. బతుకమ్మ చీరలు తమ పాలిట గుదిబండల్లా మారాయని దీనికి తోడు తెరాస నాయకులు తమ సంఘాలన్నింటినీ వారి ఆధీనంలోకి తీసుకుని నేతన్నల జీవితాలని బజారుపాలు చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. అదేమని ప్రశ్నించిన ప్రతీ ఒక్కరిని బెదిరించి దారికి తెచ్చుకోవడం అప్పటికీ వినని వారిపై పోలీసు కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పడం సర్వ సాధారణంగా మారిందని వారు వాపోయారు. బతుకమ్మ చీరల కోసం మూడు నెలలు కష్టపడదామనుకున్నా లంచాలు ఇవ్వకుండా ఆర్డర్‌లు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఈవ్యవహారంపై చేనేత జౌళిశాఖ కమీషనర్‌ శైలజా రామన్‌ కలిసి వివరించినా తమ బతుకుల్లో మార్పు రాలేదని వారు విలపించారు. టీఆర్‌ఎస్‌ నాయకుల కబంద హస్తాల్లో చిక్కుకున్న నేతన్నల కష్టాలన్నీ స్థానిక శాసన సభ్యుడు జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్దామని చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదని వారు చెప్పారు. స్థానిక టీఆర్‌ఎస్‌ నేతల అరాచకాలని అడ్డుకోవాల్సిన మంత్రి వారిని ప్రోత్సహించడంతో అడ్డూఅదుపూ లేకుండా పోయిందని కనీసం మంత్రిని కలిసే అదృష్టం దొరకకపోవడం తాము చేసుకున్న పాపమేనని వారు అభివర్ణించారు. రజాకార్లని మించి రాజ్యమేలుతున్న రామన్న పరిపాలనలో రాక్షస కార్యక్రమాలు అదికమయ్యాయని తమ బ్రతుకుల్లో నిప్పులు పోస్తున్న నేతలని,అధికారులని అడ్డుకునే వారే కరువయ్యారని వారు విలపించారు. సిరిసిల్లలో 118 మ్యాక్‌ సంఘాలుండగా అందులో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ నాయకులవే నని కన్ను పడిందంటే ఇక ఆసంఘాలన్నీ వారికి ఇవ్వాల్సిందేనని లేని పక్షంలో బెదిరింపులు, కేసులు బహుమనంగా తెరాస ప్రభుత్వం తమకు అందజేస్తుందని వారు పేర్కొన్నారు. ఒక్కో టీఆర్‌ఎస్‌ నాయకుడికి పది నుండి 18 సంఘాల వరకు ఉన్నాయని వీటితో వారు కోట్లకు పడగలెత్తుతున్నారని వారు చెప్పారు.చేనేతపై తాను ఇతర రాష్ట్రాలకు స్టడీ టూర్‌కు వెళ్లగా వచ్చే సరిగా తన సంఘం క్రాంతి సొసైటీని ఫోర్జరీ సంతకంతో కాజేశారని సిరిసిల్ల ఆసాముల సంక్షేమ సంఘం అద్యక్షుడు కొండా ప్రతాప్‌ చెప్పారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ నాయకులు అరాచకాలని ప్రశ్నించలేని అనేక మంది ఆత్మహత్యలే శరణ్యమని మరణిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెరాస ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలకు ఒక లక్ష యాబై వేల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించగా అది సైతం వారికి చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. సిరిసిల్లలో మరణించిన నేతన్నలకు ఎక్స్‌గ్రేషియా అందజేస్తే మరింత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అందుకే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదని ఆశాఖకు సంబంధించిన ఏడీ అధికారి చెప్పడం ఇక్కడ టీఆర్‌ఎస్‌ అరాచకాలకు నిదర్శనంగా నిలిచింది. బతుకమ్మ చీరల కోసం ఈసంవత్సరం ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేయగా అందులో 116 కోట్లతోనే చీరలు తయారు చేశారని మిగతా 135 కోట్లు ఎవరు మింగారో వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు ప్రశ్నించారు. సిరిసిల్ల పట్టణంలో 60ఎకరాల్లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేయగా అందులో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన మంత్రి కేటీఆర్‌ వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయిలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. 2009వ సంవత్సరం నుండి ఇప్పటివరకు సుమారు 800 మంది నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడటం తెరాస పరిపాలను నిదర్శనం అని వారు తెలిపారు. తెలంగాణాలో చేనేత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. తెలంగాణా వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన చేనేత కార్మికుల ఆశలు, ఆకాంక్షాలు తీరకపోవటంతో ఆత్మహత్యల పరంపర కొనసాగింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 800 మంది చేనేత, మరమగ్గాల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో అత్యధిక మంది చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణానికి చెందినవారే కావటం గమనార్హం. ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవటమే దీనికి ప్రధాన కారణమని చేనేత నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మళ్ళీ ఎన్నికలు వచ్చాయి… మళ్ళీ నాయకులు హామీలు గుప్పిస్తున్నారు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడినట్టే అని చెప్పిన సీఎం కేసీఆర్‌, జౌళి శాక మంత్రి, స్థానిక శాసన సభ్యుడు కేటిఆర్‌.. నేతన్నల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సిరిసిల్ల పట్టణంలోని 80మంది నేతన్నల ఆత్మహత్యలు ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా నేతన్నలు ఆలోచించాలీ…. మళ్ళీ మాటలు చెప్పే… ఉత్తుత్తి హామీలు గుపించే నాయకులకు తమ ఓటు తోనే సమాధానం చెప్పాలి… ఇది ఒక్క సిరిసిల్ల కి సంబందిచ్చినదే కాదు.. మొత్తం తెలంగాణ కు సంబందించినది… అందుకే రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలు సంఘటితమైఎవరైతే తమకు అందుబాటులో ఉండి,తమ సమస్యలను పరిష్కరిస్తారో వాళ్ళకే ఓటు వేయాలి.

సామాజిక, ఆర్థిక స్థితిగతులను సర్వే చేస్తామన్న సర్కారు…

ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయలేదు. ఇదే సయమంలో వివిధ సంఘాల ఒత్తిడి మేరకు తూతూ మంత్రంగా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో కేవలం 17 వేల మగ్గాలే ఉన్నాయని పేర్కొన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం 25 వేల మగ్గాలున్నాయి. దీన్నిబట్టి సర్వేను ఎంత అసమగ్రంగా, అసంపూర్ణంగా నిర్వహించారనే విషయం తేటతెల్లమవుతున్నది. మగ్గం నేసే వారితోపాటు ఆ ప్రక్రియకు ముందు, ఆ తర్వాత ఎంత మంది కార్మికులు అనుబంధ వ త్తులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని సర్వేలో పేర్కొనలేదు. అందువల్ల నామ్‌కే వాస్తేగా నిర్వహించిన ఈ సర్వే అత్యంత లోపభూయిష్టంగా ఉందని చేనేత వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

కాగితాలకే పరిమితమైన కేటిఆర్‌ హామీలు…

మరోవైపు కేటీఆర్‌ చేనేత, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత… చేనేత ప్రతినిధులు, సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా చేనేతకు ప్రత్యేక పాలసీని రూపొందించటం ద్వారా ఆ రంగాన్ని అభివ ద్ధిపరుస్తామని హామీనిచ్చారు. కానీ ఆయన హామీ నెరవేరలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతోపాటు 2017-18 వార్షిక బడ్జెట్‌లో చేనేత, జౌళి రంగానికి ప్రభుత్వం రూ.83 కోట్లను కేటాయించింది. కానీ చేనేత అభివ ద్ధి, కార్మికుల సంక్షేమానికి ఎన్ని నిధులు, ఏయే పద్దుల ప్రకారం ఖర్చు చేస్తారనే విషయాన్ని పేర్కొనలేదు. దీంతో చేనేతకు కేటాయించిన నిధులన్నీ జౌళికే పోతున్నాయని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారం పై మీమాంస

శాశ్వత పరిష్కారం పై ఏ మాత్రం ద ష్టి పెట్టకుండా కేవలం టిఆర్‌ఎస్‌ కార్యకర్తల లబ్ది కోసం ఈ దుస్థితికి నెట్టేశారు. సింగరేణి,, రైల్వే శాఖ, పోలీసు, మిలిటరీ, నర్సులు తదితర వ తి ఉద్యోగాల్లో ఉన్న వారికి చేనేత బట్ట సరఫరా చేయడానికి క్యాలెండర్‌ ప్రకారం నిర్ణయించారు. నాణ్యత కలిగిన బట్ట ఇస్తామని చెప్పారు. కానీ అదంతా కేవలం కాగితాలకే పరిమితయింది. ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అని నేతన్నలు చెప్పుతునారు.2003-04లో సిరిసిల్ల శివారులో 60 ఎకరాల్లో రూ.7 కోట్ల వ్యయంతో టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. 112 ప్లాట్లలో పరిశ్రమల స్థాపన జరిగింది. పార్కులో 1432 మరమగ్గాలపై 1800 మంది కార్మికులు ఉపాధి పొందుతారని అంచనా వేశారు. నీటి వసతి లేకపోవడంతో ప్రాసెసింగ్‌ యూనిట్లు, సైజింగ్‌ పరిశ్రలు ఇప్పటికీ ఏర్పడలేదు. దీంతో అనుకున్న లక్ష్యం నేరవేరడం లేదు.

రాజకీయ అంశంగానే…

‘సిరిసిల్ల’పై నిత్యం రాజకీయం జరుగుతూనే ఉంది. 2008లో కార్మికుల ఆత్మహత్యల తీవ్రత పెరగడంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, అప్పట్లో కొత్తగా పార్టీలు పెట్టిన దేవేందర్‌ గౌడ్‌, చిరంజీవి కూడా సిరిసిల్లలో పర్యటించారు. బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులూ కార్మికులను పరామర్శించారు. కేసీఆర్‌ తమ పార్టీ పక్షాన రూ.50 లక్షల నిధిని ఏర్పాటు చేసి వెళ్లారు. కానీ… అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు అమలులోకి రాలేదు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్న కావూరి సాంబశివరావు సిరిసిల్ల పర్యటనకు వచ్చి మెగా పవర్‌ లూం క్లస్టర్‌, యార్న్‌ బ్యాంకు, మరమగ్గాల ఆధునీకరణ పథకాలను అందిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ను కలిసి విన్నవించుకున్నా.. 5 మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్లలో సిరిసిల్లకు చోటు దక్కలేదు.

రాంప్రసాద్‌ బలవన్మరణం… ఓటింగ్‌ సరళిని మార్చేస్తుందా..?

తాజాగా గీసుకొండ రాంప్రసాద్‌ ఆత్మహత్య సిరిసిల్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ శాశన సభకు జరగనున్న ఎన్నికల్లో భారీ మార్పునకు సంకేతంగా నిలువనుందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. తెరాస అస్థవ్యస్త నిర్ణయాల కారణంగానే రాంప్రసాద్‌ మరణించాని,తమ గోడును చెప్పుకుందామనుకున్నా వినేవారు లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెప్పారు. మంత్రి కేటీఆర్‌అండతో అరాచకం రాజ్యమేలుతుందనడానికి నిదర్శనంగా నేతన్నల ఆత్మహత్యల వ్యవహారం కొనసాగుతుందని వారు వివరించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close