Featuredస్టేట్ న్యూస్

విదేశాల్లో కేటీఆర్‌ మనసంతా ఇక్కడే..

  • మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం
  • దావోస్‌ నుంచి సమీక్షించిన మంత్రి
  • పెట్టుబడులకై పలు సంస్థలతో చర్చలు
  • దావోస్‌లో బిజీగా మంత్రి కెటిఆర్‌

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం కార్యక్రమానికి వెళ్లిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌… మునిసిపల్‌ ఎన్నికలపై బాగానే దృష్టి పెట్టినట్లున్నారు. ఆయన ఎప్పటికప్పుడు నేతలతో మాట్లాడుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతలకు దావోస్‌ నుంచే ఆయన కీలక సూచనలు చేశారు. పోలింగ్‌ వ్యూహం గురించి ఫోన్‌లో చర్చించారు. ఎన్నికలు పూర్తయ్యే చివరి క్షణం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు పనిచేసినట్లుగానే ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా పనిచేయాలని సూచించారు. ప్రచారంపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్‌… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలను అభినందించారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని, ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదేనని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. ఓటు పడేలా క్షేత్రస్తాయిలో పనిచేయాలని అన్నారు.

పెట్టుబడులకై పలు సంస్థలతో చర్చలు

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వివిధ సంస్థల ప్రతనిధులలో భేటీ అయ్యారు. దావోస్‌ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీ నీరజ్‌ కుమార్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హెచ్‌పీఈ సీవోవో విశాల్‌ లాల్‌తో కూడా కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్‌ వారికి వివరించారు. సోమవారం ప్రారంభమైన 50వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో టెక్నాలజీ ప్రయోజనాలు- ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరుగనున్నది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు- సవాళ్లను నివారించడం అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారు. సమావేశాల సందర్భంగా ప్రపంచదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్క్‌, జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌, కృత్రిమ మేధ, ఎలక్టాన్రిక్‌ సహా పలురంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close