రేవంత్‌ కోటలో కేటీఆర్‌ హల్‌చల్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రముఖ పార్టీలన్ని ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ ప్రచార కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొత్త పంథాల్లో చేపడుతోంది. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు బరిలోకి దిగుతున్న నియోజకవర్గాలపై ఫోకస్‌ చేసి ప్రచార కార్యక్రమాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్‌ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడుతూ…రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. రేవంత్‌ కు దమ్ముంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై గెలిచి చూపించాలని…అలా చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే….కొడంగల్‌ లో గెలవకుంటే రాజకీయ సన్యాసానికి రేవంత్‌ సిద్ధమా? అంటే కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. వంత్‌ రెడ్డి గాలి మాటలు వదిలి అభివద్ది పనులు చేసి చూపించాలన్నారు. తెలంగాణ ప్రజలకు మళ్లీ ఢిల్లీ గులాంలు, అమరావతి బాద్‌షాలు అవసరమా? అని కేటీఆర్‌ ప్రజలను ప్రశ్నించారు. కొడంగల్‌ ప్రజలు ఎవరి పక్షాన నిలవాలో విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలన్నారు. సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలో.. ప్రజల మధ్య ఉంటే సీఎం కావాలో తేల్చుకోవాలని కేటీఆర్‌ కొడంగల్‌ వాసులకు సూచించారు.

హైకోర్టు విభజనను.. చంద్రబాబు అడ్డుకున్నారు

ఎన్టీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజనను అడ్డుకున్నాడని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ఆన్నారు. అంబర్‌పేట్‌లో బుధవారం జరిగిన అడ్వకేట్‌ ఫర్‌ టీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమానికి పైకి కనపడే ఒక మకుటం టీఆర్‌ఎస్‌ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ బిడ్డలు వెన్నుదన్నుగా నిలిచారని.. కులాలు, మతాలు మరచి అందరం ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఎన్నికలు పూర్తికాగానే హైకోర్టు విభజన జరుగుతుందని నాకు నమ్మకం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరిగిందని, ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదని, పాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్‌ అన్నారు. తండాలను కూడా గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని, గిరిజనులు అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టామని తెలిపారు. సత్వర న్యాయం కోసం న్యాయవ్యవస్థలోనూ కొన్ని మార్పులు తీసుకొస్తామని తెలిపారు. వచ్చే జనవరిలో మన హైకోర్టు మనకు వస్తుందన్నారు. 1956 నుంచి 2014 వరకు ఒక్క రంగారెడ్డి జిల్లా మాత్రమే ఏర్పడిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో ఎన్నో ఉద్యమాలను అణచివేశామని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నాడని, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తదని జైరాం రమేశ్‌కు సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం అని ఆరోపించారు. తనపై ఎలాంటి విచారణ వచ్చినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటు అని కేటీఆర్‌ విమర్శించారు. కొత్త జిల్లాల్లో డిస్టిక్ట్ర్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని, న్యాయవ్యవస్థలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్‌ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here