Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

నదీపరీవాహక ప్రాంతాల జలమయం

  • ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు
  • జూరాలకు 9లక్షల క్యూసెక్కుల వరదనీరు
  • నాగార్జున సాగర్‌ 26గేట్లు ఎత్తిన అధికారులు
  • ప్రాజెక్టుల వద్ద సందర్శకుల తాకిడి

నల్గొండ

రాష్ట్రంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. గంటగంటకు కృష్ణానది ఉధృతి పెరుగుతోంది. దీంతో నారాయణపేట, గద్వాల జిల్లాల పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే జూరాల నుంచి శ్రీశైలంకు.. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరదనీరు పోటెత్తడంతో సోమవారం నాగార్జున సాగర్‌కు చెందిన 26గేట్లను ఎత్తి వరదనీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టుకు 9లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తోంది. పెరుగుతున్న ఇన్‌ఫ్లో ఆధారంగా గంటగంటకు గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం.. 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 560 అడుగులకు చేరింది. సాగర్‌ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ 230 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. గేట్లు ఎత్తడంతో సాగర్‌ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. రెండు రోజులు ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగితే పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారనుంది. అనంతరం ప్రకాశం బ్యారేజీ విూదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ బంగాళాఖాతాలో చేరనుంది.

నారాయణపూర్‌ నుంచి భారీగా వరద..

కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్ట్‌ కు  వరద పోటెత్తింది. అటు తుంగభద్ర  నుంచి  నీళ్లు విడుదల  కావడంతో  శ్రీశైలానికి వరద అంతకంతకు  పెరుగుతోంది. జూరాల నుంచి  కేవలం 13 రోజుల్లోనే 359 టీఎంసీల నీరు శ్రీశైలానికి చేరుకుంది. 24 గంటల్లో శ్రీశైలం నుంచి దాదాపు 60 టీఎంసీలకుపైగా విడుదల చేశారు. ప్రస్తుతం జూరాలకు 9లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతుండగా.. అక్కడి నుండి శ్రీశైలానికి  7లక్షల  47వేల  క్యూసెక్కులకుపైగా  వరద వచ్చిచేరుతుంది. దీంతో 10గేట్లను ఎత్తి.. 8లక్షల  50వేల  క్యూసెక్కుల  వరదను అధికారులు కిందికి వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి సామర్థ్యం  215  టీఎంసీలు  కాగా.. ప్రస్తుతం 181 టీఎంసీల నిల్వఉంది. ఇదిలా ఉంటే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో ప్రాజెక్టుల వద్ద వరద ఉధృతిని తలికించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు మాచర్ల వైపు నుంచి సాగర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్‌ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

నీటమునిగిన పంటపొలాలు..

కృష్ణానది పరీవాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న వ్యవసాయక్షేత్రాల్లో సాగు చేసిన పంటలు 

నీటమునిగాయి. పలు పుణ్యక్షేత్రాల్లోకి సైతం వరదనీరు చేరింది. తెలంగాణలో కృష్ణానదికి ముఖద్వారమైన మాగనూరు వద్ద వాసూనగర్‌ గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాయి. హిందూపూరు, మురహర్‌దొడ్డి, ముడుమాల, పసుపుల, నందిమళ్ల తదితర గ్రామాల పరిధిలో పెద్దఎత్తున పంటలు నీటమునిగాయి. ధరూరు మండలంలో నెట్టెంపాడు, ఖమ్మంపాడు, గార్లపాడు తదితర గ్రామాల్లో పంటపొలాల్లోకి వరదనీరు చేరింది. గద్వాల మండలంలో బీరెల్లి గ్రామంలోకి వరదనీరు వచ్చింది. రేకులపల్లి, గుంటిపల్లి నది అగ్రహారం తదితర గ్రామాల్లో పంటలు నీటమునిగినట్లు రైతులు తెలిపారు. బీచుపల్లి రామాలయంలోకి వరదనీరు చేరింది. అటు మక్తల్‌ మండలంలోని పసుపుల వద్ద పుణ్యక్షేత్రమైన దత్తక్షేత్రంలోకి నీరు చొచ్చుకుపోయింది. రక్షణ చర్యల్లో భాగంగా అక్కడున్నవారిని పోలీసులు ఖాళీ చేయించారు. గద్వాల మండలం నదీ అగ్రహారం వద్ద ఆలయాల్లోకి వరదనీరు చేరింది. ఇటిక్యాల మండలంలో కొండపేట, సాసనూలు, యాక్తాపురం, వీరాపురం, దువ్వాసిపల్లి, ఆర్‌.గార్లపాడు, కార్పాముల గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లోకి వరదనీరు చేరటంతో పంటలు నీటమునిగాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close