కొండగట్టు బాధితులకు ‘చెక్’

0

★ ప్రభుత్వ ఖాతాలో నిధులు లేక చెక్కులు ‘బౌన్స్’
★ ఇదేంటని అడిగితే గేటు బయటకు వెళ్ళమన్న అధికారి
★ దర్నాకు దిగిన బాధిత కుటుంబాలు
(రమ్యా చౌదరి, ఆదాబ్ హైదరాబాద్)

సెప్టెంబరు 11, 2018 కొండగట్టు బస్సు దుర్ఘటన. ఆర్టీసీ చరిత్రలోనే ఓ విషాదకరమైన సంఘటన. అందరూ తల్లడిల్లారు. అయ్యో… అంజన్న సన్నిధిలో జరిగిన దారుణానికి గుండెలన్నీ మౌనంగా రోదించాయి. ప్రభుత్వ పెద్దలు వచ్చారు. పరామర్శించారు. ఎనిమిది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అందాకా బాగానే ఉంది. పరిహారం చెక్కులు బాధితులకు వచ్చాయి. పోయిన ప్రాణాలు తిరిగి రాకపోయినా… చనిపోయినోళ్ళ పేరుతో వచ్చిన చెక్కులతో కొన్ని ఆర్థిక అవసరాలు తీరుతాయనకున్న వాళ్ళకు… చెల్లని చెక్కులు రిక్కించిన చెవులతో వెక్కిరించాయి.
‘అదేంటి సారూ..’అని అధికారులను అడిగితే… ‘గేటు బయటకు నడవండి’ అని అహంకారంతో ఘీంకరించారు. నాలుగు పైసల కోసం కక్కుర్తి పడి నిట్టనిలువునా ప్రాణాలు తీసినోళ్ళకు మానవత్వం ఎక్కడుంటుంది.?

బాధితుల కథనం మేరకు:
సెప్టెంబరు 11, 2018 కొండగట్టు బస్సు దుర్ఘటన జరిగింది. మృతి చెందిన 62 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షలు, సంఘటనకు బాధ్యులైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3లక్షల పరిహారం.. మొత్తం కలిపి 8 లక్షల రూపాయలను బాధితుల కుటుంబాలకు అందిస్తున్నట్లు.. ఎంపీ, తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు స్పష్టంగా ప్రకటించారు.
ప్రభుత్వం కూడా ఆ మేరకు చెక్కులను పంపిణీ చేసింది. అయితే ఆ చెక్కులు సంబంధిత ప్రభుత్వ ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడంతో సహజంగానే ‘బౌన్స్’ అయ్యియి. విషయం కనుక్కోవడానికి బాధిత కుటుంబ సభ్యులు ఆర్డీఓ దగ్గరకు వెళితే.. ‘గేటు బయటకి నడవండి’ అనడంతో అవాక్కైన వారు అక్కడే రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
అయితే దర్నా విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసు అధికారి కూడా ‘మీ గొంతమ్మ కొరికలు తీర్చడానికి ఆర్డిఓ, కలేక్టర్ కి వేరే పని ఉండదా..?’ అన్నారు. దీంతో ధర్నాలో ఉద్రిక్తిత నెలకొంది. ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే తమను పరమార్శించడానికి కనీసం ముఖ్యమంత్రికి సమయం లేదా అని విమర్శించటం కనిపించింది. పరిస్థితి చేజారిపోయి, విషమించే అవకాశం గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన దర్నా జరిగే దగ్గరకు వచ్చారు. బాధిత కుటుంబాల వారికి నచ్చచెప్పి సర్థిపంపారు. అయితే చెక్కుల సొమ్ము ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here