నా రైలు ఎక్కడ..? రైల్వే కొత్త యాప్‌లకు ఆదరణ

0

(సికింద్రాబాద్): రైల్వే శాఖ ప్రయాణికులకు హైటెక్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒకప్పుడు రైలు టికెట్టు తీసుకోవాలంటే చాంతాడంత వరుసలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఏ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నా తలప్రాణం తోకకు వచ్చేది.  అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రస్తుతం ఏ రైలు ఎక్కడ ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. సాధారణ, ప్లాట్‌ఫాం టికెట్లు కూడా యాప్‌ సహాయంతో చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే బుక్‌ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. తాజాగా రైల్వే శాఖ యాప్‌లను మరింత ఆధునికీకరించడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారింది.

రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ యాప్‌నకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రయాణికులు గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ స్టోర్‌లోకి వెళ్లి వేరీజ్‌ మై ట్రైన్‌ అని టైప్‌ చేస్తే.. యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అనంతరం పేరు, మొబైల్‌ నెంబరు తదితర వివరాలు నిక్షిప్తం చేసిన తరువాత వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌ సహాయంతో ఏ రైలు ఎక్కడ ఉందో కచ్చితంగా తెలుస్తుంది. నిరీక్షణ జాబితాలో మన టికెట్‌ ఉన్నప్పుడు పీఎన్‌ఆర్‌ను టైప్‌ చేస్తే కన్ఫమ్‌ అవుతుందో లేదో కూడా తెలియజేస్తుంది.

ప్లాట్‌ఫాం టికెట్లు కూడా… :
ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చిటికెలో టికెట్టు కొనుగోలు చేసి సుఖంగా ప్రయాణించేందుకు రైల్వే శాఖ రూపొందించిన ‘యూటీఎస్‌’ యాప్‌కు కొత్త మెరుగులు దిద్దారు. ఇప్పటి వరకు సాధారణ టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకునే సౌకర్యం ఉండగా తాజాగా ప్లాట్‌ఫాం టికెట్లు కూడా తీసుకునే సౌకర్యం కల్పించారు. రైల్వేస్టేషన్‌కు 25 మీటర్ల పరిధిలోనే టికెట్లు తీసుకునే విధంగా ఉన్న నిబంధన ఇప్పుడు తొలగిపోయింది. రైల్వేస్టేషన్‌, రైల్లో, ఇంటి వద్ద ఎక్కడ ఉన్నా అంతర్జాలం సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యాప్‌ సహాయంతో సాధారణ, ప్లాట్‌ఫాం టికెట్లు సులువుగా పొందవచ్చు. టికెట్‌ ప్రింట్‌ అవసరం లేదు. తనిఖీ సిబ్బందికి ఫోన్‌లో మెసేజ్‌ చూపిస్తే సరిపోతుంది. యాప్‌లోని ఆర్‌ వ్యాలెట్‌తో పాటు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా నగదు చెల్లించవచ్చు. ఈ యాప్‌తో కాగితరహిత చెల్లింపులు పుంజుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here