ఆరోగ్య రహస్యం తెలుసా !

0

రోజులో 24 గంటలు. తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందు వరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకు నచ్చినట్టు, వీలైన వేళల్లో ఆహారం తీసుకుంటుంటారు. మరికొందరిలో ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు ఉంటుంది. కానీ, అన్నపానీయాల విషయంలో సమయ నియమాలు ఉన్నాయి. అదేంటి, ఎందుకన్నది తెలుసుకుందాం…

అరటిపండ్లు

పేదవాడి నుంచి సంపన్నుల వరకు అందరూ ఇష్టపడే పండు ఇది. అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కండర బలోపేతానికీ పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థకు మేలు కలిగిస్తుంది. ఇది సహజ యాంటాసిడ్‌ గా పనిచేస్తుంది. కడుపులో మంట ఉంటే బాగా పండిన ఒక అరటి పండు తింటే తగ్గుతుంది. అరటి పండును భోజనం తర్వాత తీసుకోవడం చాలా మంది చేసే పని. కానీ, రాత్రి భోజనం తర్వాత మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్‌ ఏర్పడడానికి, జలుబుకు దారితీస్తుంది. అందుకే దీన్ని రాత్రుళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. దానికి బదులు మధ్యాహ్న సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే, ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అసౌకర్యానికి కారణమవుతుంది.

యాపిల్స్‌

రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ తో పని లేదన్న మాట వినే ఉంటారు. ఎందుకంటే యాపిల్‌ లో ఉండేవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. మరీ ముఖ్యంగా ఇందులో పెక్టిన్‌ అనే ఫైబర్‌ సమ ద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను, కొలెస్ట్రాల్‌ ను నియంత్రిస్తుంది. మలబద్ధకపు సమస్యను దూరం చేస్తుంది. అందుకే ఆరోగ్య ప్రదాతల్లో ఈ పండు కూడా ఒకటి. కానీ, యాపిల్‌ ను రాత్రి వేళల్లో తినకపోవడమే మంచిది. యాపిల్‌ లో ఉండే యాసిడ్స్‌ కడుపులో యాసిడ్‌ స్థాయులను పెంచుతాయి. అంతేకాదు, పెక్టిన్‌ వల్ల రాత్రి వేళల్లో జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. పెక్టిన్‌ కారణంగా అసిడిటీ మొదలవుతుంది. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లో భాగంగా యాపిల్స్‌ తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది.

యాపిల్స్‌ తొక్క తీసేయవద్దు

యాపిల్‌ లో 116 కేలరీలు, 5.4 గ్రాముల ఫైబర్‌, 239 మిల్లీ గ్రాముల పొటాషియం, విటమిన్‌ సీ, 120 ఐయూల విటమిన్‌ ఏ, 4.9 మైక్రోగ్రాముల విటమిన్‌ కే ఉంటాయి. పొట్టు తీసేసిన యాపిల్‌ లో 194 మిల్లీ గ్రాముల పొటాషియం, 2.3 గ్రాముల ఫైబర్‌ 8.6 మిల్లీగ్రాముల విటమిన్‌ సీ, 82 ఐయూల విటమిన్‌ ఏ, 1.3 మైక్రోగ్రాముల విటమిన్‌ కే ఉంటాయి. తొక్కు తీసేస్తే విలువైనవి తగ్గిపోతాయి. తొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. కేన్సర్‌ కణాలపై పోరాడే ట్రిటెర్పెనాయిడ్స్‌, శ్వాసకోస సమస్యలను నివారించే క్వెర్సెటిన్‌ అనే కాంపౌండ్‌ ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్‌ తింటే ఊపిరితిత్తుల పనితీరు చక్కగా ఉంటుంది. అంతేకాదు క్వెర్సెటిన్‌ రసాయనం జ్ఞాపకశక్తిని కూడా రక్షిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇంకా తొక్కలో స్థూలకాయంపై పోరాడే ఉర్సోలిక్‌ యాసిడ్‌ కూడా ఉంటుంది.

రైస్‌

మన దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాది వారికి అన్నం ప్రధానాహారం. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో భాగంగా రైస్‌ తీసుకుంటుంటారు. బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి తక్షణ శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అవసరమే. కానీ అచ్చం అన్నాన్నే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నేసి కార్బోహైడ్రేట్లను శరీరం ఖర్చు చేయలేదు. దాంతో అవి కొవ్వుగా మారతాయి. దాంతో బరువు పెరుగుతారు. అందుకే జీవక్రియలు అధికంగా ఉండే పగటిపూట రైస్‌ తీసుకోవాలి. డిన్నర్‌ లో అన్నానికి బదులు వేరే పదార్థాలను తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా రోజులో ఒకపూట అన్నాన్ని పరిమితంగానే తీసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మాంసం

మాంసం ప్రొటీన్ల సమాహారం. ఇది జీర్ణం అయ్యేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. అందుకే రాత్రుళ్లు మాంసాహారాన్ని తీసుకోరాదు. ఎందుకంటే మాంసం ద్వారా వచ్చే అధిక కేలరీలు ఖర్చు కావు. దాంతో అవి కొవ్వుగా మారిపోతాయి. రాత్రికి బదులు మాంసాన్ని ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తినడమే నయం. గ్రిల్డ్‌, బేక్డ్‌ వైట్‌, లీన్‌ మీట్‌ అయితే తేలిగ్గా జీర్ణమవుతాయి.

నట్స్‌

బాదం, పిస్తా, వాల్‌ నట్స్‌ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె, మెదుడు ఆరోగ్యానికి మంచివి. కానీ, వీటిలో అధిక ఫ్యాట్‌, కేలరీలు ఉంటాయి. కనుక డిన్నర్‌ తర్వాత తీసుకుంటే బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే సాయంత్రం వేళలో రోజుకు ఐదారు నట్స్‌ కు మించకుండా తినాలన్నది పోషకాహార నిపుణుల సూచన. ఇక అంజీర (ఫిగ్స్‌), అప్రికాట్స్‌ ను ఎర్లీ మార్నింగ్‌ తీసుకోవడం మంచిది. దీనివల్ల జీవక్రియలను ప్రేరేపించినట్టు అవుతుంది. రాత్రి పూట తీసుకుంటే అజీర్ణం, గ్యాస్‌ కు కారణమవుతాయి.

డార్క్‌ చాక్లెట్‌

డార్క్‌ చాక్లెట్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వయసు మీద పడుతున్న సమయంలో కనిపించే లక్షణాలను ఇవి నియంత్రించి యవ్వనంగా కనిపించేలా చేయగలవు. గుండె జబ్జుల నియంత్రణలోనూ వీటిది కీలకపాత్రే. కానీ, రోజంతా నచ్చినప్పుడల్లా డార్క్‌ చాక్లెట్‌ ను తీసుకుంటే బరువు పెరగానికి కారణం అవుతుంది. అందుకే చాలా పరిమితంగా ఒకటి రెండు చాక్లెట్లకు అదీ ఉదయం మాత్రమే తీసుకునేలా నియంత్రించుకోవాలి.

పెరుగు

పెరుగు జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు సాయపడుతుంది. సాధారణంగా పగటిపూట పెరుగు తీసుకోవడం మంచిది. రాత్రి పూట తినకుండా ఉంటే బెటర్‌. ఆయుర్వేదం కూడా పెరుగును రాత్రి తీసుకోవద్దనే చెబుతోంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి వాటికి తరచుగా గురయ్యేవారు, అలర్జీ సమస్యలు ఉన్న వారు రాత్రుళ్లు పెరుగు తీసుకోరాదు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్‌ ఏర్పడేందుకు ఇది కారణమవుతుంది. దాంతో దగ్గు, జలుబు సమస్యలు పెరిగిపోతాయి.

తీపి పదార్థాలు

ఉదయమే అనుకులం. సాయంత్రం తర్వాత తీపి పదార్థాల జోలికి పోరాదు. ఉదయం వేళల్లో మన శరీరంలోని ఇన్సులిన్‌ చక్కెరలపై పోరాడే విషయంలో చాలా చురుగ్గా ఉంటుంది. పైగా పగటి పూట పనుల వల్ల వంట్లోని చక్కెరలు కరిగిపోతుంటాయి. కానీ, రాత్రి పరిస్థితి వేరు. శరీరానికి చక్కెరలు ఎక్కువ అవసరం లేదు. మరి ఈ సమయంలో ఎక్కువ చక్కెర పదార్థాలను తీసుకోవడం వల్ల అవి పూర్తిగా ఖర్చు కావు. దాంతో కొవ్వుగా మారి శరీర బరువు పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు కూడా ఆటంకం.

జున్ను

ఉదయం తీసుకోవడం మంచిది. శాకాహారులకు ఇది మంచి బలవర్థకమైన ఆహారం. ఓ మోస్తరుగా తింటే బరువును నియంత్రిస్తుంది. కడుపుబ్బరాన్ని కంట్రోల్‌ చేస్తుంది. రాత్రి తింటే మాత్రం అరగడం కష్టమవుతుంది. బరువు పెరుగుతారు.

పాలు

శారీరక శ్రమ ఎక్కువగా ఉంటేనే పగటి పూట పాలు తాగాలి. లేదంటే పగటి పూట పాలు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో అన్నం తినాలనిపించదు. ఫలితంగా భోజన వేళలు మారిపోతాయి. రాత్రి పూట వెచ్చని పాలు తాగడం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మంచి నిద్ర పడుతుంది.

వ్యాయామం తర్వాత

వ్యాయామం ఏదైనా కండరాలకు శ్రమే. వ్యాయామాలకు కండరాలు బలోపేతం అవుతాయి. అదే సమయంలో కండర నిర్మాణం సరిగా జరగాలంటే సరైన పోషకాలు అవసరం. అందుకే వ్యాయామం అనంతరం తీసుకునే అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్‌ రేషియో 2:1గా ఉండాలి. ఇది స్వల్ప వ్యాయామాలు, మధ్యస్థంగా చేసేవారికి. ఎక్కువ సమయం పాటు అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేసేవారికి ఈ రేషియో 3:1గా ఉండాలి. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు గ్లైకోజెన్‌ ను తిరిగి భర్తీ చేస్తాయి. గ్లైకోజెన్‌ అనేది శక్తినిచ్చేందుకు వీలుగా నిల్వ ఉన్న గ్లూకోజ్‌. కండరాలను తిరిగి నిర్మించడంలో ప్రోటీన్లది కీలకపాత్ర.

సుదీర్ఘ సమావేశం తర్వాత…

ముఖ్య సమావేశం… ఎప్పుడో పొద్దున మొదలైతే సాయంత్రం 6కు ముగిసింది. దీంతో కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! కానీ, ఇలాంటి సుదీర్ఘ సమావేశాల తర్వాత కొన్ని బాదం గింజలను తినాలి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, కొంత ప్రొటీన్‌ ను భర్తీ చేస్తాయి. ప్రొటీన్లు శరీరంలోని కణాలను యాక్టివేట్‌ చేస్తాయి. అంతేకానీ షుగర్‌ ఉన్న పదార్థాలను తీసుకోరాదు. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌ ను అందిస్తాయి. దాంతో మెదడుకు శక్తినిస్తాయి. కానీ, ప్రొటీన్‌ అన్నది సమావేశంలో ఏం జరిగిందో అది గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్రొటీన్‌ లో భాగమైన అమినో యాసిడ్‌ టైరోసిన్‌ అనేది ఓ న్యూరో ట్రాన్స్‌ మిటర్‌. మెదడుకు శక్తినివ్వడంలోనూ, అప్రమత్తతలోనూ కీలక పాత్ర పోషిస్తుంది . ఎప్పుడైనా ఎంతో ఓపిక, సహనంతో కూడిన కార్యక్రమం తర్వాత, చెమటలు పట్టే పని తర్వాత గ్లైకోజెన్‌ ను తిరిగి భర్తీ చేయడంపై ద ష్టి పెట్టాలి. అందుకే పరుగు పందేలు, ఇతర శ్రమతో కూడిన కార్యక్రమాల తర్వాత కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, కొంత ప్రొటీన్‌ ఉన్న వాటిని తీసుకోవాలి.

రాత్రి విశ్రాంతి లేకుంటే ఏ ఆహారం…?

రాత్రంతా సరిగా నిద్ర పట్టకుంటే మర్నాడు ఉదయం బలహీనంగా, నీరసంగా అనిపించడం సహజం. పరిశోధకుల అధ్యయన ఫలితాల ప్రకారం… రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్ల పగటి పూట ఘెర్లిన్‌ పెరగడంతోపాటు లెప్టిన్‌ తగ్గుతుంది. దీంతో ఆకలి పెరిగిపోయి బాగా తినాలనిపిస్తుంది. ఇలాంటి వారు 30 గ్రాముల నట్స్‌ తీసుకోవాలి. లేదంటే లీన్‌ మీట్‌ తీసుకోవాలి. దీంతో ఆకలి నెమ్మదిస్తుంది. లేదంటే పెరుగుకు అరటిపండు కలిపి తీసుకున్నా ఫర్వాలేదు.

రాత్రి మేల్కొని ఉంటే ఏ ఆహారం?

అధిక పని కారణంగా రాత్రి నిద్ర పోయే అవకాశం లభించలేదు. లేదంటే మధ్యపానం వల్ల ఉదయం లేచేసరికి తల పట్టేసినట్టుగా అనిపించింది. అప్పుడు ఏం చేయాలి…? టమాటా జ్యూస్‌ తీసుకోవాలి. ఇది శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్‌ ను తిరిగి భర్తీ చేస్తుంది.

బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌

ఈ మూడింటికి అనువైన వేళల గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఉదయం నిద్ర లేచిన తర్వాత అరగంటకు అల్పాహారం తీసుకోవడం అనువైనదని పోషకాహార నిపుణులు చెప్పేమాట. అనువైన సమయం ఏదీ అంటే ఉదయం 7 గంటలు. బ్రేక్‌ ఫాస్ట్‌ ఆలస్యం అయితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం 10 గంటల తర్వాత తీసుకోవడం సముచితమే కాదు.

మధ్యాహ్నం 12.45 నుంచి 1 గంట లంచ్‌ కు అనువైనది. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత, మధ్యాహ్నం లంచ్‌ కు మధ్య కనీసం నాలుగు గంటల సమయం ఉండాలి. లంచ్‌ ను సాయంత్రం 4 గంటల తర్వాత తీసుకోవడం అంత మంచిదేమీ కాదు. డిన్నర్‌ కు అనువైన సమయం అంటే రాత్రి 7 గంటలు. రాత్రి భోజనం తర్వాత నుంచి నిద్ర వరకు మూడు గంటల వ్యవధి ఉండాలి. రాత్రి 10 తర్వాతకు డిన్నర్‌ ను వాయిదా వేయవద్దు. ఆలస్యంగా డిన్నర్‌ చేయడం వల్ల డిన్నర్‌ కు, నిద్రకు మధ్య సమయం తక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత నిద్రిస్తే నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది.

ఏమి తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అన్నవి బరువు నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తాయట. నిజానికి ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లో భాగంగా తీసుకోవాల్సిన దోశ, ఇడ్లీ, పూరీ ఇలాంటి ఐటమ్స్‌ ను లంచ్‌, డిన్నర్‌ గానూ తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, ఆరోగ్యరీత్యా ఇది మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

9-10 గంటల మధ్య

నచ్చిన చాక్లెట్‌ ను తినడానికి అనువైన సమయం ఇది. చాక్లెట్‌ ద్వారా కార్బోహైడ్రేట్లు, షుగర్‌ అధిక మోతాదులో శరీరంలోకి చేరతాయి. స్వీట్‌ తినడానికి ఉదయమే సరైన సమయమని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ పరిశోధకుల మాట. ఇది జీవక్రియలను ఉత్సాహపరుస్తుందట.

10 గంటలకు కాఫీ

ఉదయం బెడ్‌ కాఫీ తీసుకోవడం చాలా మందిలో చూడొచ్చు. కానీ, పరిశోధకులు మాత్రం కాఫీ లేదా టీ తాగేందుకు ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్న వరకు అనువైనదని చెబుతున్నారు. పొద్దున్నే లేచిన వెంటనే కాఫీ, టీలు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కెఫైన్‌ కు శరీరం అనువుగా మారుతుంది. దాంతో ఇది సహజంగా మన శరీరానికి శక్తినిచ్చే కార్టిసోల్‌ హార్మోన్‌ ను తగ్గించేస్తుంది. అందుకే ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య అనువైనది.

డైటింగ్‌ మంచిదేనా?

దేవుడిపై భక్తితో ఉపవాసం కావచ్చు, బరువు తగ్గాలన్న ధ్యాస కావచ్చు… కారణమేదైనా గానీ కడుపు మాడ్చటం మంచిది కానే కాదు. ఆహారం తీసుకోకపోతే దానికి బదులు ఏదో ఒకటి కొద్దిమొత్తమైనా తీసుకోవాలి. ఏదీ తినకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. మరీ ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ కూడా మిస్‌ కావద్దు. దానివల్ల ఆకలి పెరిగిపోయి ఆ తర్వాత ఎక్కువ కేలరీలు తీసుకునేందుకు దారితీస్తుంది. బరువు తగ్గే ఆలోచనతో డైటింగ్‌ చేయాలనుకునేవారు, కడుపు మాడ్చటం వంటి పనులను మానుకుని కొంచెం కొంచె పరిమాణంలో ఆహారాన్ని రోజులో ఆరు సార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆహారానికీ ఓ డైరీ

రోజూ తినే ఆహార పదార్థాల వివరాలను డైరీకెక్కించాలన్నది నిపుణుల సలహా. దీనివల్ల ఎంత మేర తింటున్నాం అన్నదానిపై అవగాహన ఉంటుంది. దాంతో ఆహారంపై నియంత్రణ సాధ్యం అవుతుంది.

బ్రేక్‌ ఫాస్ట్‌ ను మిస్‌ కావద్దన్నది వైద్య నిపుణుల సూచన. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలిందేమంటే… బ్రేక్‌ ఫాస్ట్‌ ను తీసుకోని వారికి గుండెపోటు లేదా ప్రాణాపాయ ముప్పు 27 శాతం ఎక్కువగా ఉందని. బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోకపోవడం వల్ల ఆకలి బాగా పెరిగిపోతుంది. దీంతో మధ్యాహ్నం తీసుకునే లంచ్‌ పరిమాణం అధికమవుతుంది. ఇది బ్లడ్‌ షుగర్‌ పెరగడానికి దారితీస్తుంది. దీనివల్ల డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రజర్‌, అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో గుండెకు ముప్పు ఏర్పడుతుంది.

ఉదయం… మధ్యాహ్నం… రాత్రి…. ఏం తీసుకోవాలి…?

ఉదయం తీసుకునే ఆహారం శరీరంలో బ్లడ్‌ షుగర్‌ పరిమాణాలు మిగిలిన రోజంతా ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తుందట. హోల్‌ గ్రెయిన్‌, కొంత ఫ్యాట్‌, ప్రొటీన్‌ ఉన్న ఆహారం తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ నిదానంగా పెరిగి, నిదానంగా తగ్గుతుంది. రిఫైన్డ్‌, అధికంగా తీపి ఉండే పదార్థాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోయి, ఆ తర్వాత మరింత తక్కువ స్థాయికి తగ్గిపోతాయి. దాంతో మళ్లీ ఎక్కువ ఆకలి వేస్తుంది. ఫలితంగా జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినే అలవాటుకు దారితీస్తుంది. అందుకే శరీరంలో బ్లడ్‌ షుగర్‌ ఒకే రీతిలో ఉండేందుకు వీలుగా ఉదయం ఓట్‌ మీల్‌ తీసుకోవడం మంచిది. లేదంటే ఆమ్లెట్‌, పాలకూర, అవకాడో తీసుకోవచ్చు.

నిజానికి బ్రేక్‌ ఫాస్ట్‌ ను కింగ్‌ సైజు తినాలని చెబుతారు. లంచ్‌ అనేది ప్రిన్స్‌ లా, డిన్నర్‌ ఈ రెండింటి కంటే తక్కువ పరిమాణంలో ఉండాలంటారు పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు. సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అందుకే బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌ తగినంత తీసుకోవాలి. రాత్రుళ్లు విశ్రాంతికి వెళతాం గునుక డిన్నర్‌ స్వల్పంగా ఉండాలి. ఒకవేళ లంచ్‌ తక్కువగా, డిన్నర్‌ ఎక్కువగా తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్నవారు కనీసం డిన్నర్‌ లో తీసుకునే ఆహారం చాలా తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలు, సలాడ్‌ ఎక్కువ తీసుకోవాలి.

నిద్రకు సమయం దగ్గర పడుతున్న వేళల్లో తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్‌, ఇన్సులిన్‌ స్థాయి పెరుగుతుంది. దాంతో నిద్ర తొందరగా రాదు. పట్టినా ఆ నిద్ర అంత గాఢంగా ఉండదు. ముఖ్యంగా రాత్రి డిన్నర్‌ తర్వాత ఇంకే ఆహారం తీసుకోవద్దు. కొందరు తియ్యటి పదార్థాలు, ఫ్రిజ్‌ లో నుంచి ఐస్‌ క్రీమ్‌ తీసుకుని తింటుంటారు. ఇది మరీ ప్రమాదకరం. చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇవి మెలటోనిన్‌ అనే హర్మోన్‌ ను తక్కువ చేస్తాయి. ఈ హార్మోనే అలసిపోయినట్టు, విశ్రాంతి భావనలను కలిగించేది. ఈ హార్మోన్‌ తగ్గడం వల్ల మెదడుకు సంకేతాలు సరిగా ఉండవు. దాంతో నిద్ర రమ్మన్నా రాదు.

ఉదయం 6-7 గంటల మధ్య

ఉదయం ఎర్లీగా నిద్రలేవడం ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్పేమాట. ఉదయం లేచిన వెంటనే 6-7 గంటల మధ్య ఓ గ్లాస్‌ నీటిని తాగడం వల్ల శరీరంలో నీటి సమతుల్యత ఏర్పడుతుంది. మిగిలిన దేశాలతో పోలిస్తే జపాన్‌ లో సగటు ఓ వ్యక్తి ఆయుర్దాయం రెండున్నరేళ్లు అధికంగా ఉంది. అక్కడ నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల నీటిని తాగే అలవాటు చాలా మందిలో ఉంది. నీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలం నుంచి ఉన్న కీళ్ల నొప్పులు ఉపశమించడంతోపాటు, కేన్సర్ల నియంత్రణకు వీలు పడుతుందట.

7 గంటలకు

నచ్చిన చాక్లెట్‌ ను తినడానికి అనువైన సమయం ఇది. చాక్లెట్‌ ద్వారా కార్బోహైడ్రేట్లు, షుగర్‌ అధిక మోతాదులో శరీరంలోకి చేరతాయి. స్వీట్‌ తినడానికి ఉదయమే సరైన సమయమని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ పరిశోధకుల మాట. ఇది జీవక్రియలను ఉత్సాహపరుస్తుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here