అట్టుడుకుతున్న కేరళ

0

తిరువనంతపురం : కేరళ ఇంకా అట్టుడుకుతోంది. ఆందోళనలు శనివారం కూడా తీవ్రస్థాయిలో కొనసాగాయి. శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనతో రాష్ట్రం రణరంగంగా కనిపిస్తోంది. పలు చోట్ల అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కన్నూర్‌ జిల్లా ఇరిత్తి ప్రాంతంలో సీపీఎంకు చెందిన కార్యకర్తపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు ఆందోళన కారులు దాడిచేసి అతన్ని

కత్తితో గాయపరిచారు. ఎమ్మెల్యే ఎ.ఎన్‌.షంషీర్‌ ఇంటిపై కూడా దాడి చేశారు. తస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి.మురళీధరన్‌ నివాసంపై ఆందోళనకారులు బాంబులు విసిరారు. ఆ సమయానికి ఎంపీ కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ ఎవరికీ ఏవిూ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో దాడులకు రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కుట్రలు చేస్తోందని షవిూర్‌ ఆరోపించారు. కల్లోల పరిస్ధితులను సృష్టించి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తన ఇంటిపై దాడి వెనుక సీపీఎం హస్తం ఉందని మురళీధరన్‌ ఆరోపించారు. ఆందోళనకారుల దాడుల్లో 99 ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. ధ్వంసమైన బస్సులతో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని భద్రతా బలగాలను తరలించారు. హింసాత్మక ఘటనలు కొనసాగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మరోవైపు శనివారం తెల్లవారు జామున కన్నూరులోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి నిప్పుపెట్టారు. కోజికోడ్‌ జిల్లాలో సీపీఎం, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం వరకు ఆందోళనలు ఏ మాత్రం సద్దుమణగలేదు. గురువారం నుంచి ప్రారంభమైన ఆందోళనలు తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటి వరకు పోలీసులు 1800 మందిని అరెస్టు చేశారు.

ప్రధాని మోదీ ర్యాలీ వాయిదా..

కేరళలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. 'జనవరి 6న పతాన్‌మత్తిట్టాలో జరగాల్సిన ప్రధాని మోదీ పర్యటన ఇతర కార్యక్రమాల కారణంగా వాయిదా పడింది. కేరళలో ప్రస్తుత పరిస్థితులకు, ప్రధాని పర్యటన వాయిదా పడటానికి సంబంధం లేద'ని బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది దక్షిణాదిలో ప్రధాని మోదీ పాల్గొనబోయే మొదటి రాజకీయ ర్యాలీ ఇదే కావటం గమనార్హం. 

ఆలయంలోకి 8మంది మహిళలు?

మరోవైపు, శబరిమల ఆలయంపై సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించారని కేరళ పోలీసులు ప్రకటించారు. కానీ ఈ ప్రకటనను శబరిమల కర్మ సమితి ఖండించింది. ఇందులో ఏ మాత్రం నిజంలేదని, మరింత మంది మహిళలు శబరిమలకు రావాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఇలాంటి బూటకపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడింది. శ్రీలంక మహిళ శశికళ కూడా ఆలయంలోకి వెళ్లలేదని, స్వయంగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించినా, ఫేక్‌ వీడియోలు విడుదల చేస్తున్నారని వ్యాఖ్యానించింది. భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. దక్షిణ కేరళలోని పాలక్కడ్‌, నెడుమంగడ్‌, ఉత్తర కేరళలోని మంచేశ్వరంలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. మహిళల ప్రవేశం తర్వాత ఆలయాన్ని మూసివేసిన తంత్రి, సంప్రోక్షణ నిర్వహించడంపై ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డ్‌ వివరణ కోరింది. ఇలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమేనని కేరళ సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన పూజారి రాజీవ్‌ కందరారు తక్షణమే విరణ ఇవ్వాలని టీడీబీ ఆదేశించింది. 

శబరిమల వివాదంపై స్పందించిన ఐరాస

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో నెలకొన్న వివాదంపై ఐక్య రాజ్య సమితి స్పందించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని ఐరాస ప్రస్తావించింది. అందరూ చట్టాన్ని గౌరవించాలని ఐరాస ప్రోత్సహిస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌, ఉప అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ వెల్లడించారు. ఈ విషయంపై భారతదేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, కాబట్టి ఆ విషయాన్ని భారత్‌లోని అధికారులకే వదిలేయాలని తెలిపారు. అందరూ చట్టాన్ని గౌరవించాలని తాము కోరుకుంటున్నామని ఫర్హాన్‌ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలన్నదే ఐరాస ప్రాథమిక ప్రాధాన్యమని అందరికీ తెలిసిన విషయమే అని పేర్కొన్నారు. శబరిమల వివాదంలో కేరళ రణరంగంగా మారిన నేపథ్యంలో శబరిమల విషయంలో ఐరాస వైఖరి చెప్పాలని విలేకరులు అడగగా.. ఆయన పై విధంగా స్పందించారు. ఇటీవల శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. బంద్‌లు, ఘర్షణలలతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

ఇంకా రణరంగంగానే కేరళ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here