Featuredప్రాంతీయ వార్తలు

కేసీఆర్‌వి తుగ్లక్‌ చర్యలు

ప్రజాధనాన్ని దుర్వినియోగం

  • సచివాలయం కూల్చివేతను అడ్డుకుంటాం
  • రూ. 2లక్షల కోట్ల అప్పులో రాష్ట్రం
  • గుర్తింపుల కోసం కొత్త భవనాలు..

హైదరాబాద్‌ : అసెంబ్లీ, సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయం తుగ్లక్‌ చర్య అని, కేసీఆర్‌ తుగ్లక్‌ పాలనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు సోమవారం సచివాలయ భవనాల సందర్శన చేపట్టారు. సచివాలయ భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ భవనాలను సందర్శించి తాజా పరిస్థితులను తెలుసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎల్పీలో సమావేశమైన నేతలు సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. సచివాలయం వద్ద భారీగా బందోబస్తుగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, సచివాలయ భవనాలను పరిశీలించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేసీఆర్‌ నిర్ణయాలపై తీవ్రంగా మండిపడ్డారు. భవనాల నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని వృథాచేస్తున్నారని

మండిపడ్డారు. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. భవనాల కూల్చివేత నిర్ణయం తుగ్లక్‌ చర్యగా భావిస్తున్నామన్నారు. శాసనసభ, సచివాలయ నిర్మాణం కేసీఆర్‌ కుటుంబ వ్యవహారం కాదని, అన్ని సదుపాయాలు ఉన్న భవనాలను ఉపయోగించుకోవాలని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సచివాలయ భవనాలు నాణ్యతగా, సక్రమంగా ఉన్నాయని భట్టి తెలిపారు. కొత్త సచివాలయ నిర్మాణం కేవలం సీఎంకు సంబంధించిన విషయం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ వ్యక్తిగత భవనాలను నిర్మించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కొత్త భవనాలు నిర్మిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించాలని కోరారు. ప్రజాధనం వృథా కావొద్దనేదే తమ అభిప్రాయమని మరో కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌ బాబు అన్నారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి అసలు ఇక్కడి భవనాల పరిస్థితి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. భవనాలను పరిశీలించిన తర్వాతే కొత్త నిర్మాణంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌ రెడ్డి, విజయరామారావు, కొండేటి శ్రీధర్‌ తదితరులు సచివాలయాన్ని సందర్శించారు.

మూఢనమ్మకాల పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం:రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై విరుచుకుపడ్డారు మల్కాజ్‌ గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి. సీఎం కేసీఆర్‌ మూఢనమ్మకాల పిచ్చితో పాలన సాగిస్తున్నట్లున్నారని ఆరోపించారు. మూఢనమ్మకాల పిచ్చితోనే సచివాలయాన్ని కూల్చివేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆధునిక పరిజ్ఞానంతోనే ప్రస్తుత సచివాలయాన్ని నిర్మించారని 100 ఏళ్లు కోసం నిర్మించిన సచివాలయంలోని ఏ భవనం కనీసం 30 ఏళ్లు కూడా ఉపయోగించలేదన్నారు. కేసీఆర్‌ తన మూఢ నమ్మకాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ. వెయ్యి కోట్ల విలువైన భవనాలను కూలగొడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం సచివాలయం ఉండగా నూతన సచివాలయాన్ని నిర్మించాలన్న కేసీఆర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అంగీకరింబోదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా అమరవీరుల స్మారకానికి పునాదిరాయి పడలేదు కానీ, ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకుంటార అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన విధ్యాభవనాలు నిర్మించాలని సవాల్‌ విసిరారు. సచివాలయాన్ని కూల్చడంపై న్యాయస్థానంలో ప్రజావ్యాజ్యం వేసినట్లు తెలిపారు. సచివాలయ భవనాల కూల్చివేతను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందన్న రేవంత్‌ రెడ్డి అవసరమైతే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కూడగట్టి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఎంపీ రేవంత్‌ రెడ్డి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close